మనసిచ్చి నిలిచా... మోసపోయి వగచా!

ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందంటారు. నిజమో? అబద్ధమో? తెలియదు. నేను మాత్రం...

Published : 21 Jan 2017 01:35 IST

మనసిచ్చి నిలిచా... మోసపోయి వగచా!

ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందంటారు. నిజమో? అబద్ధమో? తెలియదు. నేను మాత్రం ప్రాణంగా ప్రేమించిన ఓ అమ్మాయి బాగుపడటానికి కారణమయ్యా. మరి తను నాకేం బహుమతి ఇచ్చింది?
నా డిగ్రీలో మా ప్రేమ మొదలైంది. తనపుడు ఇంటర్‌. చిన్నప్పుడే ఆమె నాన్న చనిపోయారు. అమ్మ వేరొకరితో సహజీవనం చేసేది. ఆ ఇద్దరూ కలిసి తనని చిత్రహింసలు పెట్టేవారు. ‘అయ్యోపాపం’ అనిపించేది. ఆ జాలి నుంచే ప్రేమ మొగ్గ తొడిగింది. తనని ముద్దుగా ‘పండు’ అని పిలిచేవాణ్ని.
‘నరేంద్రా... మా అమ్మ నన్ను వాడి దగ్గరికెళ్లమంటోంది. అలా చేస్తేనే డిగ్రీలో చేర్పించడానికి డబ్బులిస్తాడట. నాకు బతకాలని లేదు’ భోరుమంది ఓరోజు. నా గుండె రగిలిపోయింది. ఛీ... ప్రపంచంలో ఇలాంటి తల్లి కూడా ఉంటుందా? అనిపించింది. ‘నీకేం భయం లేదు. నిన్ను నేను చదివిస్తా’ మాటిచ్చా. ఏవో సాకులు చెప్పి ఇంట్లోంచి డబ్బులు తెస్తూ పండుని పీజీ దాకా చదివించా. మధ్యమధ్యలో మేం కలుసుకుని కష్టసుఖాలు పంచుకునేవాళ్లం.
పండు చదువు పూర్తైంది. తనేదైనా ఉద్యోగం చేస్తేనే గుర్తింపు, గౌరవం. నా సంగతి వదిలేసి తన కోసం చాలాచోట్ల ప్రయత్నించా. కొలువు సంపాదించడం అనుకున్నంత సులువేం కాదని అర్ధమైంది. ఆఖరికి ఓ స్నేహితుడిని బతిమాలి పండుని ఓ రిటైల్‌స్టోర్‌లో సేల్స్‌ప్రమోటర్‌గా పెట్టించా. ఎనిమిదివేల జీతం. ‘నువ్వే గనక లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో’ కన్నీళ్లు పెట్టుకుంది. ‘పిచ్చిదానా మనిద్దరిదీ ఒకే జీవితం’ అంటూ గుండెలకు హత్తుకున్నా.
తనుద్యోగంలో కుదురుకుంది. ప్రేమప్రయాణం సాఫీగానే సాగుతోంది. ‘డిసెంబరులో మంచి ముహూర్తాలు ఉన్నాయట. పెళ్లి చేసుకుందామా?’ అడిగా. నీళ్లు నమిలింది. బహుశా పెద్దలు అడ్డుపడతారని భయం కాబోలు! ‘మా ఇంట్లో ఓకే. మీ అమ్మ ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు. ఏమంటావ్‌?’ నా మాటకి కొంచెం సమయం కావాలంది. ఒకటి.. రెండు.. ఆర్నెళ్లు గడిచాయి. ఎటూ తేల్చదు.
ఓరోజు పండు పనిచేసేచోటికే వెళ్లా. ఆరోజు రాలేదట. తన గురించి అడుగుతుంటే నన్నంతా జాలిగా చూస్తున్నారు. ఎందుకని ఆరా తీస్తే ‘తను ఇక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో పడింది’ అనేమాట నా గుండెల్లో ఈటెలా దిగింది. నేను నమ్మలేదు. కానీ ఆ నమ్మకం వమ్ము కావడానికి వారం పట్టలేదు. మరోసారి ఆఫీసుకొస్తే ఆ అబ్బాయితో సన్నిహితంగా కనిపించింది. అక్కడే నిలదీశా. ‘క్షమించు... ఇంకోసారలా చేయను’ అంది తలొంచుకొని. పదకొండేళ్ల ప్రేమని వదిలేయడానికి మనసొప్పలేదు.
నెలరోజుల్లో పెళ్లి ముహుర్తం పెట్టించా. అంగీకారం తెలిపింది. మనిషి మారిందనుకున్నా. నా మనసుతో ఇంకా ఆటలాడుతోందని తర్వాతే అర్థమైంది. పెళ్లి పనుల హడావుడిలో నేను తిరుగుతుంటే ఆ అబ్బాయితో బైక్‌పై షికార్లు చేస్తూ కనిపించింది. ఉన్నచోటే కుప్పకూలిపోయా. తర్వాత గుండె పగిలే మరిన్ని తెలిశాయి. వాళ్లిద్దరు భార్యాభర్తలమని చెప్పి ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారట. ఈ బంధానికి వాళ్ల అమ్మ కూడా ఆమోదం ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంతలా మోసగిస్తుందనుకోలేదు.
పెళ్లి పెటాకులైంది. రోజంతా తన ఆలోచనలే. మోసపోయాననే బెంగే. తిండి మానేశా. ఆరోగ్యం పాడై నెలరోజులు బెడ్‌ మీదే ఉన్నా. సాటి మనిషిగానైనా ఒక్కరోజైనా వచ్చి చూడలేదు. ఈమధ్యలో వచ్చిన నా పుట్టినరోజుకీ పలకరించలేదు. తన కోసం నా సరదాలు వదులుకున్నా. కెరీర్‌ని నిర్లక్ష్యం చేశా. శూన్య హస్తాలతో... మనసు నిండా బాధతో జీవచ్ఛవంలా ఉన్నా. నా పరాజయానికి కారణం ఆ అమ్మాయే.

- నరేంద్ర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని