ఓ కారణం స్నేహాన్నే మిగిల్చింది!

ఇంటర్‌ పరీక్షల చివరిరోజు. పరీక్ష మొదలై రెండున్నర గంటలైంది. మరో అరగంటలో ముగుస్తుందనగా చివరి ప్రశ్నకు సమాధానం గుర్తురాలేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. ముందు...

Published : 18 Nov 2017 01:56 IST

మనసులో మాట
ఓ కారణం స్నేహాన్నే మిగిల్చింది!

ఇంటర్‌ పరీక్షల చివరిరోజు. పరీక్ష మొదలై రెండున్నర గంటలైంది. మరో అరగంటలో ముగుస్తుందనగా చివరి ప్రశ్నకు సమాధానం గుర్తురాలేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. ముందు... వెనక... చుట్టూ... అంతా తెగ రాసేస్తున్నారు. నన్ను గమనించిందో ఏమో... ముందున్న అమ్మాయి కాసింత సమాధానం చూపించింది. అంతే పది నిమిషాల్లో పరీక్ష రాసి పదకొండో నిమిషంలో తనపేరు అడిగాను.  పరీక్ష ముగిశాక పేరు చెప్పింది. తర్వాత తన చిరునామా కనుక్కోవడం... అప్పుడప్పుడు కలుసుకోవడం.. ఎప్పుడూ మాట్లాడటం... అనుకోకుండా పరిచయమైన తను నా ప్రాణ స్నేహితురాలయ్యింది. నా సంతోషాలు, బాధలు, కోపాలు, తాపాలు అన్నీ తనతోనే. తనంటే నేను.. నేనంటే తను అన్నంతలా మా స్నేహం బలపడింది. ఎనిమిదేళ్ల కాలం ఎనిమిది నిమిషాల్లా గడిచిపోయింది.
ఒక సారి తన పుట్టిన రోజున వాళ్ల ఇంటికి నన్ను ఆహ్వానించింది. అప్పట్లో మా నాన్నిచ్చే 10 రూపాయల పాకెట్‌మనీని పది రోజులు జమచేసి రూ.100 పెట్టి ఒక గిఫ్ట్‌ తీసుకున్నా. దాన్ని చూస్తుంటే.. ఏదో వరల్డ్‌ కప్‌ గెలిచినంత ఆనందం. ఎందుకంటే నా జీవితంలో అదే మొదటిసారి ఒకరి కోసం కానుక కొనడం. తన పుట్టిన రోజు వాళ్లింటికెళ్లి ఆ గిఫ్ట్‌ ఇవ్వగానే నిర్మొహమాటంగా నాకు ఇలాంటివి ఇష్టముండదని చెప్పేసింది. పర్లేదు ఇంకెప్పుడూ ఇవ్వను ఈసారికి తీసుకో అని తన చేతుల్లో పెట్టేశా. ఇప్పటికీ ఆ కానుక వాళ్ల ఇంట్లోని షోకేస్‌లో అలానే ఉంది. ఆరోజే వాళ్ల అమ్మని, అక్కని పరిచయం చేయడంతో ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో వేరే ఊర్లో ఇంజినీరింగ్‌ సీటొస్తే వెళ్లిపోయాను. అక్కడికెళ్లినా రోజూ తనతో మాట్లాడందే నిద్రపట్టదు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచాం. ఓ సారి వాళ్ల నాన్నకూ పరిచయం చేసింది. డబ్బుంటే తప్ప పలకరించని మా బంధువులకంటే ఏనాడు డబ్బు గురించి ఆలోచించని వాళ్ల నాన్న మా స్నేహాన్ని అర్థం చేసుకున్నారు.
కాలం ఎన్ని చిత్రాలు చేస్తుందో చెప్పలేం. అలాంటి అద్భుతమే మా జీవితంలో జరిగింది. మా స్నేహం ప్రేమగా మారింది. నాకంటే అదృష్టవంతుడు లేడనుకున్నా. ప్రేమ సామ్రాజ్యానికి నేను రాజు... తను రాణి. ప్రేమమయమైన తన కళ్లను చూస్తుంటే అమృత జలపాతం కింద తడుస్తున్న ఫీలింగ్‌. ఇరు కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నా... నిండు నూరేళ్లు తన చేయి విడవకూడదనుకున్నా. మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం కాదు కదా..? పరీక్షల్లో నా పరిస్థితిని అర్థం చేసుకున్న తను నా జీవితాన్ని అర్థం చేసుకొని అర్ధాంగిగా ఉండడానికి ఒప్పుకున్న సమయంలోనే ఓ ఊహించని మలుపు. మా ప్రేమ వాళ్ల తల్లిదండ్రులకు ఇబ్బందని ముందే తెలిసిన దేవుడు తనకు వేరొకరితో జీవితాన్ని ముడివేశాడు. వాళ్లింట్లో వాళ్లు నిశ్చితార్థం చేసేశారు. నేనంటే ఇష్టముండి కూడా తనవాళ్ల కోసం మా ప్రేమను వదులుకొని తను పెళ్లికి సిద్ధపడింది.
మా ఇరువురి ప్రేమ మా మధ్యే ఉండిపోయింది. వాళ్లింటి అల్మరాలో నేనిచ్చిన కానుకలా. నేను ధైర్యం చేసి మా ఇంటి వరకూ తీసుకెళ్లా. తను ఆ ధైర్యం చేయలేదు. ఎందుకంటే అందుకు తనకి ఓ బలమైన కారణం ఉంది. అక్క ముందుగా ప్రేమించిన వ్యక్తితో వేరవడం. తనూ అలాగే వెళ్లిపోయి... తల్లిదండ్రులకు ఎవరూ లేని వాళ్లను చెయ్యలేనండి. అది నాకూ సబబే అన్పించింది. ఎల్లప్పుడు తన శ్రేయస్సు కోరుకునే నా గుండెచప్పుడు కన్నీళ్లతో నిండిపోయింది. అయినా సరే తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా... హ్యాపీ మారీడ్‌ లైఫ్‌ మా!!   - రాజ్‌ (పేరు మార్చాం)

  మా ఇరువురి ప్రేమ మా మధ్యే ఉండిపోయింది. వాళ్లింటి అల్మరాలో నేనిచ్చిన కానుకలా...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని