ప్రేమించి వెళ్లిపోవచ్చు... పెళ్లి చేసుకుని కాదు...

ఆ రోజు అక్టోబరు 16. సాయంత్రం 5గంటలు. నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. ‘ఒరేయ్‌ మనం పెళ్లిచూపులకు వెళ్తున్నాం. రెడీ అవ్వు. ఇక్కడే మన పక్క వీధిలోనే. అమ్మాయి బాగుంది...

Published : 09 Dec 2017 02:07 IST

మనసులో మాట!
ప్రేమించి వెళ్లిపోవచ్చు... పెళ్లి చేసుకుని కాదు...

రోజు అక్టోబరు 16. సాయంత్రం 5గంటలు. నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. ‘ఒరేయ్‌ మనం పెళ్లిచూపులకు వెళ్తున్నాం. రెడీ అవ్వు. ఇక్కడే మన పక్క వీధిలోనే. అమ్మాయి బాగుంది... నేనేదో చెప్పబోయే లోపే అమ్మ మాట్లాడనీయలేదు. మొదటి నుంచి అమ్మానాన్న మాట అంటే నేను కాదనింది లేదు. అందరం బయలుదేరి వెళ్లాం. మంచి స్వాగతం లభించింది. అమ్మాయి చాలా బాగుంది. నాకు నచ్చింది. తనతో ఒకసారి మాట్లాడతాను అన్నాను. అందరూ సరే అన్నారు. మమ్మల్నిద్దర్ని మేడపైకి పంపారు. నిర్మోహమాటంగా అడిగాను. ‘నేను మీకు నచ్చానా? నచ్చకపోతే ఇప్పుడే చెప్పేయండి. వెళ్లిపోతాం’ అని. ‘అలాంటిదేం లేదు’ అంది. అప్పటికే తన సౌందర్యానికి దాసుడైన నేను... తన సుమధుర కంఠం విని మైమరచిపోయాను. ‘మీరు ఎవరినైనా ప్రేమించినా చెప్పేయండి.’ అన్నాను. ‘భలేవారండీ... అలాంటి ఆలోచనలే లేవు. మీరు నాకు నచ్చారు.’ అంది. మనసుకు ఆస్కార్‌ అవార్డు వచ్చినంత ఆనందమైంది. నవంబర్‌ 17న నిశ్చితార్థమైంది. రింగ్‌ను నేను కుడిచేతి వేలికి తొడిగాను. రెండు రోజుల తర్వాత వాళ్లింటికి వెళితే తనే ఈ విషయం చెప్పింది. ఇప్పుడు మీరే తీసి ఎడమచేతి వేలికి తొడగమని చెప్పింది. అలాగే చేశాను. మా ఇద్దరి మధ్య చొరవకు ఈ ఘటనా ఒక విధంగా ఉపయోగపడింది. పెళ్లికి మూడు నెలల సమయం ఉంది. ఈ మధ్యలో వాళ్లింట్లో ఏ పండగ వచ్చినా నన్ను ఆహ్వానించేవారు.  అప్పుడప్పుడూ బయటికి వెళ్లడం, బహుమానాలు ఇవ్వడం... పొంగిపోవడం... నాకు అలవాటైపోయింది. అడగకుండానే తనకు ఇష్టమైనవి తెలుసుకొని చేసేవాణ్ణి. ఇచ్చేవాణ్ని. తన చూపులు పెళ్లింటి తోరణాల్లా కళకళలాడేవి. తన నవ్వులు భజంత్రీల్లా మంగళకరంగా విన్పించేవి. మూడు నెలల కాలం మూడు నిమిషాల్లా కరిగిపోయింది. ఫిబ్రవరి 15... పెళ్లి గడియ రానే వచ్చింది. వివాహమంటే రెండు జీవితాలు ఒక్కటవ్వడమే కాదు... రెండు కుటుంబాల గౌరవం కలిసి మరింత పెద్దదవ్వడం అన్పించింది. అంబరం అందినంత సంబరం నాలో. జీలకర్ర బెల్లం తన తలపై పెట్టడం, మూడుముళ్లు వేయడం.. వేడుక కళ్లముందు మెదులుతూనే ఉంది. అప్పుడే మేం ఏడడుగులు నడిచి ఏడు రోజులైంది. రోజులు సెకనుల్లా గడుస్తున్నాయ్‌.  అది ఏడో రోజు రాత్రి. అర్ధరాత్రి కళ్లు తెరిచి చూస్తే. తను కన్పించలేదు. కంగారు పడ్డాను. బాత్‌రూమ్‌, హాలు, కాంపౌండ్‌... ఇలా అంతా వెతికాను. వాళ్ల నాన్నకు ఫోన్‌ చేశాను. వాళ్లూ వచ్చారు. వెదికారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్‌ ఇచ్చాం. తర్వాత విచారణలో తెలిసింది. తను అంతకుమునుపే ఒక అబ్బాయిని ప్రేమించిందనీ... ఈ విషయంలో వాళ్లింట్లోనూ తెలుసని. ప్రేమించిన అబ్బాయితోనే వెళ్లిపోయిందని నిర్ధారణ అయ్యింది. నా గుండె పగిలిపోయింది. నేను కట్టుకున్న ఇంద్రభవనం కుప్పకూలిపోయింది. తను నాతో ప్రేమగా ఉన్నది... నన్ను ముంచడానికేనని, ఏడడగులు నడిపించింది ఏడిపించడానికేనని అర్థమైంది. వీధిలో నా గురించి తప్పుడు ప్రచారాలు... అమ్మానాన్నల గురించి లేనిపోని మాటలు... రోజూ నన్ను ఈటల్లా గుచ్చుకుంటూనే ఉన్నాయి.

ప్రేమించడం తప్పు కాదు... అది నాతో పెళ్లికి ముందే చూసుకోవాల్సింది. అన్ని జరిగిపోయాక... నా కుటుంబాన్ని మొత్తాన్ని పెళ్లికి వెలిగించిన అగ్నిగుండంలోనే వేసి వెళ్లడం న్యాయమా? నా ఆశలన్నింటినీ పెళ్లి మంటపం కింద సమాధి చేయడం తప్పుకాదా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక్కసారి ఆలోచించండి... మీ ప్రేమను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోండి. అంతేగానీ మీ అవసరాల కోసం వేరే వారి జీవితాలతో ఆడుకోకండి. ప్లీజ్‌.

- విక్రాంత్‌, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని