ఆదుకున్న మనసులకు ఆయువు నేనవుతా

రైలు వేగంగా వెళ్తొంది. ఆ వేగాన్ని మించి నా మదిలో ఆలోచనలు.

Published : 13 May 2017 01:13 IST

ఆదుకున్న మనసులకు ఆయువు నేనవుతా

రైలు వేగంగా వెళ్తొంది. ఆ వేగాన్ని మించి నా మదిలో ఆలోచనలు.

గుంటూరు జిల్లాలోని ఓ పల్లెటూరు మాది. కూలి దొరికితేనే ఇంట్లో పొయ్యి వెలిగే కుటుంబం. ‘నేనింక నిన్ను సదివించలేనయ్యా. ఆడపిల్ల పెళ్లికి ఎదుగుతావుంది. నువ్వూ బాజ్జత తెలుసుకోవాల’ నాయన మాటతో పది పాసయ్యాననే సంతోషం ఆవిరైంది. పెళ్లీడుకొచ్చిన అక్క, నా వెనక చెల్లి... ఆయన మాత్రం ఏం చేస్తారు? వేసవి సెలవుల్లో కూలికెళ్లడం మొదలెట్టా.

ఆరోజు పొద్దునే ఒకాయన మా ఇంటికొచ్చారు. ‘లారీలో సామాను దింపాలి. ఇంకో ఇద్దర్ని ఎగేసుకొనిరా’ అన్నారు. నేనూ వెళ్లా. వాళ్లది నెల్లూరట. మా పక్కవీధిలోనే ఇల్లు కొనుక్కొని దిగారు. నాయనకి సాయం చేస్తుంటే నా వివరాలడిగారు. ‘పది ఫస్ట్‌క్లాస్‌లో ప్యాసైన కుర్రాడు కూలీగా మారడం ఏం బాగోలా. నేను సాయం చేస్తా. ఈడ్ని సదివించు’ నాయనకి ఆర్డరేశారు.

వారి పెద్దమనసుతో కాలేజీలో చేరా. ఆ కృతజ్ఞతతో అడక్కముందే చిన్నచిన్న పనులు చేసిపెట్టేవాణ్ని. టిఫిన్లు, కాఫీలు ఇచ్చి నన్ను బాగానే చూస్కునేవారు. అన్నట్టు వాళ్లకో కూతురుంది. పేరు శిరీష. నాకన్నా ఏడాది పెద్ద. తనూ ఇంటరే. క్లాసులో అర్థంకాని పాఠాలు విడమర్చి చెప్పేది. పిండివంటలు చేస్తే నాకిష్టమని దాచి మరీ ఇచ్చేది. తనని ‘చిన్నమ్మగారూ’ అనేవాణ్ని. ‘అమ్మగారేంట్రా అక్కా అని పిలు’ అన్నారోసారి పెద్దాయన. అప్పట్నుంచి నాకింకో అక్క దొరికింది. టాపర్‌గా ఇంటర్‌ పూర్తి చేశా. అయినా చదువు ముందుకు సాగదనే భయం. శిరీషక్కే దేవతలా ఆదుకుంది. ‘సురేశ్‌ చదువాపేస్తానంటే కుదరదు. వాడు ఇంజినీరింగ్‌ చేస్తాడు. ఇదుంచండి’ అంటూ నాన్న చేతిలో ఐదువేలు పెట్టింది. తన అభిమానానికి కళ్లు చెమర్చాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకూ రావడంతో హైదరాబాద్‌లో పేరున్న కాలేజీలో సీటొచ్చింది. నేను వూరొచ్చినప్పుడల్లా ఖర్చులకని వెయ్యి, రెండువేలిచ్చేది. బీటెక్‌ సెకండియర్‌లో మా సొంతక్క పెళ్లి చేశాం.

‘ఏరా మీ పక్కింటి శిరీషకి, నీకూ లవ్వంటగా. నీ ఖర్చులన్నీ తనవేనటగా. భలే పట్టావురా’ కారుకూతలు కూశాడో ఫ్రెండ్‌. మనసు చివుక్కుమంది. లాగి వాడి చెంప మీద కొట్టా. పెద్ద గొడవైంది. ‘కుక్కలు మొరిగితే మనం పట్టించుకోవద్దు. నువ్వు నా తమ్ముడివిరా’ అంది శిరీషక్క. తర్వాత తనకే ఇబ్బంది కలగొద్దని నేనే వాళ్లింటికెళ్లడం తగ్గించా. కానీ వాళ్ల సాయం మాత్రం ఆగలేదు.

చూస్తుండగానే నా బీటెక్‌ పూర్తైంది. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ సాధించడం నా కల. కోచింగ్‌ కోసం దిల్లీకి వెళ్లాలనుకున్నా. డబ్బులెలా? శిరీషక్క గుర్తొచ్చింది. మొదటిసారి నోరు తెరిచి అడిగా. ఐదురోజుల్లో నా ఖాతాలో నలభైవేలు వేయించింది. ఆర్నెళ్లు కోచింగ్‌ తీసుకున్నా. ధ్యాసంతా క్లాసులు, చదువు మీదే. నా అదృష్టంకొద్దీ కోచింగ్‌ అయిపోగానే నోటిఫికేషన్‌ వచ్చింది. బాగా రాశా. ఫలితం సానుకూలంగా వచ్చింది.

మొదటి ఫోన్‌ శిరీషక్కకే చేశా. చాలా సంతోషించింది. ‘కంగ్రాట్స్‌రా.. నాన్న కూడా ఉంటే హ్యాపీగా ఫీలయ్యేవారు’ అంటుంటే నా గుండెల్లో పిడుగు పడ్డట్టైంది. ‘ఔన్రా మూణ్నెళ్ల కిందే నాన్న నెల్లూరు వెళ్లి వస్తుంటే యాక్సిడెంటై చనిపోయారు’ అని బావురుమంది. అక్కడే కూలబడిపోయి గుండెలవిసేలా ఏడ్చా. నా చదువుకు ఆటంకం కలగొద్దనే అక్క నాకా విషయం చెప్పొద్దందట. ఇంకా పెద్దాయన వ్యాపారంలో చాలా నష్టపోయారనీ, ఇల్లు అమ్మేసి శిరీషక్క పెళ్లి చేయాలనుకుంటున్నారనీ నాయన చెప్పాడు. ఎంత దయగల కుటుంబం! వారికి ఆ పరిస్థితి రావడం తట్టుకోలేకపోయా.

రైలు కుదుపుతో ఆలోచనల్లోంచి బయటికొచ్చా. నా ఉద్యోగం, హోదా వాళ్లు పెట్టిన భిక్ష. వాళ్లిపుడు కష్టాల్లో ఉన్నారు. ఆదుకోవాలంటే నేనేం చేయాలి? శిరీషక్క పెళ్లి చేయాలి... వాళ్లింటిని అమ్మకుండా చూడాలి. నా దృఢ నిశ్చయంతో గుండె భారం తేలికైంది. సంతోషంగా రైలు దిగా.

- సురేశ్‌, పుణె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు