అలాంటి అనుభవం ఎవరికీ వద్దు!

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలు వద్దంటున్నా చాటుమాటుగా కలుసుకోసాగారు. ఆ తప్పటడుగే వారి పాలిట శాపమైంది. ఇంతకేమైంది? ఆ కుర్రాడి మాటల్లోనే.

Published : 04 Mar 2017 01:44 IST

అలాంటి అనుభవం ఎవరికీ వద్దు!

అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలు వద్దంటున్నా చాటుమాటుగా కలుసుకోసాగారు. ఆ తప్పటడుగే వారి పాలిట శాపమైంది. ఇంతకేమైంది? ఆ కుర్రాడి మాటల్లోనే.

మరదలితో నాది ఎనిమిదేళ్ల ప్రేమ. ‘నువ్వంటే నాకు ప్రాణం బావా’ లెక్కలేనన్నిసార్లు అనుంటుంది నాతో. ఇలాంటి అమ్మాయి దొరకడం ఏ కుర్రాడికైనా హ్యాపీనే కదా!

  మా ప్రేమ పెద్దలకు నచ్చేది కాదు. ‘ముందు చదువు, ఉద్యోగం సంగతి చూడండి. సెటిలైతే మేమే మీ పెళ్లి చేస్తాం’ షరతు విధించారు. వరసైనోళ్లం. వయసుమీదున్నాం. ప్రేమించుకుంటే తప్పేంటట? మా కళ్లకి వాళ్లు విలన్లలా కనిపించారు. పైపెచ్చు వాళ్లు వద్దు వద్దంటే మాకు కలుసుకోవాలనే ఆరాటం ఎక్కువైంది. మరెలా? ఒకరింటికి ఇంకొకరం వెళ్లలేం. వూళ్లొ తిరిగితే జనాల కంట్లో పడతాం. వూరవతలున్న అటవీప్రాంతం మా తీవ్రమైన సమస్యకి పరిష్కారంగా కనిపించింది.

నెలకోసారైనా అక్కడికెళ్లేవాళ్లం. కోరినంత ఏకాంతం. మా ముద్దూముచ్చట్లకు హద్దే లేదిక. ఒకరి ఒడిలో ఇంకొకరం తల పెట్టుకొని కబుర్లు చెప్పుకోవడం.. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ గంటలు గడిపేయడం.. అచ్చం సినిమా హీరోహీరోయిన్లలా ఫీలైపోయేవాళ్లం.

రోజులన్నీ ఒకేలా ఉండవుగా! ఓసారి ఎప్పట్లాగే మా లోకంలో మేమున్నాం. వెనకనుంచి ఎవరో అపరిచితులు ముగ్గురు వచ్చి అమాంతం మాపై దాడి చేశారు. వాళ్ల ఒంట్లోంచి గుప్పుగుప్పుమంటూ మద్యం వాసన. ‘రేయ్‌.. ఈ పిల్లతో కాసేపు మమ్మల్నీ రొమాన్స్‌ చేయ్‌నీరా’ అన్నాడొకడు. ఏం జరుగుతుందో క్షణంపాటు అర్థం కాలేదు. తేరుకొని నోరు తెరవబోతుంటే నాపై పిడిగుద్దులు కురిపించారు మూకుమ్మడిగా. కుప్పకూలిపోయా. ఒకడు మరదల్ని దూరంగా లాకెళ్లిపోతున్నాడు. మూలుగుతూనే ‘పారిపో.. పారిపో’ అనరిచా. గింజుకోవడం మానేసి ‘మా బావని కొట్టొద్దు’ అని ఏడుస్తోంది. నేనంటే ఎంత ప్రేమ తనకి! నాపై మరో రెండు దెబ్బలేసి మిగతా ఇద్దరూ నా చిట్టితల్లి చుట్టూ మూగారు. ఎంత బతిమాలినా వినకుండా కర్కశంగా ఆక్రమించుకోసాగారు. ‘ప్లీజ్‌.. వదలండి’ దీనంగా ఏడుస్తోంది తను. ఆ క్షణం నాపై నాకే అసహ్యం వేసింది. ప్రాణం పోయినా సరే మరదలి మానం కాపాడాలి అనుకుంటూ పైకి లేచా. వాళ్ల దగ్గరికి పరుగెత్తి పిడికిలి బిగించి ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని ఒక్కొక్కడి కడుపులో గుద్దా. తాగిన మత్తులో ఉండటంతో ఒకట్రెండు దెబ్బలకే కూలబడిపోయారు. క్షణం ఆలస్యం చేయకుండా పరుగందుకున్నాం. తుప్పలు, ముళ్లపొదలు, ఎత్తుపల్లాలు ఏవీ చూడకుండా పరుగెత్తుతూనే ఉన్నాం. కిందపడ్డాం.. లేచాం. శరీరమంతా రక్తాలు కారుతున్నాయి. పరుగు మాత్రం ఆపలేదు. ఐదు నిమిషాల్లో రోడ్డుమీదికొచ్చాం.

జరిగింది తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. అమ్మాయిని ప్రేమించడం.. ఏకాంతంగా కలుసుకోవడం.. హీరోయిజం అనుకునేవాణ్ని. ఆరోజుతో పటాపంచలైంది. పెళ్లి కాకుండానే చాటుమాటుగా కలుసుకోవడం.. పెద్దల్ని మోసగించడం తప్పని కూడా తెలిసొచ్చింది. పైపెచ్చు ఇలాంటి చాటుమాటు సరసాలు ప్రేమికుల్ని చిక్కుల్లో పడేస్తాయి. వూహించని భయంకర పరిస్థితి తీసుకొస్తాయి. మన తప్పటడుగులు చెడ్డవాళ్లకు అవకాశం కల్పిస్తాయి. అందుకు మేమే సాక్ష్యం. ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లికి ముందే ఏదో చేయాలనుకోవడమే తప్పు. ప్రేమిస్తే ధైర్యంగా ఉండండి. నిజాయతీతో పెద్దల్ని ఒప్పించండి.

- ఓ పాఠకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని