తనే సోల్‌మేట్‌ అవుతుందా?

ధర్మవరం రైల్వేస్టేషన్‌ కిక్కిరిసి ఉంది. రైలు వస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్‌ రైలు అది. నేను ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నా....

Published : 17 Feb 2018 01:37 IST

తనే సోల్‌మేట్‌ అవుతుందా?
మనసులో మాట

ధర్మవరం రైల్వేస్టేషన్‌ కిక్కిరిసి ఉంది. రైలు వస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్‌ రైలు అది. నేను ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నా. వారానికి ఒకసారి ముదిగుబ్బకు వెళ్లేవాణ్ణి. అది నా సొంతూరు. నాలాగే ధర్మవరం నుంచి కదిరికి వెళ్లొచ్చేది ఒక అమ్మాయి. పేరు ఫక్రుమా. పెద్ద కళ్లు. చెవులకు ఊగే జుంకీలు. చేతులకు వెడల్పాటి రబ్బరు గాజులు. భుజాన మట్టికలరు హ్యాండ్‌బ్యాగు. నవ్వుముఖం ఆమెది. ఆమెను చూసిన అరగంటలో ఇరవైఐదు నిమిషాలు ముఖం మీద చెరగని చిరునవ్వు కనిపించేది. నేనొక రోజు రైలు వస్తూనే.. కిటికీలో చేతిరుమాలు వేశాను. అదే సీట్లో ఆమె కూర్చుంది. నావైపు చూసి నవ్వింది. పరిచయం అయ్యింది. చాలా క్లోజ్‌ అయ్యాం. ఒక రోజు నాతో ఏదో చెప్పాలని టెన్షన్‌ పడుతోంది. ‘నీళ్లు తాగుతారా’ అంటూ బాటిల్‌ చేతికి ఇచ్చింది. మిగిలిన సగం బాటిల్‌ నీళ్లు ఆమె తాగింది. ఖాళీ బాటిల్‌ను కిటికీలోంచి విసిరేసింది. అప్పటికి చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్‌ దగ్గరుంది రైలు. ‘మీ ఫోన్‌ నెంబర్‌ ఇస్తారా’ అనడిగాను. కనుగుడ్లు ఓ వైపునకు తిప్పి సొట్ట నవ్వు నవ్వింది. ముదిగుబ్బలో రైలు దిగేప్పుడు ‘నీకు నా ఫోన్‌ నెంబర్‌ కావాలంటే.. అక్కడ పడేసిన ఖాళీ వాటర్‌ బాటిల్‌ మీద రాశాను. కావాలంటే వెళ్లి వెతుక్కో’ అంది. ఆ కొంటెతనంలో నా పట్ల చిన్న ఇష్టం ఉందని తెలిసింది. కళ్లింతలు చేసుకుని వెళుతున్న రైలు వంకే చూస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు ఇంకో రైలుకు వెళ్లి.. చిన్నేకుంటపల్లి రైల్వేస్టేషన్‌లో దిగాను. ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లన్నీ వెతుక్కుంటూ పోయాను. ఒక్కటీ దొరకలేదు. రైల్వేలైన్‌ కంకర మీద ఒక బాటిల్‌ పడుంది. దాన్ని తీసుకుని తిప్పి తిప్పి చూశా. బాల్‌పెన్‌తో ఒక చోట.. ‘ఐ లవ్‌ యు రైల్‌మేట్‌’ అని రాసుంది. తను చెప్పినట్లు ఫోన్‌ నెంబర్‌ లేదు. కానీ, మనసు లోపల మాత్రం ఇది ఆ అమ్మాయి రాసిందేనన్న నమ్మకం బలంగా ఉంది. మరో ఆదివారం రైలు ఎక్కినప్పుడు అదే బాటిల్‌లో నీళ్లు పోసుకుని వెళ్లాను. ‘తాగుతారా..’ అంటూ ఇచ్చాను. బాటిల్‌ను చేతికి తీసుకున్న ఆమె.. దాని వంకే తెగ చూసింది. ‘ఏంటి ఇలా రాసుకున్నారు’ అంది. ‘అబ్బే నేను కాదు. నా రైల్‌మేట్‌ రాసింది..’ అన్నాను నవ్వుతూ. తల అటూఇటూ ఊపుతూ.. ‘మీరు చాలా తెలివైన వాళ్లు’ అంది. ఇద్దరం ఒకేసారి ఫక్కున నవ్వాం. మా ఇద్దరి కళ్లలో ఒకే భావం. ఎన్నో ఏళ్ల నుంచి ఒకరి కోసం మరొకరం పుట్టామేమోనన్న ఫీలింగ్‌. నాకెంతో మంది క్లాస్‌మేట్‌లు ఉన్నారు. ఫ్రెండ్‌షిప్‌లో సోల్‌మేట్స్‌ ఉన్నారు. కానీ, మనసులో బెర్తును కన్‌ఫార్మ్‌ చేసుకున్న రైల్‌మేట్‌ మాత్రం ఎవరూ లేరు. మా రైలు ప్రయాణం ఇప్పటికైతే ఒక బోగీకి మరో బోగీ పెనవేసుకున్నంత బలంగా ముడిపడింది. ఇంట్లో చెబితే మతాంతర వివాహానికి ఒప్పుకుంటారా? మా ప్రేమ ప్రయాణం ఏ స్టేషన్‌లో ఆగుతుంది? రెడ్‌ సిగ్నల్‌ పడుతుందా లేదంటే గ్రీన్‌ సిగ్నల్‌తో సుఖాంతం అవుతుందా? ఏమీ తెలీదు. అంత వరకు ఈ రైల్‌మేట్‌తోనే నా ప్రయాణం.

- ఎం.నారాయణస్వామి, ముదిగుబ్బ, అనంతపురం జిల్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని