అర్థం చేసుకుంటాడని...

అప్పుడే బీటెక్‌లో అడుగుపెట్టాం. ఇంటర్‌ సంకెళ్లు తెంచి స్వేచ్ఛా బావుటాలు ఎగరేశాం. మూడో రోజు నేను కాలేజీలో అడుగుపెట్టాను. మనసు క్యాంపస్‌ అంతా తిరిగొస్తుంటే... కనురెప్పలు కళ్లను దారి చూడమంటున్నాయి. క్లాస్‌రూంకు వెళ్లడానికి మెట్లు ఎక్కుతుంటే ఎవరో ఆపినట్లు...

Published : 25 Nov 2017 01:53 IST

మనసులో మాట
అర్థం చేసుకుంటాడని...

ప్పుడే బీటెక్‌లో అడుగుపెట్టాం. ఇంటర్‌ సంకెళ్లు తెంచి స్వేచ్ఛా బావుటాలు ఎగరేశాం. మూడో రోజు నేను కాలేజీలో అడుగుపెట్టాను. మనసు క్యాంపస్‌ అంతా తిరిగొస్తుంటే... కనురెప్పలు కళ్లను దారి చూడమంటున్నాయి. క్లాస్‌రూంకు వెళ్లడానికి మెట్లు ఎక్కుతుంటే ఎవరో ఆపినట్లు అనిపించింది. నీ పేరేంటి? ఏ బ్రాంచ్‌ కొంచెం గద్దించినట్లు అడిగాడు. సీనియర్‌ కదా చెప్పేశాను. టెక్ట్స్‌ బుక్‌ కావాలా? ఎం1 ఉందా? ఇలా రోజూ ఏదో ఓ సాకుతో నన్ను మాట్లాడించే వాడు. అతను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయిర్‌. నా నైబర్‌కి బెస్ట్‌ ఫ్రెండ్‌. నన్ను ర్యాగ్‌ చేయడానికి ఎవరైనా వస్తే ఆపేవాడు. కాలేజీ పరిచయాలు నీలు-పాల లాంటివి తొందరగా కలిసిపోతాయి. చాలా తక్కువ కాలంలోనే ఫ్రె¶ండ్స్‌ అయ్యాం. అతని కళ్లు నన్ను వెతకటం నాకు తెలుస్తోంది. నా చిరునవ్వుకి అతని ముఖం విచ్చుకోవడం కన్పిస్తోంది. ఆ రోజు డిసెంబర్‌ 13, 2013 నేననుకున్నట్లు అతను ప్రపోజ్‌ చేశాడు. గుండెలో ఏదో అలజడి. వేల జలపాతాల ప్రవాహ హోరు. అలలుగా ఎగిసిపడుతున్న భవిష్యత్తు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలం. అతనంటే నాకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. అయినా వెంటనే చెప్పలేకపోయాను. కొంచెం టైం కావాలన్నాను. డిసెంబరు పూర్తయ్యే సరికి అలజడి తగ్గింది. జనవరి గడిచే కొద్దీ ప్రవాహ హోరును ఆస్వాదించాను.

ఫిబ్రవరి... ఎగిసిపడుతున్న భవిష్యత్తు అలలను ఒడిసిపట్టుకోవచ్చనిపించింది. ఆ రోజు ఫిబ్రవరి 14, 2014కు ఒక్క రోజు ముందు. అంటే ఫిబ్రవరి 13... శాస్త్రవేత్తలు ఎవరైనా ఈరోజు ప్రేమికుల హృదయాలను పరిశీలిస్తే తెలుస్తుంది... అవి ఎంతలా నవ్వుతున్నాయో, తుళ్లిపడుతున్నాయో! ఎందుకంటే అప్పుడు నా పరిస్థితి అదే. కవిత్వాలు ఎలా పుడతాయో అప్పుడు నా మనసునడిగితే కచ్చితంగా చెప్పగలదు. అతని ముందు నా హృదయ స్పందనను పరిచాను. నా మనసులో మాట చెప్పాను. నమ్మకం, ప్రేమ ఈ రెండే ఇంధనాలుగా మన ప్రేమ కలకాలం సాగిపోవాలని చెప్పాను. చేతిలో చెయ్యేసి మాటిచ్చాడు. నా వూహలకు రెక్కలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లాడు. నా కలలకు రూపమిచ్చి నాకే చూపించాడు. మా అమ్మ తర్వాత నా మనసులోని ప్రతీమాటా తనతోనే పంచుకునేదాన్ని. అంతలా నేను తనైపోయాను. అతన్ని చూపించడానికి సూర్యుడు ఉదయిస్తున్నాడనిపించేది. విరహ వేదన చల్లార్చడానికే చంద్రుడు రాత్రంతా కాపలా కాస్తున్నాడనిపించేది. అతని సహచర్యంలో ప్రతిరోజూ ఒక కొత్త ఇంద్రధనస్సులా మెరిసిపోయేది. ఏ రిలేషన్‌ అయినా చిన్నచిన్న గొడవలు కామన్‌. మా బంధంలోనూ అంతే. ఒక్కోసారి ఇవి మా మధ్య శూన్యాన్ని పరిచేవి. ఆ శూన్యమే అగాథమైంది. ఏమైందో తెలియదు. ఒకరోజు బ్రేక్‌అప్‌ అన్నాడు.

గుండెలో అణుబాంబు పడ్డట్లు అయ్యింది. ముక్కలుముక్కలుగా నేను చీలిపోతున్నాను. రేణువులుగా విడిపోతున్నాను. ఎదురుచూశాను. నచ్చజెప్పాను. ప్రాధేయపడ్డాను. ఎంతకీ అతని మనసు కరగలేదు. నా బాధ మా ఇంట్లో వాళ్లకి అర్థమైంది. మా అన్నయ్యతో అతన్ని అడిగించారు. ప్రయోజనం లేకపోయింది. నా ఇంజినీరింగ్‌ పూర్తయింది. ఇంకా అతని కోసం ఎదురుచూస్తున్నాను. సమస్య ఏదైనా పరిష్కారం ఉంటుందిగా. కారణాలతోనే మిగిలిపోలేముగా... ప్రేమంటేనే ఇచ్చిపుచ్చుకోవడం... ఒకరినొకరు అర్థం చేసుకోవడం... నాకు తనేంటో పూర్తిగా తెలుసు. అలాగే, నా గురించీ తెలుసు అనుకుంటూ... ఎదురుచూస్తూ ఉంటాను. నా మనసు కార్చే కన్నీళ్లు అతనికి కన్పించేదాకా.... ఎదురుచూస్తూనే ఉంటాను. మిస్‌ యూ రా!

- ఎస్‌హెచ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని