అపార్థం.. నా ప్రేమకు అనర్థం

నాది విశాఖ. నేను ప్రియా మంచి స్నేహితులం. నా గురించి తనకు తెలియని విషయం అంటూ లేదు. ప్రియ డేటా ప్రొ ఇనిస్టిట్యూట్‌లో ఓ కోర్సులో చేరింది.

Published : 30 Dec 2017 02:02 IST

మనసులో మాట
అపార్థం.. నా ప్రేమకు అనర్థం

నాది విశాఖ. నేను ప్రియా మంచి స్నేహితులం. నా గురించి తనకు తెలియని విషయం అంటూ లేదు. ప్రియ డేటా ప్రొ ఇనిస్టిట్యూట్‌లో ఓ కోర్సులో చేరింది. తనని కలవడానికి నేను అక్కడికి వెళ్లాను. తనతో పాటు ఒక అమ్మాయి కన్పించింది. నా కోసమే పుట్టిందేమో అన్నట్లుగా అనిపించింది. నా మనసు తన నీడతో పాటే తన వెంట వెళ్లిపోయింది. ప్రియను అడిగి తన వివరాలు కనుక్కొన్నా. తనని నాకు పరిచయం చేసింది. తన పేరు యశ్విని. కొన్ని రోజుల పాటు తన కోసం డేటాప్రొ దగ్గరికి వెళ్లేవాణ్ని. తనని చూడకపోతే ఆరోజు నాకు ఊపిరి అందేది కాదు. అలా రోజూ తనని చూడటం... తన గురించి ఆలోచించడం... తన గురించి మాట్లాడటం... ఇదే నా లోకం. సంవత్సరం గడిచింది. ఉన్నట్లుండి యశ్వని టచ్‌లో లేకుండా పోయింది. ఎంత ఏడ్చానో! తర్వాత కొంత కాలానికి ప్రియకు కన్పించింది. ప్రియ నా ప్రేమ విషయం చెప్పి... నాతో ఫోన్‌లో మాట్లాడించింది. నేను ప్రపోజ్‌ చేశాను. ‘మా ఇంట్లో పరిస్థితులు బాగా లేవు. నేనిప్పుడు ఏం చెప్పలేన’ని వెళ్లిపోయింది. ఎడతెగని ఆలోచనలతో 5 నెలలు గడిచింది. నేను ఉద్యోగ ప్రయత్నాలు మానేశాను. తర్వాత కొద్దికాలానికి ఫోన్‌ చేసింది. చాలా గంటలు మాట్లాడింది. ఎంతో సంతోషించాను. రోజూ అలా ఫోన్‌లో మాట్లాడటం... ఎన్నో కబుర్లు. నేను ఓ కలల ప్రపంచాన్ని చాలా అందంగా నిర్మించుకున్నాను. జాబ్‌ చూసుకొని తనని పెళ్లి చేసుకోవాలని నేను హైదరాబాద్‌ వచ్చాను. రోజూ కాల్‌ చేసే తను ఉన్నట్టుండి ఒక రోజు చేయలేదు. ఏదో సమస్య ఉంటుందని అనుకున్నాను. వారం, నెల, సంవత్సరం... తన నుంచి కాల్‌ లేదు. తన చిరునామా అందరినీ అడిగాను. దొరకలేదు. నిర్మానుష్యం. నిస్తేజం. చీకటి. నరకం. ఇలాంటివన్నీ ఎంత ఘోరంగా ఉంటాయో నాకు అనుభవంలోకి వచ్చాయి. ఫిబ్రవరి 25, 2017న మళ్లీ కాల్‌ చేసింది. ఇన్నేళ్లు ఆగిపోయిన నా గుండె మళ్లీ కొట్టుకున్నట్లు అనిపించింది. తనని ఇంకా అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తున్నానని, తన కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాను. తను మాత్రం ఏమీ చెప్పలేదు. మూడు ఫోన్లు, ఆరు వాట్సప్‌లు, 12 ఫేస్‌బుక్‌ పోస్టులు.... ఇలా సాగింది మా ప్రయాణం. ఒక రోజు నా ఫేస్‌బుక్‌కి లక్కీ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. అకౌంటు చెక్‌చేస్తే యశ్వని డేట్‌ ఆఫ్‌ బర్త్‌, ఫోన్‌ నంబరు ఉన్నాయి. తనే అని తెలుసుకున్నాను. రిక్వెస్ట్‌ ఓకే చేశాను. ఈ విషయం ప్రియకు, నా కజిన్‌కు చెప్పాను. వారు నాకో సలహా ఇచ్చారు. ‘ఒరేయ్‌.. తనకు నువ్వంటే ఇష్టమే. అయితే బయటపడటం లేదు. లక్కీ ఎవరో తెలియనట్లు వ్యవహరించి... నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పి,  లవర్‌ పేరడిగితే ప్రియా పేరు చెప్పు’ అని సూచనలిచ్చారు. అప్పుడు తను జెలసీతో అసలు విషయం నీకు చెప్పేస్తుంది. అన్నారు. సరే అని అలాగే చేశాను. 10 రోజుల తర్వాత యశ్వని నా దగ్గరికి వచ్చింది. ఇంకెప్పుడు నాకు ఫోన్‌ చేయకు... నాతో మాట్లాడకు అని చెప్పి వెళ్లిపోయింది. చాలాసార్లు ఫోన్‌ చేశాను. స్పందన లేదు. కాల్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేసింది. వాట్సప్‌ నుంచి తీసేసింది. ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కాలేదు. ఫేస్‌బుక్‌లో మాత్రం లక్కీ పేరుతో కొనసాగింది. అదే నన్ను బతికించింది. లేకపోతే చచ్చిపోయేవాణ్ని. ఒక రోజు నాకు పెళ్లి సంబంధం చూడు అని సరదాగా ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టాను. పెళ్లికాని అమ్మాయినా? పెళ్లైన అమ్మాయినా? అని అడిగింది. అప్పుడు వెలిగింది నాకు... తను ప్రియ గురించి అలా అందని. అప్పటికే ప్రియకు పెళ్లైంది. వారిద్దరూ ఎంతో బాగున్నారు. నేను అసలు జరిగిందంతా చెప్పాను. ‘నువ్వు అపార్థం చేసుకున్నావు. మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు. మేం స్నేహితులమంతే. దయచేసి అర్థం చేసుకో. నీ మనసులో నాపై ఉన్న ప్రేమని బయటికి చెప్పించడానికే ఇలా చేశాన’ని ప్రాధేయపడ్డాను. తను వినలేదు. కొన్ని వేల మెసేజ్‌లు పెట్టాను. తను పట్టించుకోలేదు. ఉద్యోగం మానేశాను. నా కలల ప్రపంచం కుప్పకూలినట్లు అనిపించింది. పిచ్చివాణ్ని అయిపోయాను. తన జ్ఞాపకాలు తప్ప ఇంకేం నా కళ్లకు కన్పించడం లేదు. ‘యశ్వని దయచేసి అర్థం చేసుకో... నిజంగా జరిగింది తెలుసుకో... నేను అప్పుడు, ఇప్పుడు... ఎప్పుడూ నిన్నే ప్రేమిస్తున్నాను. దయచేసి నా ప్రేమను అంగీకరించు.’

- ఇట్లూ నీ తిలకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు