మనసు అప్పుడే చచ్చిపోయింది

నా పేరు అనూరాధ. మాది విజయవాడ. అమ్మా, నాన్న, మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం.....

Published : 10 Mar 2018 01:45 IST

మనసు అప్పుడే చచ్చిపోయింది

నా పేరు అనూరాధ. మాది విజయవాడ. అమ్మా, నాన్న, మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నేనే పెద్దదాన్ని. సంతోషంగా ఉండేవాళ్లం. మేం బాగా చదువుకోవాలనేవారు అమ్మా, నాన్న. అనుకున్నవన్నీ జరగవు. బంధువుల ఇంటికి వెళ్లిన అమ్మా, నాన్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మేం ముగ్గురం అనాథలయ్యాం. పక్క ఊరిలో ఉండే అమ్మమ్మవాళ్లు మమ్మల్ని వాళ్లింటికి తీసుకెళ్లారు. అక్కడే ఉంటూ చదువు కొనసాగించాం. మావయ్య బాగానే చూసేవాడు. అయితే ఆయనకు పెళ్లి అవడంతో మా కష్టాలు మొదలయ్యాయి. మాకు అన్నం పెట్టడానికి అత్త ఒప్పుకొనేది కాదు. ఇంట్లో పనంతా చేసి స్కూల్‌కు వెళ్లేవాళ్లం. రోజుకు ఒకసారి మాకు అన్నం పెట్టేవారు. పదోతరగతి పాసయ్యాను. నేను ఏదైనా చిన్న ఉద్యోగం చేసి, కనీసం చెల్లెళ్లకు కడుపునిండా అన్నం పెట్టాలనిపించేది. ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా,  గతంలో మా ఊరి నుంచి కొంతమంది మహిళలను ఉద్యోగాలకు తీసుకెళ్లినవాళ్లు వచ్చారు. ఉత్తరాదిన బనియన్ల కంపెనీలో పని ఇప్పిస్తామని చెప్పడంతో, మా ఊరిలో నా వయసు వారే మరో పదిమంది కలిసి వస్తామని చెప్పాం. అమ్మమ్మతో చెప్పా. ఎందుకు అంత దూరం అంది. మరి చెల్లెళ్లకు అన్నీ చూడాలి కదా అని ఒప్పించాను. నాకు భోజన వసతులు ఇచ్చి, నెలకు నాలుగువేల రూపాయలు జీతం ఇస్తామన్నారు. వీటితో చెల్లెళ్లను లోటు లేకుండా చూసుకోవచ్చనుకుని సరే అన్నా.

సంతోషంగా రైలెక్కి, మరుసటిరోజుకు ఏదో ఊరు చేరుకున్నాం. అక్కడ మమ్మల్ని ఓ పెద్ద బంగళాకు తీసుకెళ్లారు. సిద్ధమవ్వండి, పనికి వెళ్లాలన్నారు. మేమంతా రెడీ అయ్యాం. ఆ తరువాత ఎవరెవరో వ్యక్తులు వచ్చి మమ్మల్ని చూసి వెళ్లడం ప్రారంభించారు. మాకు ముందు అర్థం కాక, అక్కడో మహిళ ఉంటే అడిగాం. ఆ తరువాత తెలిసింది, మమ్మల్ని వేశ్యావృత్తి చేయించే వ్యక్తులకు విక్రయిస్తున్నారని. మేమంతా గొడవ పడ్డాం. నలుగురు రౌడీలు మమ్మల్ని తీవ్రంగా కొట్టారు ఆ రోజు రాత్రి మేం ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాం. పారిపోవడం కుదరదని అర్ధమైంది. మర్నాడు నన్ను మరో చోటుకి తరలించారు. భాష తెలీదు, మనుషులు తెలీదు. ఎందుకిలా వచ్చి ఇరుక్కున్నానని ఎన్నోసార్లు బాధపడ్డాను. ఏడ్చాను. వేశ్యావృత్తి చేస్తేనే అన్నం పెడతామన్నారు. అన్నం వద్దన్నాను. బాగా కొట్టారు. ఒంటిపై యాసిడ్‌ పోస్తామని బెదిరించేవారు. వాళ్లు మనుషులు కాదు నారీమాంస భక్షకులు. అప్పటికే మనసు చచ్చిపోయింది. నన్ను ఆ వృత్తిలోకి దింపారు. అమ్మమ్మ మాట వినుంటే ఇలా జరిగుండేది కాదని ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలీదు. అప్పటికే నా జీవితం చేయి జారిపోయింది.

అది ముంబయి శివార్లలో ఓ మారుమూల ప్రాంతమని తెలుసుకోవడానికి మూడు నెలలు పట్టింది. చెల్లెళ్లు గుర్తువచ్చేవారు. ఏడ్చిఏడ్చి కళ్లు ఎంతగా బీటలు వారాయంటే... నాకు నేను అద్దంలో నెర్రెలు, నెర్రెలుగా చీలిపోయి కన్పిస్తున్నాను. కొంతకాలానికి బాగా జబ్బు పడ్డాను. ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎయిడ్స్‌ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. దీంతో నిర్వాహకులు ఇంట్లో పనులు చేయించేవారు. ఒకసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండువేల రూపాయలు ఇచ్చి, ఇంటికి వెళ్లిపొమ్మని, విజయవాడకు టిక్కెట్టు చేతిలో పెట్టారు. అమ్మమ్మ, చెల్లెళ్ల వద్దకు వెళ్లాను. అమ్మమ్మకు అన్నీ చెప్పాను. దాంతో నన్ను విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఉందని చెప్పారు. మందులు వాడితే మిగతావారిలాగే బతకడానికి అవకాశం ఉందన్నారు. అమ్మమ్మ ఒప్పుకోలేదు. గ్రామంలో పరువు పోతుందని, ఇంటికి రావడానికి వీలు లేదని తెగేసి చెప్పేసింది. ఆసుపత్రివాళ్లు, చెన్నైలో ఓ స్వచ్ఛంద సంస్థ నాలాంటివాళ్లకి వైద్యంతోపాటు షెల్టర్‌ ఇస్తారని చెప్పారు. దిక్కులేక చెన్నై రైలెక్కా. తీరా అడ్రస్‌ పోయింది.  భాష తెలీక, పగలు అడుక్కుని తింటూ, రాత్రిళ్లు ప్లాట్‌ఫారంపై నిద్రపోయేదాన్ని. అలా పది రోజులు గడిచాయి. ఓ రోజు తెలుగు మాట్లాడేవారు కనిపిస్తే వాళ్లని సాయం అడిగా. ఆ సంస్థ చిరునామా కనుక్కొని నన్ను ఆటో ఎక్కించి పంపించారు.

ఆ స్వచ్చంద సంస్థ అందించిన చేయూత మరువలేనిది. ఇప్పుడు అక్కడే మందులు వాడుతున్నా. నాకు ఇప్పుడు 22 ఏళ్లు. ఇక్కడ నాలాగే ఇటువంటి వ్యాధి ఉన్న మరో వ్యక్తిని వివాహం చేసుకున్నాను. ఇద్దరం ఇక్కడే నాలాంటివారికి సేవలందిస్తున్నాం. మాకు ఓ పాప. అయితే పాపకు హెచ్‌ఐవీ లేదు. ఇప్పుడు అమ్మమ్మ, చెల్లెళ్లు ఎవరూ నాతో మాట్లాడరు. నేను చనిపోయానని ఊర్లో చెప్పారట. సొంతవాళ్లని వదిలేసి బయటకు అడుగు పెట్టినప్పుడు నాకు 16 ఏళ్లు. ఈ ఐదేళ్లలో  నా జీవితం ఎలా మారిపోయిందో అని అనిపిస్తేనే చాలా వేదనగా ఉంటుంది. దీనికి కారణం తెలిసీ తెలియని వయసులో వేసే తప్పటడుగా? నన్ను పట్టించుకోని బంధువులదా? అమ్మానాన్నలను చంపేసిన దేవుడిదా? క్రూరత్వానికి పోతపోసిన మగమృగాళ్లదా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని