కొడుకు చెట్టంత... ఎదగాలనీ!

రాత్రి 10 గంటలు దాటుతోంది... అప్పుడే ఇంటికొచ్చిన కొడుకుతో తండ్రి... ‘ఇంతసేపు బయటేం చేస్తున్నావు? ఎక్కడికెళ్లావ్‌ రా. తొమ్మిదిలోపు ఇంట్లో ఉండాలని చెప్పాగా. లేటు అవుతుందని ఒక ఫోన్‌ కూడా చేయలేదు.

Published : 16 Sep 2017 01:56 IST

జర సోచో!
కొడుకు చెట్టంత... ఎదగాలనీ!

రాత్రి 10 గంటలు దాటుతోంది... అప్పుడే ఇంటికొచ్చిన కొడుకుతో తండ్రి... ‘ఇంతసేపు బయటేం చేస్తున్నావు? ఎక్కడికెళ్లావ్‌ రా. తొమ్మిదిలోపు ఇంట్లో ఉండాలని చెప్పాగా. లేటు అవుతుందని ఒక ఫోన్‌ కూడా చేయలేదు. ఇది మళ్లీ రిపీట్‌ అయితే బాగుండదు..’ అని మందలింపు. వెంటనే కొడుకు షూ సాక్స్‌ని మూలకి విసిరేసి... ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. ఎంత సేపు చదువు.. ఇల్లు అంటారు. నేను ఫ్రెండ్స్‌తో గడిపేదెప్పుడు? సినిమాలు... షికార్లకు వెళ్లకూడదా? మొబైల్‌లో మాట్లాడితే తప్పు... ఫేస్‌బుక్‌లో ఛాట్‌ చేస్తే తప్పు... ఇంకేం చేయాలి?’ అంటూ తండ్రితో వాదనకి దిగాడు. ఒక్క క్షణం మౌనం వహించిన తండ్రి.. ‘సరే నీకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తా... ఒకసారి నా మాట వింటావా? వచ్చే వారం మన సొంతూరికి వెళ్దాం. అక్కడ రెండు రోజులు ఉండొద్దాం. తిరిగొచ్చాక నీ ఇష్ట ప్రకారంగానే అన్నీ..’ అని వూరికి తీసుకెళ్లాడు తండ్రి. వూరోళ్లతో కాస్త సమయం గడిపాక మామిడి తోటకి తీసుకెళ్లాడు. ‘నేను ఈ చెట్టుకింద కూర్చుంటాను... నువ్వోసారి తోటంతా తిరిగి రా నాన్న’ అన్నాడు. ఓ గంటపాటు తోటంతా తిరిగొచ్చిన కొడుకుని చూసి... ‘తోటంతా ఎలా ఉంది నాన్న. నువ్వేమైనా గమనించావా?’ అని అడిగాడు. దానికి సమాధానంగా కొడుకు.. ‘అన్ని చెట్లు విశాలంగా... పూత.. పిందెలతో బాగున్నాయి. కానీ, ఓ చెట్టు మాత్రం సరిగా ఎదగలేదు. అడ్డదిడ్డంగా అణగారిపోయి ఉంది. ఎందుకు?’ అన్నాడు. దానికి తండ్రి... ‘మామిడి చెట్టుని పెంచేటప్పుడు కొంత ఎత్తు ఎదిగాక అవసరం లేని కొమ్మలు, కిందికి వాలే కొమ్మల్ని కత్తిరించేయాలి. లేకుంటే సూర్యరశ్మి సరిగా తగలక, పురుగులు చేరడంతో చెట్టు అణగారిపోతుంది. ఆరోగ్యంగా ఎదగదు. అన్ని చెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనవసరమైన కొమ్మల్ని కత్తిరించాము. ఆ ఒక్క చెట్టు మొదట నాటింది కదా... స్వేచ్ఛగా పెరగనిద్దామని వదిలేశాం. ఎదుగూ.. బొదుగూ లేకుండా ఉండిపోయింది..’ అని తెలిపిన జీవన సూత్రంలో సత్యం కొడుకుకి బోధపడింది. ‘కొడుకు విశాలమైన వృక్షంగా ఎదగాలనే కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు. చెట్టంత కొడుకు చల్లాగా ఉండాలనే. అంతేగానీ.. నీ స్వేచ్ఛని అడుకోవాలని మాత్రం కాదు..’ అని భుజంపై తడుతూ ఇంటికి తీసుకొచ్చాడు. కొడుకు ముఖంలో ఉత్తేజం... నాన్న కళ్లలో ఆనందం!

- వాట్సాప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు