నాన్న పంతం.. అక్క జీవితం అతలాకుతలం

కల్యాణి మా రెండో అక్కయ్య. తను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్తుందంటే మా వీధివీధంతా తెలిసిపోయేది. స్కూల్‌కి వెళ్లడం అంటే అంత కష్టం ఆమెకి. ఏడ్చి ఏడ్చి కళ్లలో నీరు ఇంకి పోయేవరకూ వెళ్లనని పోరే. మా నాన్న ఒప్పుకునే వాడు కాదు. వెళ్లాల్సిందే! ఒకటే మాట. అలాని బుజ్జగించడాలు లేవు....

Published : 11 Nov 2017 01:49 IST

మనసులో మాట!
నాన్న పంతం.. అక్క జీవితం అతలాకుతలం

ల్యాణి మా రెండో అక్కయ్య. తను చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్తుందంటే మా వీధివీధంతా తెలిసిపోయేది. స్కూల్‌కి వెళ్లడం అంటే అంత కష్టం ఆమెకి. ఏడ్చి ఏడ్చి కళ్లలో నీరు ఇంకి పోయేవరకూ వెళ్లనని పోరే. మా నాన్న ఒప్పుకునే వాడు కాదు. వెళ్లాల్సిందే! ఒకటే మాట. అలాని బుజ్జగించడాలు లేవు. కావాల్సినవి కొనివ్వడాలు లేవు. కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. అలాని మా నాన్న పెద్ద చదువరా అంటే కాదు. రైతు. నిశాని. మొండివాడు. అనుకుంటే అవ్వాల్సిందే! మా అక్క అంతకన్నా మొండిది. వర్మగారి పెరట్లోకి పారిపోయి నూతివరల మీద నిల్చుని బడికి వెళ్లమంటే దూకేస్తా అని బెదిరించేది. అప్పుడు రంగంలోకి దిగేవాడు చిన్నా. ‘ఏదీ దూకు చూద్దాం’ అంటూ! నాన్న అన్నా భయపడని అక్క చిన్నాని చూస్తే భయపడేది. కిమ్మనకుండా మంత్రం వేసినట్టుగా బడికి వెళ్లిపోయేది. చిన్నా మా ఇంటి పాలేరు అన్నమాటే కానీ... మా ఇంట్లో మనిషిలా ఉండేవాడు. వయసులో అంతరం అన్నమాటే కానీ మా నాన్నకు కూడా చిన్నా కుడిభుజంలా ఉండేవాడు. మా పొలంలో ఒక గడ్డిపోచ కదలాలన్నా తన అనుమతి ఉండాల్సిందే. మొత్తం మీద అక్క పదోతరగతికి వచ్చింది. కానీ పాసవ్వడానికి మాత్రం మూడు సంవత్సరాలు తీసుకుంది. చిన్నా అంటే మొదట్లో భయపడిన అక్కయ్య... తర్వాత తనని ఇష్టపడటం మొదలుపెట్టింది. చిన్నాకి ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు. నాన్న అక్కకి పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. చిన్నా అంటే ఇష్టమని మా అమ్మకి విషయం చెప్పింది అక్క. నెమ్మదిగా నాన్నకీ ఆ విషయం తెలిసింది. విషయం తెలిసిన తర్వాత... నాన్న అమ్మా, అక్కా అనుకున్నట్టుగా ఉగ్రరూపం ఎత్తలేదు. చాలా ముభావంగా ఉండిపోయారు. అలాని అక్కయ్యకి పెళ్లి సంబంధాలు చూడ్డం కూడా ఆపలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు మా అక్కయ్యకి ఇద్దరు ఆడపిల్లలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. మా బావగారు లేరు. తాగుడికి బానిసై చనిపోయారు. ఆయన చేస్తున్న ఉద్యోగమే మా అక్కయ్యకు వచ్చింది. చదువురాని చిన్నాకి ప్రభుత్వ ఉద్యోగం ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? అసలు ఉద్యోగం వచ్చింది చిన్నాకి కాదు. ఆ మాటకొస్తే చిన్నా ఏమయ్యాడో నాకూ, అక్కయ్యకే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. అక్కకు పెళ్లి కుదరడం చిన్నా కనిపించకుండా పోవడం ఒకేసారి జరిగాయి. ‘అతని గురించి పెద్దగా ఆలోచించకు చక్కని కుర్రాడు. ప్రభుత్వ ఉద్యోగం’ అంటూ ఓ అబ్బాయికిచ్చి అక్క పెళ్లి చేశారు. వారం రోజులకే అక్కయ్యకు పరిస్థితి అర్థమైంది. అతనో పచ్చి తాగుబోతు. విధులకు కూడా సరిగా హాజరయ్యేవాడు కాదు. ఉద్యోగంలోంచి తీసేయాల్సిన పరిస్థితి. ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు. అక్క ముఖం చూసి ఉద్యోగం అయితే ఉంచారు. కానీ కామెర్లు రావడంతో బావ చనిపోయారు. నాకు తెలిసి అక్కకు పెళ్లయిన తర్వాత నుంచి చిరునవ్వు అనేది ఒకటి ఉంటుందని తెలుసో లేదో మరి అన్నట్టుగా ఉండిపోయింది. అక్క పరిస్థితి ఇలా తయారైందనో.. చిన్నా దూరం అయ్యాడనో తెలియదుగానీ.. చిన్నా కనిపించకుండా పోయిన నుంచి నాన్న ముఖంలో బాధ, పశ్చాత్తాప భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది.

- రాజేశ్‌ (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని