గట్టిగా అనుకున్నా... కానీ!

నేను ఇష్టపడ్డ అబ్బాయి దక్కలేదు. నన్నిష్టపడే అబ్బాయి దూరమయ్యాడు. ..

Published : 07 Oct 2017 01:47 IST

గట్టిగా అనుకున్నా... కానీ!

నేను ఇష్టపడ్డ అబ్బాయి దక్కలేదు. నన్నిష్టపడే అబ్బాయి దూరమయ్యాడు. .. ప్రేమని ఇవ్వాలన్నా... పొందాలన్నా ధైర్యం కావాలి! లేదంటే కాలంతో ఒంటరి సహవాసం తప్పదు. అందుకు నేనే ఉదాహరణేమో అనిపిస్తుంది.
బాల్‌ పెన్ను బొట్టులు... ఫైవ్‌స్టార్‌ ఛాకీ గిఫ్ట్‌ల రోజులవి. పదో తరగతి పరీక్షలు రాసేశా. ఇక ఎప్పుడెప్పుడు కొత్త బంగారు లోకంలోకి ఎగిరిపోదామా అనుకుంటూ అమ్మ టైట్‌గా వేసిన జడని లైట్‌గా లూజు చేసి స్కూల్‌ గేటు దాటుతున్నా. ఓ కుర్రాడొచ్చి నా పేరు అభి అంటూ పరిచయం చేసుకుని ‘నువ్వంటే నాకిష్టం. ఐలవ్యూ’ అనేశాడు. నాకేమో షాక్‌. ఇదంతా నేను కాలేజీ కొత్తబంగారులోకంలో కదా వూహించుకున్నది అనుకుని తమాయించుకున్నా. ఈ వయసులో ప్రేమేంటి? అదంతా అట్రాక్షన్‌. నాకిప్పట్లో అలాంటి ఆలోచన లేదు. అభీని చూస్తే నన్ను ఎప్పటి నుంచే ఫాలో అవుతున్న వ్యక్తిగానే అనిపించాడు. అయినా... ఆ క్షణానికి నాకు అతనిపై ఎలాంటి అభిప్రాయం లేదు.
‘గాల్లో తేలినట్టుందే...’ అన్నట్టుగా కాలేజీడేస్‌ మొదలయ్యాయి. పేరు సంజీవ్‌... అతని స్టైల్‌, మాటతీరు, బిహేవియర్‌ అన్నీ నచ్చేవి. గమనిస్తుండేదాన్ని. కొన్నాళ్లయ్యాక నాకో విషయం తెలిసింది. తను నాకు వరుసకు బావని. అంతే... మనసుకేదో తెలియని పరవశం. ఇంతలో ఇంటర్‌ చదువులకు ఆఖరి ఘట్టం. నాకు భయం మొదలైంది. తను వేరే కాలేజీకి వెళ్లిపోతే! మనసులో గట్టిగా అనుకున్నా. తను నాకు దూరం కాకూడదు అని. అనుకున్నట్టే... నేను చేరిన కాలేజీలోని బీటెక్‌ సేమ్‌ బ్రాంచిలో కనిపించాడు బావ. ఓ రోజు తన నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌తో పాటు మెసేజ్‌ కూడా... ‘నిన్న బాగా ఏడ్చావంట దేనికి?’ అని. ఎగ్జామ్‌ బాగా రాయలేదని ఏడ్చా. అది తనకెలా తెలిసింది? అంటే తను నా గురించి పట్టించుకుంటున్నాడనిపించింది. నాకేదో థ్రిల్లింగ్‌గా అనిపించింది. తను నాకు బావ అవుతాడన్న విషయం నేను చెప్పకుండానే మాటలు కలిపా. రోజూ గంటలకొద్దీ ఛాటింగ్‌. ఇది ప్రేమేనేమో? అనుకునేదాన్ని...
నేరుగా మాట్లాడాలంటేనే భయం. తనని చూస్తే నా గుండె వేగం పెరిగేది. మాట తడబడేది. ఛాటింగ్‌ కబుర్లయితే లెక్కలేనన్ని. అంతా హ్యాపీస్‌... కానీ, అనుకోకుండా థర్డియర్‌లో ఒకసారి నీతో చాటింగ్‌ చేయడం నాకు టైమ్‌ వేస్ట్‌ వ్యవహారం అన్నాడోసారి. నాకేం అర్థం కాలేదు. కారణం లేకుండానే తనలా అనడం నాకు కష్టంగా అనిపించింది. కోపంతో అన్‌ఫ్రెండ్‌ చేశా. సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నానని తను చెప్పినా నాకు కోపం తగ్గలేదు. ఒక్క రోజుకే నాకేదో వెలితిగా అనిపించేది. తనతో చాట్‌ చేయకుండా ఉండలేనని నాకర్థమైంది. రెండ్రోజులకే మళ్లీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌. మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్‌. ముందులా మాట్లాడలేకపోయా. ఇంతలో ఫైనలియర్‌ వచ్చేసింది. చదువుపై కాస్త దృష్టిపెట్టా. ఎగ్జామ్స్‌కి ముందు తెలిసింది. తనో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అంతే... కొత్త బంగారులోకం అనుకున్న కాలేజీ నరకంలా మారింది. ఎటు చూసినా బావతో నా వన్‌సైడ్‌ లవ్‌ వూహలే. చాలా కష్టంగా అనిపించింది. నాది నిజమైన ప్రేమేనని అప్పుడే నాకూ తెలిసింది. కానీ, ఆలస్యమైంది. ప్రేమించడమే కాదు... దాన్ని సరైన రీతిలో ఎక్స్‌ప్రెస్‌ చేయడం తెలియాలి. అది నాకు రాదేమో అనుకున్నా. బావని ప్రేమించిన అమ్మాయి ఆ విషయంలో ముందుందని, తన ప్రేమని చెప్పగలిగిందేమో అనిపించింది.
నా మనసుకి సర్దిచెప్పుకుని చదువు ముగించుకునే ప్రయత్నంలో ఉండగా... నా కళ్లను నమ్మలేనట్టుగా అభిని చూశాయి. ముందు నిలబడి ‘అప్పుడు ప్రేమిస్తున్నానంటే అట్రాక్షన్‌ అన్నావ్‌. ఇప్పుడేమంటావ్‌. ఇప్పటికైనా ఒప్పుకోవా ప్లీజ్‌’ అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఏడుస్తూ... సంజూని ప్రేమిస్తున్నానని చెప్పేశా. తన ముందు ఎందుకలా చెప్పానో... ఆపుకోలేక ఏడ్చానో... నాకే అర్థం కాలేదు. మారు మాట్లాడకుండా... తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. తను వెళ్తున్నంత సేపూ కనుచూపు మేర చూస్తూనే తననే చూస్తూ ఉండిపోయా. నేనున్న ప్లేస్‌ అంతా ఫ్రీజ్‌ అయినట్టుగా అనిపించింది. బహుశా కాలం ఆగిపోవడం అంటే అదేనేమో! మెల్లగా కాలంతో సహవాసం చేస్తూ ముందుకి సాగాను. ఉద్యోగంలో చేరా. ఖాళీగా ఉంటే.. నాకు బావ కంటే అభినే ఎక్కువగా గుర్తొచ్చేవాడు. మనసంతా అభీ చుట్టే తిరిగేది. నేను వూహించలేదు. తను మళ్లీ ఎదురుపడ్డాడు. కాలం గొప్పతనం ఎంతో అతని కళ్లు చెప్పాయి. కల్మషం లేని అతని మనసు కనిపించింది. మాటల్లో... ‘నా గురించి ఏం ఆలోచించకు. మళ్లీ ప్రపోజ్‌ చేయను. సంజూతో నువ్వు హ్యాపీనేగా!’ అన్నాడు. మళ్లీ అదే కంగారు... భయం... హ్యాపీనే అంటూ లేని ఆనందాన్ని కళ్లలోకి తెచ్చుకుని నటించాను. ‘మళ్లీ కలుస్తామో లేదో... ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పి తను వెళ్తుంటే చూస్తుండిపోయా. అభి ప్రేమలో ధైర్యం ఉంది.
తను మళ్లీ ఎదురుపడ్డాడు. కాలం గొప్పతనం ఎంతో అతని కళ్లు చెప్పాయి. కల్మషం లేని అతని మనసు కనిపించింది.

- రిషిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు