నా ప్రేమ కుశలమేనా..?

మా ఊరు చిన్నపట్నం. డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాను. నా స్నేహితులంతా......

Published : 24 Mar 2018 01:28 IST

నా ప్రేమ కుశలమేనా..?

మా ఊరు చిన్నపట్నం. డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాను. నా స్నేహితులంతా కలిసి చిన్న వారపత్రిక నడిపేవాళ్లం. సాహిత్యంతో పరిచయం ఉండటంతో ప్రతీవారం కవితలు నేనే రాసేవాడ్ని. అలాగే ఓ ప్రముఖ వార్తాపత్రికకూ స్థానిక వార్తలను పంపేవాడిని. పాకెట్‌మనీ కోసం చేసే చిన్న ఉద్యోగమది. ఓరోజు సన్నని జల్లులు పడుతున్నాయి. పత్రికకు కవిత రాయాలి. టీ తాగాలనిపించింది. దగ్గరున్న టీకొట్టుకు ఆ చినుకుల్లో తడుస్తూ వెళ్లాను. అప్పుడే మొదటిసారి చూశాను తనని. చుడీదార్‌లో దుపట్టా నెత్తిపైన కప్పుకొని వేగంగా నడుస్తూ.. నన్ను చూసి ఆగింది. మీరు స్వామి కదా..అంది. భలే ఉంది ఈమె గొంతు అనుకున్నా. మీరు మా సీనియర్‌, నాకు తెలుసు. నేను వేరే గ్రూపు లెండి...! అంటూ మాట్లాడటానికి అవకాశం లేకుండా వేగంగా మాట్లాడుతోంది. స్వతహాగ మితభాషిని నేను. అలా నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు నడిచాను. నా గురించి చెబుతోంది. ఆ వేగాన్ని నేను

అందుకోలేకపోయా. మాటల్లోనే ఎక్కడికి అని అడిగింది. టీకి అని చెప్పా. ఇక్కడుంది రండి  అంటూ.. తనే ముందు వెళ్లింది. అలా మొదలైంది ఆమెతో నా మొదటి పరిచయం.
తను సైన్సు గ్రూపు, నేను ఆర్ట్స్‌. అయితే నా గురించి పూర్తిగా తెలుసు తనకు. నా కవితలన్నింటినీ గడగడా చెప్పేసేది. అలా మా పరిచయం పెరిగింది. మూడో వ్యక్తి గురించి మా మధ్య సంభాషణ ఉండదు. ఎక్కువగా పుస్తకాల గురించే. తిలక్‌, లత, శ్రీశ్రీ, చలం రచనలు  మా మధ్య తిరిగేవి. తనకు రష్యన్‌ రచనలంటే పిచ్చి. ఆమె మాట తీరు, వేగం, వ్యక్తిత్త్వం చూస్తే చాలా ఇష్టంగా ఉండేది. ముఖం తెలియని వారెవరినైనా నవ్వుతూ పలకరిస్తుంది. ఆమె ముఖంపై ఎప్పుడూ చిరునవ్వే. ప్రతీవ్యక్తిని గౌరవించేది. ఆమెది తీయని గొంతు. లతామంగేష్కర్‌, సుశీల, జానకి పాటలన్నింటినీ పాడేది. చినుకులు పడితే చాలు, ఇద్దరం ఇరానీ చాయ్‌ తాగుతూ.. కవిత్వం చెప్పుకునేవాళ్లం. తనొక అద్భుతం నాకు.

డిగ్రీతోపాటూ మా స్నేహమూ పెరిగింది. మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నేను ప్రేమించాను ఆమెను. కానీ ఎప్పుడూ ప్రేమ గురించి చర్చ రాలేదు. చెప్పాలనుకునేవాడిని. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. అందరూ నన్ను చాలా మర్యాదగా చూసేవారు. ఇద్దరం పుస్తకప్రియులం కావడంతో పుస్తక సమావేశాలను వదిలేవాళ్లం కాదు. వేదికపై విశ్లేషిస్తూ నేను మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేది. అప్పుడప్పుడూ వేదికపై తను పాటలు పాడేది. తను ఎక్కడ ఉంటే ఆ చోటును, అక్కడ ఉండే అందరి మనసులనూ ఆక్రమించేసేది. అంతటి ఉత్సాహం ఆమెలో.  దాదాపు మూడేళ్లపాటు మేమిద్దరం స్నేహితులం. చివరికి నా ప్రేమను  చెప్పేశాను.నాకు తెలుసంటూ ముగ్ధంగా నవ్వింది. ఇద్దరం జీవితాల్లో స్థిరపడి పెళ్లి చేసుకుందామనుకున్నాం. మేం ప్రేమికులం, అంతకు మించి మంచి స్నేహితులం.మా అభిరుచులూ, ఆలోచనలు ఒకటే.

అందరి ప్రేమ కథల్లోలాగే మా కథలోనూ మలుపు. మా పెళ్లికి అభ్యంతరం వచ్చింది. కులం, ధనం ముఖ్యపాత్రలయ్యాయి. సమయం లేదు. పెళ్లి చేసుకుందాం అని చెప్పా. కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చిందో ఏమో నవ్వి, అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇద్దరి కళ్లల్లో నీళ్లు. అప్పుడు కూడా వర్షం. ఆ చినుకుల్లో మా కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. తనకు పెళ్లై, వెళ్లిపోయింది. జీవితమంతా శూన్యంగా అనిపించింది. పిచ్చాడిలా తిరిగాను. స్నేహితుల చేయూతతో తిరిగి మామూలు మనిషయ్యా. ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. డబ్బుకు లోటు లేదు. కానీ తను లేని లోటు మాత్రం తీరదు.

ఓ రోజు సాయంత్రం రోడ్డుపై నడుస్తుంటే.. తన పలకరింపు, ఎన్నో ఏళ్ల తరువాత. ఎదురుగా తను. నమ్మలేకపోయా. ఏం చేస్తున్నావంటూ అడిగింది. తన కళ్లల్లో ఏదో వెలితి. కళ లేదు. నా కళ్లల్లో అవకాశం ఇస్తే జారిపోయేలా కన్నీళ్లు. మాటలు రాక తలూపా. తనని అడిగా సిటీలైఫ్‌ కదా. వేగంగా ఉంది అంది. చదువు, సంగీతం, సాహిత్యంలో ముందుండే తను, జీవితంలో వెనకుందెందుకు అనిపించింది. నా వెలితి తనే. కానీ తన జీవితంలో వెలితెందుకు. ఆలోచించా. ఆర్ధికంగా చేయూతగా తన చదువుకు అవకాశాన్ని ఇప్పించా. మేం మంచి స్నేహితులం. సరైన నిర్ణయం తీసుకోలేక తనను కోల్పోయా. ధైర్యంగా అప్పుడు తనను సాధించుకోగలిగితే నా జీవితం సంపూర్ణంగా ఉండేదేమో. ధైర్యం ఉంటేనే ప్రేమించాలి. ఇప్పుడు కనీసం తను బాగుంటే చాలనుకుని, ఎప్పటికప్పుడు తన కుశలాన్ని తెలుసుకుంటూ ఉండే నా ప్రేమ నిజంగా కుశలమేనా... నా కిష్టమైన తను కుశలమేనా.. తనను సాధించుకోలేని నా ప్రేమ అప్పటి నుంచి ఇప్పటివరకు కుశలమేనా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని