ఆమె కొట్టింది... నేను గెలిచాను

అదేదో పాటలో చెప్పినట్టు తనని మొదటిసారి చూడగానే నా గుండెల్లో గిటార్‌ మోగినట్టైంది.....

Published : 03 Jun 2017 01:33 IST

ఆమె కొట్టింది... నేను గెలిచాను

దేదో పాటలో చెప్పినట్టు తనని మొదటిసారి చూడగానే నా గుండెల్లో గిటార్‌ మోగినట్టైంది. అప్పుడు నా వయసు మహా అయితే మూతి మీద మీసం కూడా పూర్తిగా మొలవనంత. సీన్‌ కట్‌ చేస్తే తను మళ్లీ మా కాలేజీలో ప్రత్యక్షమైంది. ఇది కలా? నిజమా? అనుకుంటుండగానే కాళ్లకు పట్టీలు వేసుకొని ఘల్లుఘల్లుమంటూ సవ్వడి చేస్తూ నా కళ్లముందే తిరిగేది. ప¾ట్టువదలని విక్రమార్కుడిలా పాకులాడితే ఆమె పేరు ‘సన’ అనీ.. తనది పక్కూరనే సంగతి తెలిసింది. నాకిష్టంలేకపోయినా తన గ్రూపులో చేరా.

తను నన్ను ‘గుడ్‌బోయ్‌’ అనుకోవడానికి మహా ప్రయత్నించేవాణ్ని. కష్టపడి చదివి టాపర్లలో ఒకడిగా నిలవడం.. టీచర్లంటే గౌరవం చూపడం.. అడక్కుండానే అందరికీ సాయం చేయడం.. ఇలాంటివెన్నో. ఎన్ని చేసినా తను నన్ను ఓరకంటైనా చూస్తేగా! పోనీ నేనే ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పేద్దామనుకున్నా నోరు పెగిలితేగా. ఈ మాట చెప్పాలని ఓ లక్షసార్లు రిహార్సల్స్‌ వేసినా అన్నీ ఫెయిల్‌. సన నన్ను పట్టించుకోలేదుగానీ నా క్లాస్‌మేట్‌ ఒకడు నా వేషాలన్నీ పసిగట్టేశాడు. ‘రేయ్‌.. ఇలా బుద్ధిమంతుడిలా ఉంటే ఎవరూ ఏ అమ్మాయికి నచ్చర్రా. ఆకతాయిలా ఉండాలి. రౌడీయిజం చేయాలి. జోకులు పేల్చాలి. అప్పుడేరా అమ్మాయిలు మనల్ని హీరోల్లా చూస్తారు’ అంటూ జ్ఞానోదయం చేశాడు. వాడి మాటలు నా తలకెక్కాయి. నాలో ఇన్‌సైడర్‌ బయటికి రావడం మొదలెట్టాడు.

క్లాసులో టీచర్లు పాఠం చెబుతుంటే కావాలనే కౌంటర్లు వేసేవాణ్ని. అమ్మాయిల్ని కామెంట్‌ చేసేవాణ్ని. ఇక పుస్తకం ముడితే ఒట్టు. కొద్దిరోజుల్లోనే నేను కోరుకున్నట్టు జులాయి, ఇడియట్‌, పోకిరి... ఇలాంటి బిరుదులన్నీ వచ్చేశాయి. కాస్త మొండితనమూ పెరిగిందండోయ్‌! అదే ధైర్యంతో ఓరోజు ‘ఐలవ్యూ సనా.. నువ్వంటే నాకిష్టం’ అన్నా అందరిముందూ హీరోలా. సమాధానం అంతే వేగంగా వచ్చింది. క్షణం ఆలోచించకుండా చెంప ఛెళ్లుమనిపించింది. అంతటితో కథ ముగిసిందా అంటే అదీ లేదు. ‘ఇంకోసారి ఆ మాట అన్నావంటే మా అన్నయ్యతో చెప్పి తన్నిస్తాను. అయినా నీకేముందని నిన్ను ప్రేమించాలి? అందమా, చదువా, ఆస్తా? ఒకవేళ నీతో వచ్చేస్తే నాకేం కష్టం కలగకుండా చూసుకోగలవా?’ అంటూ క్లాస్‌ పీకింది. తల తీసేసినట్టైంది. అవమానంతో వారం రోజులు కాలేజీ వైపు వెళ్లలేదు. ఒక టీచర్‌ నన్ను, నా బాధని గమనించారు. భుజం మీద చేయేసి ఏమైందని అడిగారు. కన్నీళ్లు సుడులు తిరుగుతుంటే జరిగిందంతా చెప్పా. ‘ఓస్‌.. ఈమాత్రం దానికేనా అంత బాధ. నువ్వు బాగా చదివి ప్రయోజకుడివి అవ్వరా. ఇలాంటి అమ్మాయిలే నీ వెనకలా పడతారు. చదువుతోపాటు సంస్కారమూ ముఖ్యమేరా’ ఆయన మనసులోంచి వచ్చిన మాట నా గుండెను తాకింది. వంచిన తల ఎత్తకుండా పుస్తకం పట్టుకున్నా. ఇంటర్లో్ల మంచి మార్కులతోపాటు ఐఐటీ దిల్లీలో సీటొచ్చింది. అక్కడా చదువుల యాగం చేశా. బీటెక్‌ పట్టా్ట అందకముందే అమెరికాలోని ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. ఒక్కోసారి అనిపిస్తుంటుంది.. లక్షల జీతం.. మంచి హోదా.. విదేశాల్లో ఉద్యోగం.. ఆ రోజు సన కొట్టిన చెంపదెబ్బ ఫలితమేనని. ఏదేమైనా తనపై కొన్నాళ్లు కోపం పెంచుకున్నా ప్రేమ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఎంతైనా తొలిప్రేమ మజానే వేరు.

- అభి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని