ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు

నా పేరు వికాస్‌ కుమార్‌. నాకు జయసుధ(పేర్లు మార్చాం)తో పెళ్లై పదేళ్లు. మా అన్యోన్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు....

Published : 14 Apr 2018 02:03 IST

మనసులో మాట

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు

నా పేరు వికాస్‌ కుమార్‌. నాకు జయసుధ(పేర్లు మార్చాం)తో పెళ్లై పదేళ్లు. మా అన్యోన్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని సాగేది జీవితం. ఉన్నంతలో హాయిగా బతికేవాళ్లం. పదేళ్ల మా కాపురంలో ఇద్దరం పాలు నీళ్లలా కలిసిపోయామనుకున్నాను. అది అబద్ధమని నాకు తెలిసే సరికీ పరిస్థితి నా చేయి దాటిపోయింది. జయ ప్రవర్తన చిత్రంగా మారిపోయింది. నాతో చీటికిమాటికి గొడవ పెట్టుకునేది. విసుక్కునేది. ఇంతకు ముందులా నా కోసం ఎదురుచూడటం మానేసింది. నువ్వు నాతో ఉంటే సమయమే తెలియదనే నా భార్య... ఇప్పుడు నేను ఇంట్లో ఉంటేనే మండిపోతోంది. నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడటం. ఫేస్‌బుక్‌, వాట్సప్‌లో మెసేజ్‌లు.. నేను ఎక్కడ ఫోన్‌ చూస్తానోనని నిత్యం భయం... ఇలా మారిపోయింది తన పరిస్థితి. పిల్లల్ని సైతం పట్టించుకోవడం మానేసింది. 2017 ఏప్రిల్‌ నెలలో ఎందుకిలా అని నేను ఆరా తీశాను. జయ పెళ్లికి ముందు ఒకర్ని ప్రేమించిందని, వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకుందని తెలిసింది. అప్పుడు మళ్లీ ఆ పాత ప్రేమికుడు తనను ఫోన్‌లో కాంటాక్ట్‌ అయ్యాడని అర్థమైంది. నేను గట్టిగా ఒకరోజు నిలదీశాను. నువ్వు అలా చేస్తే పిల్లలు నేను, ఏమైపోతామో ఆలోచించమని చెప్పాను. తను వినలేదు. పైగా తన ప్రియుడు ఇన్నేళ్లు తనకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడని నాతో చెప్పింది. నేను ఎంత నిర్లక్ష్యం చేసినా నువ్వు నన్ను వదలడం లేదు. నన్ను ఏమి చేయమంటావ్‌? అంటూ తలపట్టుకొని కూర్చొంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఒక్కసారిగా నా కుటుంబాన్ని డైనోసార్‌ మింగేసినట్లైంది. నా పిల్లలు ఏట్లో కొట్టుకుపోతున్నట్లు తోచింది. ఊర్లో తను, తన ప్రియుడి మధ్య మాటలు ఇంకా ఎక్కువయ్యాయి. కలుసుకోవడం మొదలుపెట్టారు. నేను పెద్దలతో మాట్లాడి జూన్‌-2017లో మళ్లీ నా ఇంటికి తీసుకొచ్చాను. ఆగస్టు - 2017న మళ్లీ తను వాళ్లనాన్నకు బాగా లేదని ఊరెళ్లింది. ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. ఫోన్‌ చేసినా వస్తానులే అంటూ దాటవేసింది. నేనే ఊరెళ్లాను. పిల్లలను చూసే సరికి నా బాధంతా మరిచిపోయాను. తనలో మాత్రం ఏ మార్పు లేదు. నన్ను పట్టించుకోలేదు. ఊర్లోనే తెలిసిన వాళ్లింటికి వెళ్లి రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి వస్తున్నాను. దారిలో ఒకరు నా మీద పెద్ద బండరాయి వేయబోయారు. తప్పించుకున్నాను. గట్టిగా అరిచాను. చుట్టుపక్కల వారు లేచి అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించాం. అతను ఎవరో కాదు... జయ ప్రియుడు రవికిరణ్‌. ఇంటికి వచ్చే సరికి జయ ఇంట్లో లేదు. పారిపోయింది. మరుసటి రోజు పోలీస్‌స్టేషన్లో ప్రత్యక్షమైంది. పెద్దలు పంచాయతీ పెట్టారు. నేను ఎంత చెప్పినా నాతో ఉండటానికి ఆమె ఒప్పుకోలేదు. వాళ్లనాన్న తనకే సపోర్ట్‌ చేశాడు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పినా వినలేదు. తన ప్రియుడు మోసగాడని రుజువులు చూపినా పట్టించుకోలేదు. నా బతుకు ఎడారైపోయింది. ఎవరూ లేని ఒంటరినైపోయాను. చుట్టుపక్కల వారి మాటలు గాజుముక్కల్లా గుండెలో దిగుతుంటే... బాధను దిగమింగుతున్నాను. జయ ఒక్కమాట చెప్పు... నేనేం పాపం చేశాను? నా జీవితం నాశనం చేసే హక్కు... నీకు, నీ కుటుంబానికి ఎవరిచ్చారు? ఇప్పుడు నా పిల్లలను ఈ సమాజం ఎలా చూస్తుంది? ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎప్పటికైనా నిజమైన ప్రేమ ఎవరిదో తెలుసుకుంటావనే, మారతావనే నమ్మకంతో ఎదురుచూస్తున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని