ముందే కాల్‌ చేసి ఉంటే!

మాది కడప జిల్లా రాయచోటి. నేను, శైలజ(పేరు మార్చాం) ప్రేమించుకున్నాం.

Published : 31 Mar 2018 01:47 IST

ముందే కాల్‌ చేసి ఉంటే!

మాది కడప జిల్లా రాయచోటి. నేను, శైలజ(పేరు మార్చాం) ప్రేమించుకున్నాం. మాది తెలిసీ, తెలియని ప్రేమేం కాదు. ఇద్దరికీ కుటుంబ బాధ్యతలు తెలుసు. పరిస్థితులు తెలుసు. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. నా సంపాదన మీదే బతికే కుటుంబం నాది. డిగ్రీ చదివేటప్పుడే నాన్న చనిపోయారు. మా అమ్మ ఉన్నదాంట్లో సర్దుకొని, ఎంతో కొంత మిగిల్చి చెల్లి పెళ్లికి దాచిపెడుతుంది. కళాశాల చదివే రోజుల నుంచి నా గురించి శైలజకు తెలుసు. వాళ్ల అక్క పెళ్లికి కట్నం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని నాకు చెబితే దాచుకున్న డబ్బు తనకి ఇచ్చాను. అది మార్చి 14, 2017 ఇంతలో తనకి ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని, ఆ రోజు తనని చూడటానికి ఎవరో వస్తున్నారని చెప్పింది. అదే రోజు అమ్మకు తనని పరిచయం చేయడానికి ఇంటికి తీసుకెళ్లాను. అమ్మకు తను నచ్చలేదు. కులాంతర వివాహానికి ఒప్పుకోనని గట్టిగా చెప్పేసింది. దీనికి శైలజ చాలా హర్ట్‌ అయింది. ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్లిపోయింది. నేను వెంవెళ్లి బతిమాలాడాను. తను నా మాట వినిపించుకోకుండా వేగంగా వెళ్లిపోయింది. తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తియ్యలేదు. వారం రోజుల తర్వాత ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసింది. తన ఫ్రెండ్‌తో ఒకసారి మాట్లాడమని చెప్పిపంపాను. ఒప్పుకోలేదు. తనకి ఏప్రిల్‌ 27 పెళ్లి అని, ఇక తన జోలికి రావద్దని చెప్పి పంపింది. తనను మరిచిపొమ్మని కొత్త నంబర్‌ నుంచి మెసేజ్‌ పెట్టింది. ఎంతగా ఏడ్చానో. అమ్మకు ఎంతగా చెప్పి చూశానో. ‘నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే నీ చెల్లి పెళ్లి జరగదు.  మేం అంతా చచ్చిపోతామ’ని అమ్మ బెదిరించింది. తనని కలవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా తను ఒప్పుకోలేదు. పిచ్చి వాడిని అయిపోయాను. లోకం మొత్తం చీకటైపోయింది. అది ఏప్రిల్‌ 27 తను మెసేజ్‌ పెట్టిన నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘రే నువ్వు లేకుండా నేను బతకలేను. ఏదో మీ అమ్మ అలా మాట్లాడే సరికి కోపంతో ఇంటికి వెళ్లాను. అక్కడ పెళ్లిచూపులకు ఓకే చెప్పాను. వారికి నేను నచ్చడంతో పెళ్లి నిశ్చయించేశారు. నా కోపం నా కళ్లు మూసుకుపోయేలా చేసింది. ఇప్పుడు ఆలోచిస్తే నా ప్రాణం నాతో లేదనిపిస్తోంది. దయచేసి వచ్చి నన్ను తీసుకెళ్లు’ అని ఏడ్చేసింది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్కరోజు ముందు ఈ కాల్‌ చేసినా నిన్ను తీసుకొచ్చేవాడిని. ఇప్పుడు భావ్యం కాదని చెప్పాను. అప్పుడైతే నీది, నాదే జీవితం. రెండు రెండు కుటుంబాలది అన్నాను. తన ఎక్కిళ్లు నాకు వినిపిస్తున్నాయి. చాలాసేపు మౌనం... ఫోన్‌తో పాటు మా ప్రేమ బంధమూ తెగిపోయింది.

- చిన్నా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని