నీకోసమే.. నా అన్వేషణ

అందం.. మాట.. పద్ధతి.. ఒకమ్మాయి ఒకబ్బాయికి నచ్చిందంటే కారణం

Published : 10 Jun 2017 01:33 IST

నీకోసమే.. నా అన్వేషణ

అందం.. మాట.. పద్ధతి.. ఒకమ్మాయి ఒకబ్బాయికి నచ్చిందంటే కారణం ఏదైనా అయిండొచ్చు. అలా మా ఇనిస్టిట్యూట్‌లో మొదటిసారి తనని చూసినపుడే తెగ నచ్చేసింది. క్లాసుకు వెళ్లగానే నా కళ్లు వెతికేది తన కోసమే. రోజులు గడుస్తున్నాయి. తనతో మాట కలిపే సమయం కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలో ఓసారి తను డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకి వెళ్తొందని తెలిసింది. పెద్దనోట్లు రద్దయిన రోజులవి. వరుసలో కనీసం రెండు గంటలైనా వేచి చూడటం గ్యారెంటీ. మంచి ఛాన్స్‌. తనని ఫాలో అయ్యా. నా ఖర్మకొద్దీ అక్కడేదో గొడవ జరగడం.. తనెళ్లిపోవడం.. నోరు తెరిచే అవకాశమే రాలేదు.

నా విఫల ప్రయత్నాలు.. దొంగచూపులు.. ఫాలోయింగ్‌ ఆ అమ్మాయి పసిగట్టేసింది. చూపుడు వేలు చూపిస్తూ కళ్లెర్రజేసి నా వెనక పడొద్దు సుమా అన్నట్టు బెదిరించిందోసారి. గుండెలదిరాయి. అయినా నా వరుస మార్చుకోవాలనిపించలేదు.

‘ఒక పేషెంట్‌ చావుబతుకుల్లో ఉంది. అర్జెంటుగా రక్తం కావాలి. మీలో ఎవరికైనా ఇచ్చే ఆసక్తి ఉందా?’ క్లాసు మొదలవగానే చెప్పారు మా సర్‌. నా బ్లడ్‌గ్రూపే. వెంటనే లేచి ‘నేనిస్తాను సర్‌’ అన్నా. నాతోపాటు ఇంకో ముగ్గురం సర్‌ చెప్పిన ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి వచ్చాం.

రాత్రి తొమ్మిదిన్నరకి నా ఫోన్‌ రింగ్‌ అయింది. ‘ఇప్పుడెలా ఉంది?’ అవతలివైపు ఓ అమ్మాయి. చలికాలం కదా.. బాగా చలిగా ఉందన్నా. నవ్వు ఆపుకుంటూ ‘బ్లడ్‌ ఇచ్చారు కదా.. ఆ విషయం అడుగుతున్నా. ఇప్పుడెలా ఉందండీ’ అందామె. అప్పుడు వెలిగింది లైటు. తనెవరో కాదు.. నేను నిత్యం ఆరాధించే అమ్మాయే. అయినా ఏమీ ఎరగనట్టే ‘బాగానే ఉందిగానీ ఇంతకీ మీరెవరు?’ అన్నా కొంటెగా. ‘రాణిని.. మీ ఇనిస్టి్టట్యూట్‌ క్లాస్‌మేట్‌ని’ అంది. ఆ మాటలు నా చెవులకు ఇంపుగా అనిపించాయి. ఓ పది నిమిషాలు సాగింది మా మాటల ప్రవాహం.

 

తనతో మాట్లాడుతుంటే ఇంద్రధనస్సుపై సవారీ చేసినట్టుండేది. మళ్లీమళ్లీ వినాలనిపించేంత తీయదనం. మా సంభాషణ మొదలైన నాలుగైదురోజులకే తనంటే నాకు ఎంత ప్రేమో చెప్పేశా. ‘స్నేహం అయితే ఓకే. లవ్వూగివ్వూ అన్నావంటే దోస్తీ కూడా కటీఫ్‌’ అంది కర్కశంగా. ‘మనసులో కొండంత ప్రేమ పెట్టుకొని దానికి స్నేహం అనే ముసుగు వేసుకొని ఉండలేను’ ఖరాఖండీగా చెప్పేశా. ‘అయితే నీ ఖర్మ’ తన సమాధానం.

ఆపై నన్ను చూస్తేనే మూతి ముడుచుకునేది. నేను చూడ్డ్డం మానేస్తే నన్ను ఓరకంటగా గమనించేది. మాట్లాడాలని ప్రయత్నిస్తే చిరాకు పడేది. మాట్లాడకపోతే బుంగమూతి పెట్టే్టది. కోపం, చిరాకు, సంతోషం.. ఏకకాలంలో నాపై ఫీలింగ్స్‌ చూపేది. ఇంతకీ నాపై తనకి ప్రేమ ఉన్నట్టా? లేనట్టా? ఎటూ తేల్చుకోలేకపోయేవాణ్ని. అయితే ఒకటి మాత్రం నిజం. కచ్చితంగా నేనంటే తనకి ద్వేషం, కోపం మాత్రం లేవు. ఇదేమాటంటే ‘మాది సీమ జాగ్రత్త’ అని గడసరిగా సమాధానం దాటవేసేది. ‘సీమ అయితే మాత్రం అమ్మాయిల మనసులో ప్రేమ పుట్టదా?’ అంటే నవ్వేది. తను అంటీముట్టనట్టు ఉన్నా తనపై నా ప్రేమ మర్రిమానులా పెరిగి పెద్దదవుతూనే ఉంది. ఎవరు పిలిచినా.. ఫోన్‌ చేసినా.. తనేనేమో అనే ఆశ. ఇనిస్టిట్యూట్‌ వదిలినా.. కొలువులో చేరినా మనసు మాత్రం నిత్యం రాణి నామస్మరణే చేస్తోంది.

నిన్ను తొలిసారి చూసినపుడు నాది ఆకర్షణ.. రోజులు గడుస్తున్నకొద్దీ తగని ప్రేమ.. ఇప్పుడు నువ్వుంటే నాకిష్టమైన బాధ్యత. ఇప్పటికైనా నా ప్రేమ అర్థం చేసుకొని ఆదరిస్తే మనది ముచ్చటైన జంట అవుతుంది. ఏమంటావ్‌?

- కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని