నాన్నా.. నీ ప్రేమ కావాలి!

చేతిలో అపాయింట్‌మెంట్‌ లెటర్‌. మనసులో కొంచెం సంతోషం.. కొంచెం అలజడి. బెరుకుబెరుగ్గా బ్యాంకు లోపల అడుగుపెట్టా. ఎదురుగా క్యాబిన్‌లో ఒకాయన సీరియస్‌గా పని చేస్తున్నారు.

Published : 28 Jan 2017 01:21 IST

నాన్నా.. నీ ప్రేమ కావాలి!

చేతిలో అపాయింట్‌మెంట్‌ లెటర్‌. మనసులో కొంచెం సంతోషం.. కొంచెం అలజడి. బెరుకుబెరుగ్గా బ్యాంకు లోపల అడుగుపెట్టా. ఎదురుగా క్యాబిన్‌లో ఒకాయన సీరియస్‌గా పని చేస్తున్నారు. ‘హలో కెన్‌ ఐ స్పీక్‌ టు శ్రీనివాస్‌ సర్‌’ అన్నా ఆయన దగ్గరికెళ్లి. తలెత్తి ‘యెస్‌.. చెప్పండి’ అన్నారు నేనేనన్నట్టు. ఆయన చేతిలో లేఖ పెట్టా.

శ్రీనివాస్‌ సర్‌ సీనియరే కాదు చాలా మంచోడు కూడా. ఎవరికే ఆపద, సందేహం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చేవాడు. ఏడాదిపాటు ప్రతి పనికీ సర్‌.. సర్‌ అంటూ ఆయన వెనకాలే తిరిగా. ఆపై మా మధ్య సర్‌, గారు పిలుపులు మాయమై ‘నువ్వూ’ అనే స్థాయికి చేరాం. కలిసి భోంచేయడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఒకరికొకరం చిన్నచిన్న బహుమతులిచ్చుకోవడం మామూలైంది.

రాన్రాను పని ఒత్తిడి ఎక్కువైంది. తట్టుకోలేక రాజీనామా చేశా. కొత్త ఉద్యోగం వెతుకులాటలో పడిపోయా. ప్రతిక్షణం శ్రీనే గుర్తొచ్చేవాడు. ఎందుకో అతడి ఎడబాటు నేను తట్టుకోలేకపోయా. నాది స్నేహం కాదు ప్రేమని అర్థమైంది. అటువైపు పరిస్థితేంటి? ఏమో.. నాకైతే తెలియదు. అమ్మాయినైనా నేనే సిగ్గు విడిచి ‘ఐలవ్యూ శీనూ’ అన్నా ఓరోజు. ‘పిచ్చిమొద్దూ ఇంత ఆలస్యంగా చెప్పడం. ఈ మాట కోసం ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నా తెలుసా?’ అన్నాడు. నా మనసు తీన్మార్‌ డ్యాన్స్‌ ఆడింది. స్నేహితులం ప్రేమికులమయ్యాం. పార్కులు, సినిమా థియేటర్లు, కెఫేలు... మేం తిరగనిచోటు లేదు.

ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. నా గుండెల్లో దడ మొదలైంది. మనసంతా శీనూనే ఉంటే నాకెవరు నచ్చుతారు? ఏదో వంక చెప్పి ఒకట్రెండు సంబంధాలు తప్పించేశా. ఇంకా ఎన్నాళ్లీ అబద్ధాలు? ‘నాన్నా నాకింక సంబంధాలు చూడొద్దు. నేను శ్రీనుని ఇష్టపడ్డా. అతడ్నే పెళ్లాడతా’ ఓరోజు తెగేసి చెప్పా. వివరాలడిగారు నాన్న. బ్యాంకు ఉద్యోగం.. కుటుంబ పద్ధతులు.. సాయం చేసే గుణం అన్నీ నచ్చాయి. కులమే అడ్డుపడింది. ‘నీకు నచ్చినవాడ్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఉంది. అలా చేస్తే మేం ఈ సమాజంలో తలెత్తుకోలేమమ్మా. అతడ్ని మర్చిపో’ అన్నారు. మన కష్టసుఖాల్ని పట్టించుకోని ఈ సమాజం గురించి ఆలోచించొద్దని నాన్నను బతిమాలా. విన్లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దల్ని కాదని మేం గుడిలో ఒక్కటయ్యాం. పరువు పోయిందని నాన్న ఏడ్చారు. బంధువులు కొట్టినంత పన్జేశారు.

చూస్తుండగానే ఐదేళ్లు గడిచాయి. మాకో బాబు. శీను నన్ను మహరాణిలా చూసుకుంటున్నాడు. అయినా ఏదో వెలితి. మంచి మార్కులొస్తేనో.. మంచి పని చేశాననో గుండెలకు హత్తుకొని మురిసిపోయే నాన్న నా పక్కన లేరు. చెడుదారిలో వెళ్తే మొట్టికాయలేసి మంచీచెడూ వివరించే నాన్న అండగా లేరు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొచ్చేది. అయినా నా ప్రయత్నాలు ఆపలేదు. అన్నట్టు ఈమధ్యే నాన్న మాట కలిపారు. ఆయన మనసులో ఉన్న కాఠిన్యం కరిగిపోయిందనుకున్నా. కానీ ఏదో పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడారు. నాక్కావాల్సింది అది కాదు. రోజూ నా చిటికెనవేలు పట్టుకొని నడిపించిన నాన్న కావాలి. చెడుదారిలో వెళ్తే బెత్తం పట్టి దండించిన ఆ నాన్న కావాలి. నాకు శీను అంటే ఇష్టం. దానర్థం మీరంటే ఇష్టం లేదని కాదు. నాన్నా దయచేసి అర్థం చేసుకొని ఆదరించండి ప్లీజ్‌.

- అన్విత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని