ఊపిరే వద్దనిపిస్తోంది ‘మమ్మీ’

తన పేరు సౌమ్య(పేరుమార్చాం). నేలపై కురిసే పున్నమి వెన్నెల మొత్తాన్ని శిల్పంగా మలిస్తే ఎంత అందంగా ఉంటుందో అంతే సౌందర్యం తనది. మంచి మాట, మంచి మనసు, మంచి నడవడిక...

Published : 07 Apr 2018 01:17 IST

ఊపిరే వద్దనిపిస్తోంది ‘మమ్మీ’

న పేరు సౌమ్య(పేరుమార్చాం). నేలపై కురిసే పున్నమి వెన్నెల మొత్తాన్ని శిల్పంగా మలిస్తే ఎంత అందంగా ఉంటుందో అంతే సౌందర్యం తనది. మంచి మాట, మంచి మనసు, మంచి నడవడిక... ఇంతకంటే ఒక అబ్బాయికి ప్రేమించడానికి ఏం కావాలి? నేను తన ప్రేమలో పడిపోయాను. తన శ్వాసతోనే నాకు ఊపిరి ఆడుతుందేమో అనుకునే వాణ్ని. తనకూ నేను నచ్చాను. ఆరు నెలల మా ప్రేమలో 60 ఏళ్ల జీవితం ఎలా ఉండాలో కల కన్నాం. ఒకసారి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లినప్పుడు తను నా భుజం పై తల వాల్చి ‘రే... మనం ఎప్పుడూ ఇలాగే ఉంటాం కదా!’ అంది. నేను తప్పకుండా అని తన నుదుటిపై ఒట్టేశాను. మా అమ్మ తర్వాత అన్ని ముద్దలు నీ చేత్తోనే తిన్నాను. అందుకే నిన్ను మమ్మీ అంటాను అన్నాను. ‘మా నాన్నలా నన్ను చూసుకుంటావ్‌ రా అందుకే నిన్ను డాడీ’ అంటాను అనేది తను. అలాగే పిలుచుకునే వాళ్లం. ఒక్క నిమిషం కూడా తన మాటలు వినకుండా ఉండలేకపోయాను. ఒక్క క్షణం తను కన్పించకపోయినా విలవిలలాడేవాణ్ని. ఒక సారి తను మూడురోజులుగా నాతో సరిగ్గా మాట్లాడలేదు. నేను సీరియస్‌ అయ్యాను. అందులో తను నా ప్రేమను చూడలేకపోయింది. తను లేకుండా ఉండలేకపోతున్నాననే విషయాన్ని గ్రహించలేకపోయింది. ఉన్నట్టుండి ఒక రోజు ఫోన్‌ చేసి సీరియస్‌ అయింది. ఇక నాతో మాట్లాడొద్దు అని గట్టిగా చెప్పింది. కారణం చెప్పమని బతిమాలాను. క్షమించమని మెసేజ్‌లు పెట్టాను. ఫోన్‌లు చేశాను. గట్టిగా నిలదీస్తే ఒక నెల రోజుల తర్వాత చెబుతాను అంది. ఇప్పటికి మూడు నెలలు గడిచిపోయింది. తను ఫోన్‌ నంబర్‌ మార్చేసింది. నేను బతికున్న విషయమే మరిచిపోయాను. ప్లీజ్‌ మమ్మీ మనం గడిపిన క్షణాలు గుర్తు చేసుకో. మనం చివరిసారిగా కలుసుకున్నప్పుడు నువ్వు ఒక్కమాట అన్నావు... ‘నిన్ను ప్రేమిస్తే... మా అమ్మానాన్నలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయినట్లే కదా’ అని.... అందుకే ఇలా చేశావా? నాకు సమాధానం చెప్పు. మనం ప్రేమించకున్నామే గానీ... ఎప్పుడూ తప్పు చేయలేదు. ఏ ఫోన్‌ వచ్చినా నువ్వే నేమో అని తీస్తున్నాను. నీ మెసేజ్‌ వచ్చినా నీదే నని చూస్తున్నాను. నువ్వు లేకుండా అసలు ఊపిరి వద్దనిపిస్తోంది. నువ్వు ఎక్కడున్నా ‘మనసులో మాట’ చదువుతావని తెలుసు. అందుకే ఈ విరహ లేఖ రాశాను. దీన్ని చదివాకైనా నా ప్రేమను అర్థం చేసుకో. నాతో ఒక్కసారి మాట్లాడు. నీ కాల్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని