మేం ప్రేమికులం మాది ప్రేమ కులం

మాది రాజమండ్రి. తన పేరు చిన్నా. మేం ఎనిమిదిలో ఒకే తరగతి. ఇద్దరం ఎప్పుడూ.....

Published : 03 Mar 2018 01:05 IST

మనసులో మాట
మేం ప్రేమికులం మాది ప్రేమ కులం

మాది రాజమండ్రి. తన పేరు చిన్నా. మేం ఎనిమిదిలో ఒకే తరగతి. ఇద్దరం ఎప్పుడూ గొడవపడేవాళ్లం. తరగతులతో పాటు... మా మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. తొమ్మిదేళ్లు మంచి ఫ్రెండ్స్ మేం. ఆ తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలిసింది. ప్రేమించుకున్నాం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. ఎనిమిదో తరగతిలో మమ్మల్ని చూసిన స్నేహితులు.. ఇప్పుడు చూస్తే షాక్‌ అవుతారు. అంత క్లోజ్‌గా ఉంటాం. తను నాకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. నేను తనే లోకంగా బతుకుతుంటాను. సంవత్సరాలు రోజుల్లా, రోజులు... గంటల్లా, గంటలు... నిమిషాల్లా కరిగిపోతున్నట్లు అన్పించింది. జీవితం మొత్తం తన ప్రేమ నాకుంటే... ఈ ప్రపంచంలో ఇంకేం నాకు వద్దనిపించింది. ఎవరికీ తెలియకుండా గోదావరి గట్టు మీద మేం నడుస్తున్నప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది. కళాశాలకు సెలవు రోజుల్లో నన్ను చూడటానికి అతను మా ఇంటి ముందు తిరగడం, అతని ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను వాళ్లింటికి వెళ్లి చూసిరావడం అన్నీ మధురానుభూతులే. దూరమున్న సమయంలో క్షణానికో వాట్సప్‌, నిమిషానికో ఫొటో అప్‌డేట్‌ ఇలా నడిచింది. ఎంతో హాయిగా సాగిపోతున్న మా ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. నాదీ, చిన్నాది వేరేవేరే కులాలు. పెద్దలు అస్సలు ఒప్పుకోలేదు. తను మాత్రం ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లిచేసుకుందామన్నాడు. నేను ఇంట్లో వాళ్ల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాను. వాళ్లు ఎప్పుడు కరుణిస్తారో తెలియదు. మమ్మల్ని కలుసుకోనివ్వడం లేదు. మాట్లాడుకోనివ్వడం లేదు. తను మాత్రం నాకోసం పిచ్చివాడిలా మారుతున్నాడు. నన్ను వదిలేసి వేరే వాళ్లను పెళ్లిచేసుకోమని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. నువ్వు లేకపోతే ఈ జీవితం వద్దని, నీ కోసం ఎంత కాలమైనా నిరీక్షిస్తానని చెబుతున్నాడు. నేను మా ఇంట్లో వాళ్లను ఒప్పించలేకపోతున్నాను. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కాదనం... కులం మాత్రం చెడొద్దని అంటున్నారు. అలా జరిగితే కుటుంబం పరువు గోదారిలో కలుస్తుందంటున్నారు. పరువు పోయాక ప్రాణాలెందుకని నన్ను మాటలతో కట్టేస్తున్నారు. వేర్వేరు కులాల్లో పుట్టడం మా తప్పా? నానో యుగంలో కూడా ఇంకా కులాల పట్టింపులేంటి? పెద్దలు దయచేసి అర్థం చేసుకోండి. మాది ప్రేమ‘కులం’. మా లాంటి ప్రేమికుల్ని కలపండి.

- బుజ్జి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని