మరదలు ‘నో’ అంది... విజయం ‘ఎస్‌’ అంది!

‘రేయ్‌... మీ మామయ్య వాళ్లూరిలో జరిగే జాతరకి రమ్మని పిలుస్తున్నారు వెళ్తావా?’ నాన్న మాటతో నా గుండె వేగం రెట్టింపైంది. కారణం నా మరదలు. చింపిరి జుత్తు... అమాయకమైన కళ్లు...

Published : 24 Jun 2017 02:14 IST

మరదలు ‘నో’ అంది... విజయం ‘ఎస్‌’ అంది!

‘రేయ్‌... మీ మామయ్య వాళ్లూరిలో జరిగే జాతరకి రమ్మని పిలుస్తున్నారు వెళ్తావా?’ నాన్న మాటతో నా గుండె వేగం రెట్టింపైంది. కారణం నా మరదలు. చింపిరి జుత్తు... అమాయకమైన కళ్లు... మొహంలో చెరగని చిరునవ్వు... చాలా ఏళ్ల కిందట చూసిన తన రూపం గుర్తొచ్చింది. ఇప్పుడెలా ఉంటుందో వూహించుకుంటూనే బయల్దేరా.

‘హాయ్‌ బావా ఎలా ఉన్నావ్‌? ఇంట్లో అందరూ కులాసాయేనా?’ గుమ్మంలోనే ఎదురొచ్చి పలకరించింది. లంగా ఓణీలో... అచ్చమైన తెలుగుదనానికి చిరునామాలా ఉన్న తననలాగే కళ్లప్పగించి చూస్తుండిపోయా. ‘తను చిన్నీరా. గుర్తొచ్చిందా?’ పెద్దమ్మ మాటతో ఈ లోకంలోకి వచ్చా. కొత్త వాతావరణం. పైగా నాకసలే మొహమాటం. చిన్నీతో మాట్లాడే అవకాశమే చిక్కలేదు. తను పక్క వూరి కాలేజీలో చదువుతోందనే విషయం మాత్రం తెలుసుకోగలిగా.

జాతర ముగిసింది. తన రూపాన్ని నా మదిలో బంధించుకొని వెనుదిరిగా. తర్వాత ఒకట్రెండు సార్లు ఫోన్లో మాట్లాడే అవకాశం వచ్చినా అదీ బాగున్నావా... అంటే బాగున్నా అనేవరకే. ఇంతలో నా చదువు పూర్తై కొలువు ప్రయత్నాల కోసం వేరే రాష్ట్రానికెళ్లా. తనే గుర్తొచ్చేది. ఓరోజు తనకి గేట్‌లో మంచి స్కోరు వచ్చిందనే సంగతి తెలిసింది. ఉద్యోగం గ్యారెంటీ. ‘కంగ్రాట్స్‌ చిన్నీ... మొత్తానికి సాధించావ్‌’ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పా. దాదాపు ఇరవై నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. ఆపై వీలున్నప్పుడల్లా పలకరించుకునేవాళ్లం. అప్పట్నుంచి రోజురోజుకీ తనపై ఇష్టం పెరుగుతూనే ఉంది. అది ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు నాకు. తన మనసులో ఏముందో తెలియదు. మంచిరోజు చూసి నేనే చెప్పేద్దామనుకున్నా.

కొన్నాళ్లకి ఎమెన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాకు. ఐదంకెల జీతం. జీవితంలో స్థిరపడ్డట్టే. చిన్నీతో నా మనసులోమాట చెప్పడానికి ఇదే మంచి సమయం. ఎలాగూ వరసైంది కదాని అమ్మానాన్నలతోనే అడిగించా. ‘చిన్నీని అడిగి చెబుతాం. కొన్నాళ్లు ఆగండి’ అన్నారట మామయ్య. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిలా తయారైంది నా పరిస్థితి. వారంలోపే ఫలితాలొచ్చాయి. ప్రతికూలంగా. ‘మేనరికం కదా... భవిష్యత్తులో ఇబ్బందులుంటాయేమో...’ నసుగుతూ మా సంబంధం వద్దని చెప్పకనే చెప్పేశారు. కన్నీళ్లాగలేదు. నాలో ఏం తక్కువ? నన్నెందుకు వద్దంటుందో అసలు అర్థం కాలేదు. తర్వాత తన క్లాస్‌మేట్‌తో పెళ్లి కుదిరిందనే సంగతి తెలిశాక అసలు విషయం అర్థమైంది. పుండు మీద కారం చల్లినట్టు మనసు భగ్గుమంది.

బాధ మర్చిపోవడానికి మందు తాగా. స్నేహితులతో లాంగ్‌టూర్‌కెళ్లా. ఏం చేసినా మరుపు రాదే! మరోవైపు సరిగా పని చేయట్లేదని ఆఫీసులో చీవాట్లు. నా బాధ చూడలేక అమ్మానాన్నల ఏడుపు. బాగా ఆలోచించా. తనెలాగూ దక్కదు. అయినా తన కోసం బాధ పడుతూనే ఉండటం అర్థం లేదనిపించింది. బాధ తాత్కాలికం... బాధ్యత శాశ్వతం ఎక్కడో చదివింది గుర్తొచ్చింది. మళ్లీ పనిపై దృష్టిపెట్టా. కన్నవాళ్ల మొహాల్లో సంతోషం చూడాలనుకున్నా. ఆఫీసులో ఎక్కువసేపు ఉండటం... సినిమాలు... ఫ్రెండ్స్‌తో గడపడం... మొత్తానికి చిన్నీని తాత్కాలికంగానైనా నా మనసులోంచి తుడిచేయగలిగా. ఆపై అమ్మానాన్నల మాట కాదనలేక పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టా. ఓ మధ్యవర్తి ద్వారా పద్మజ గురించి తెలిసింది. పెళ్లి చూపులపుడే నా గతమంతా తనకి చెప్పా. నన్నర్థం చేసుకొని నా జీవితంలోకి వచ్చింది. సీన్‌ కట్‌ చేస్తే అమెరికాలో మంచి ఉద్యోగం, ఇద్దరు పిల్లలు... పండంటి కాపురం... జీవితం చాలా సంతోషంగా గడిచిపోతోంది.

ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే బాధతో ఒకబ్బాయి ప్రాణాలు తీసుకున్నాడనే వార్త ఈమధ్యే చదివా. మనసు కలుక్కుమంది. ఒకప్పుడూ నేనూ విఫల ప్రేమికుడినే. అప్పుడు ఏదైనా అఘాయిత్యం చేసుకునుంటే అందమైన జీవితాన్ని కోల్పోయేవాణ్నే. అందుకే అనుభవంతో చెబుతున్నా. అన్ని ప్రేమలూ విజయం సాధించలేకపోవచ్చు. ప్రయత్నిస్తే విఫల ప్రేమికులూ జీవితంలో విజయం సాధించొచ్చు. ప్రేమ కన్నా జీవితం గొప్పది. నిజం తెలుసుకోండి.

- సూరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని