నా కళ్లలో తడి ఆరితే ఒట్టు

2014 మార్చి 25 ఇంటర్‌ సెకండియర్‌ కెమిస్ట్రీ పరీక్ష. ఈ ఒక్కటీ రాసేస్తే... పెద్ద భారం దిగినట్లే. మా వూరి నుంచి బస్సెక్కి అరగంట ప్రయాణిస్తే కర్నూలు.

Published : 16 Dec 2017 01:56 IST

మనసులో మాట
నా కళ్లలో తడి ఆరితే ఒట్టు

2014 మార్చి 25 ఇంటర్‌ సెకండియర్‌ కెమిస్ట్రీ పరీక్ష. ఈ ఒక్కటీ రాసేస్తే... పెద్ద భారం దిగినట్లే. మా వూరి నుంచి బస్సెక్కి అరగంట ప్రయాణిస్తే కర్నూలు. అక్కడే పరీక్ష కేంద్రం. నాతో పాటు మా వూరి నుంచి 8 మంది బయలు దేరాం. అందరి ముఖాల్లో ఈ రోజు చివరి పరీక్ష అన్న ఉత్సాహం. పరీక్ష తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకరు సినిమా అంటే... మరొకరు హోటల్‌ అంటున్నారు... ఇంకొందరు రాక్‌గార్డెన్‌ అంటున్నారు. చర్చలు, జోకులు, నవ్వులు... బస్సంతా కోలాహలంగా ఉంది. తర్వాతి స్టాప్‌లో శ్రీను ఎక్కుతాడు. నా కళ్లు అతని కోసం ఎదురుచూస్తున్నాయి. బస్సు అక్కడ ఆగగానే... శ్రీను కళ్లు నన్నే వెదుకుతాయి. నేను కన్పిస్తే అతని పెదవులపై చిరునవ్వు విచ్చుకుంటుంది. మరి కన్పించకపోతే...? అదే చూద్దామని ఆ రోజు నా ఫ్రెండ్‌ పక్కన దాక్కున్నాను. శ్రీను మా కాలేజీనే. మంచి అబ్బాయి. అమ్మాయిలతో గౌరవంగా మాట్లాడతాడు. ఇవే నన్ను ఆకట్టుకున్నాయి. తనూ నన్ను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాడు. అతని కళ్లు నన్ను ప్రేమిస్తున్నాడని చెబుతూనే ఉంటాయి. సరే ఈ రోజు ఎలాగైనా ఉడికించాలని దాక్కున్నాను. స్టాప్‌ వచ్చింది. శ్రీను నా కోసం చూస్తున్నాడు. అతని చూపులు బస్సంతా గాలిస్తున్నాయి. ముఖం చిన్నబోయింది. అప్పుడు నేను కన్పించాను. ఇంటర్‌ ఫలితాల్లో అతనే ఫస్ట్‌ వచ్చినంత ఆనందంగా నవ్వాడు. ఏదో కొత్త డ్రెస్‌ వేసుకున్నాడు. మెరిసిపోతున్నాడు. కళ్లతోనే బాగుందని చెప్పాను. పొంగిపోయాడు. ఎన్ని సార్లు మా ఇద్దరి చూపులూ ఢీకొన్నాయో... అన్ని సార్లు మా ముఖాలు వెలిగిపోయాయి. కర్నూలు వచ్చింది. అందరం బస్సు దిగాం. దగ్గరికొచ్చి ఆల్‌దిబెస్ట్‌ అన్నాడు. ప్రతీ పరీక్షకు అలానే చెబుతాడు. నేను నీక్కూడా అన్నాను. ఈ రోజు పరీక్ష అయిపోతూనే నీతో మాట్లాడాలి అన్నాడు. నాకు తెలుసు ఈరోజు శ్రీను నాకు ప్రపోజ్‌ చేస్తాడని... అతని హృదయస్పందన నాకు వినిపిస్తున్నట్లుంది. పరీక్ష అయిపోయింది. బాగా రాశాం. అందరూ వారివారి ప్లాన్‌ ప్రకారం ఒక్కోచోటికి వెళ్లిపోతున్నారు. నాకు పనుంది నేను రానని చెప్పేశాను. తనూ అలాగే తప్పించుకున్నాడు. ఇద్దరం బస్టాండుకు వచ్చేశాం. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అతని జేబులో హాల్‌టికెట్‌తో పాటు ఇంకో కాగితం కన్పించింది. లవ్‌లెటర్‌ అని అర్థమైంది. నేను మరింతగా ఉడికించాలని చూశాను. అప్పటికే ఐదారు సార్లు ప్రయత్నించాడు. నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇంతలో మా వూరి వైపు వెళ్లే బస్సు వచ్చింది. ఫ్లాట్‌ఫాంపైకి రాక మునుపే అందరూ సీటు కోసం చుట్టుకున్నారు. నేను పక్కగా నిలబడ్డాను. నా వెనుకే తనూ ఉన్నాడు. ఇంతలో బస్సు మా మీదికి వచ్చేసింది. ఒకటే తోపులాట... ఇంతలో ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఏం జరిగిందో తెలిసే లోపు నేను కూలబడిపోయాను. కళ్లు బైర్లు కమ్మాయి. తను నా పక్కనే కూర్చొని బోరున ఏడుస్తున్నట్లు నాకు లీలగా తెలుస్తోంది. కొద్ది సేపటికి అంతా చీకటి. ఆసుపత్రిలో కళ్లు తెరిచే సరికే నా రెండు కాళ్లు తీసేశారని తెలిసింది. బస్సు నా కాళ్లపై నుంచి వెళ్లిందట. బతకాలంటే తప్పదని డాక్టర్లు చెప్పారంట... అమ్మ కన్నీళ్లతో చెబుతుంటే నా గుండె పగిలిపోయింది. నా మదిలో ఏడస్తున్న శ్రీనునే మెదిలాడు. తర్వాత నన్ను చూడ్డానికి చాలా సార్లు ఆసుపత్రికి వచ్చాడు. రావద్దని చెప్పాను. తను నన్ను ప్రేమిస్తే... నేను తనకు ఆనందకర జీవితం ఇవ్వలేను. నేను అసహించుకుంటే... తన మనసు మారుతుందని కఠినంగా మాట్లాడాను. ఇంకోసారి ఇక్కడ కన్పిస్తే చంపేస్తానని మా అన్న(పెద్దనాన్న కొడుకు) శ్రీనుపై చేయి చేసుకున్నాడు. తర్వాత ఆరు నెలలకు ఇంటికొచ్చాను. నా ఫ్రెండ్‌ నా దగ్గరకొచ్చింది. శ్రీను గురించి అడిగాను. కన్పించడం లేదని చెప్పింది. ‘‘మీ అన్న కొట్టినప్పటి నుంచి ఇంటికి వెళ్లలేదంట... ఎక్కడున్నాడో తెలియడం లేదంట... వాళ్ల అమ్మానాన్న ఎంతగానో వెతికారు కన్పించలేదంట’’ అని చెప్పింది. ఆ మాట విన్నప్పటి నుంచి మూడేళ్లుగా నా కళ్లలో తడి ఆరితే ఒట్టు. శ్రీను నన్ను క్షమించు. నువ్వు బాగుండాలనే అలా చేశాను. నువ్వు ఎక్కడున్నా ఇంటికి రా!

- సంధ్యా, కర్నూలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని