అల్లుకున్న ప్రేమ రాలిపోయింది

తొలి పెళ్లిచూపుల్లోనే నచ్చింది తను. అమ్మకు చెప్పేశాను... ఇంకేం సంబంధాలు చూడొద్దని! అమ్మ ఎక్కడ వద్దంటుందోనని...

Published : 27 Jan 2018 01:25 IST

మనసులో మాట
అల్లుకున్న ప్రేమ  రాలిపోయింది

తొలి పెళ్లిచూపుల్లోనే నచ్చింది తను. అమ్మకు చెప్పేశాను... ఇంకేం సంబంధాలు చూడొద్దని! అమ్మ ఎక్కడ వద్దంటుందోనని. తన నంబర్‌ తీసుకొని ఫోన్‌ చేశాను. ‘మీరంటే ఇష్టం. ఐ లవ్‌ యూ’ అని చెప్పాను. అలా ఎందుకు చెప్పానో ఇప్పటికీ అర్థం కాదు. ‘మా ఇంట్లో వాళ్లతో మాట్లాడ’ండి అంది తను. ‘ముందు మీరు చెప్పండి.. మీకు నేను నచ్చానా?’ అన్నాను. నవ్వింది. మనసు ఉప్పొంగిపోయింది. ఇంకేం ఆలస్యం చేయలేదు. పెళ్లి ఏర్పాట్లు చేసేశాను. ఎవరికి ఎవరు జంటో పైవాడు నిర్ణయిస్తాడంటారు కదా! అందుకే పై వాడికి మనసుపూర్తిగా థ్యాంక్స్‌ చెప్పుకొన్నాను. 2014 మార్చి 28న మా పెళ్లైంది. ఊటికి హనీమూన్‌కు వెళ్లాం. రోజులు క్షణాల్లా కరిగిపోయాయి. తనకు నాకు ఉద్యోగాలు వేరు.. శాఖలు వేరు... అయితే ఒకే ఆవరణ. మూడు నెలలు మూడురోజుల్లా గడిచిపోయాయి. సంసార సాగరంలో మా దాంపత్య నావపై వరద కురవడం మొదలైంది. అమ్మకు తనకూ అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తోందని, నెల జీతం మొత్తం తన పుట్టింటికి పంపుతోందని అమ్మ ఆరోపణ. తనను చీటికీ, మాటికీ అనుమానిస్తోందని, అవమానిస్తోందని తన వాదన. పెద్దామె కదా! సర్దుకొమ్మని చెప్పాను. తను రాజీ పడలేదు. అమ్మను నేను ఏమీ అనలేకపోయాను. తను పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంతో బాధేసింది. వెళ్లి బతిమాలాను. రాలేదు. ఈ లోపు వాళ్ల అమ్మ, అక్క, బావ అందరూ తనకి లేనిపోనివి చెప్పారు. కారణం చెప్పకుండానే నన్ను అసహ్యించుకోవడం మొదలు పెట్టింది. ఎందుకో తెలియదు. నేను తనని ఎంతగా ప్రేమించానో తను తెలుసుకోలేదనిపించింది. ఎంతగా ఆరాధిస్తున్నానో గుర్తించలేకపోయింది. అందుకే అలా మాట్లాడుతోందని అనుకున్నాను. నా స్నేహితుడి ద్వారా చెప్పి పంపాను. తన స్నేహితురాళ్లతో చెప్పించాను. తను పట్టించుకోలేదు. ఒక రోజు ఉన్నట్టుండి నన్ను, మా అమ్మని పోలీసుస్టేషన్‌కు పిలిచారు. వెళ్లాం. అప్పుడర్థమైంది. తను మా మీద కేసు పెట్టిందని. గుండె పగిలిపోయింది. తనంటే నాకిష్టమని తనను పంపించమని పోలీసుస్టేషన్లో చెప్పాను. తనేమో మీ అమ్మ ఉంటే రానంది. నేను దానికి ఒప్పుకోలేదు. మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా పెంచింది. నాన్న చనిపోతే కష్టపడి చదివించింది. ‘నేను అమ్మను వదలలేను’ అన్నాను. ‘అయితే నన్ను వదిలేయ్‌’ అంది. మనసు కకావికలమైంది. తన మనసు పందిరి మీద అల్లుకున్న నా ప్రేమ మల్లె తీగ నిలువునా రాలిపోయింది. అంతే స్టేషన్‌ నుంచి అమ్మను తీసుకొని బయటికి వచ్చేశాను. తర్వాత ఎన్నో సార్లు పెద్దలతో చెప్పించాను. స్నేహితులతో రాయబారం పంపాను. ఫోన్‌ చేశాను. తొలుత ఫోన్‌లోనైనా మాట్లాడింది. తర్వాత ఫోన్‌ ఎత్తడం మానేసింది. తనలో మార్పు లేదు. నాకు ఊపిరి ఆడటం లేదు.
ఎందుకు సుశీల ఇలా చేస్తున్నావ్‌? నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు. అంతేగాని నన్ను ఇలా బాధ పెట్టకు. నేను నీ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నాను. అమ్మ ఉంటే నీకేంటి కష్టం? నా మాతృమూర్తిని వదిలిపెట్టమని చెప్పడం నీకు న్యాయం కాదు? నిన్ను ఎవరో నానుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు..! మనం దంపతులయ్యాక గడిపిన మూడు నెలలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో...! నా ప్రేమను అర్థం చేసుకో...! రా మన కలల ఇంటికి రా... నీ కోసం నా మనసుతో కట్టిన తోరణం స్వాగతం పలుకుతుంది.

....నీ జగదీష్‌, నెల్లూరు   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని