మన స్నేహాన్ని సిగరెట్లా కాల్చకు

వాడికి పెరుగన్నమంటే ఇష్టం... అందుకే రోజూ నా క్యారియర్‌లో ఆ బాక్స్‌ వాడికే ఇచ్చేవాణ్ని. నాకు మందారం పువ్వులంటే ఇష్టం... రోజూ ఇంటికెళ్లే దారిలో వాడు మా వీధిలో మొదటి ఇల్లు గోడ ఎక్కి మరీ కోసేవాడు. ఇద్దరం ఎంత స్నేహితులమంటే..

Published : 21 Apr 2018 01:44 IST

మన స్నేహాన్ని సిగరెట్లా కాల్చకు

వాడికి పెరుగన్నమంటే ఇష్టం... అందుకే రోజూ నా క్యారియర్‌లో ఆ బాక్స్‌ వాడికే ఇచ్చేవాణ్ని. నాకు మందారం పువ్వులంటే ఇష్టం... రోజూ ఇంటికెళ్లే దారిలో వాడు మా వీధిలో మొదటి ఇల్లు గోడ ఎక్కి మరీ కోసేవాడు. ఇద్దరం ఎంత స్నేహితులమంటే... వాళ్లింట్లో వాడిని ఏ విషయానికి కొట్టకుండా నేను కాచుకుంటా. మా ఇంట్లో నన్ను తిట్టకుండా వాడు చూసుకుంటాడు. మేం నాలుగో తరగతి నుంచి మంచి ఫ్రెండ్స్‌. ఇంటర్‌కొచ్చినా మా స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంజినీరింగ్‌లో చేరాం. పట్టుపట్టి మరీ ఇద్దరం ఒకే కాలేజీలో సీటు తీసుకున్నాం. ఒకే బ్రాంచి ఎంపిక చేసుకున్నాం. నన్ను వాడు ‘రాక్షసి’ అంటాడు. నేను వాడిని మిస్టర్‌ సి అంటాను. ఇక్కడ సి... అంటే కన్ప్యూజన్‌ అని. ఎంతో హాయిగా ఉండే మా స్నేహంలో వాడి మిత్రులు నిప్పులు పోశారు. నేనేదో వాడిని ఇష్టపడుతున్నానని... ప్రేమిస్తున్నానని వాడికి లేనిపోనివి చెప్పారు. వాడు నా చనువును అపార్థం చేసుకున్నాడు. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో నాకు ప్రపోజ్‌ చేశాడు. నా మెదడు ఆ రోజే ఆగిపోయిందనిపించింది. ఎందుకు వీడిలా చేశాడని బాధపడ్డాను. లేదురా నాకు ఆ ఫీలింగ్‌ లేదని కూర్చొబెట్టి చెప్పాను. వినలేదు. నేను లవ్‌ రిజెక్ట్‌ చేశానని ఫ్రెండ్స్‌ ఇంకా వాడికి నా మీద నూరిపోశారు. నాపై కోపంతో గడ్డం గీసుకోవడం మానేశాడు. రోజూ ఎంతో హుషారుగా వచ్చేవాడు. ‘అర్జున్‌రెడ్డి’లా మారాడు. సిగరెట్లు కాలుస్తున్నాడు. మందు తాగుతున్నాడు. ఒకరోజు నేరుగా నా దగ్గరకొచ్చి ‘నన్ను ఎందుకు లవ్‌ చేయవ’ని ప్రశ్నించాడు. ‘‘ఒరేయ్‌ చిన్నప్పటి నుంచి నిన్ను మంచి స్నేహితుడిగానే చూశానురా... నాకు ఆ ఫీలింగ్‌ కలగడం లేదురా... దయచేసి అర్థం చేసుకో’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఇప్పుడు నా మీద లేనిపోని మాటలు కాలేజీలో ప్రచారం చేస్తున్నాడు. నా క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల్లో నా గురించి చెడుగా పోస్టులు పెడుతున్నాడు. దీనికి వాడి ఫ్రెండ్స్‌ సహకరిస్తున్నారు. నా జీవితం నరకంగా కన్పిస్తోంది. మెసేజ్‌లు పెట్టినా స్పందించడం లేదు. ఫోన్‌చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదు. కాలేజీలో మాట్లాడదామంటే తప్పించుకొని వెళ్లిపోతున్నాడు. రే మిస్టర్‌ సి... నన్ను అర్థం చేసుకోవడంలో నువ్వు నిజంగానే కన్ఫ్యూజ్‌ అయ్యావు. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమికుడిగా ఊహించుకోలేదురా... నా ప్రవర్తన నీకు అలా అనిపించి ఉంటే నన్ను క్షమించు. నాతో మాట్లాడు. మనం మంచి స్నేహితుల్లా ఉందాం. నువ్వు అలా అయిపోతుంటే నాకు బాధగా ఉంది. నా మనసుతో నీకు పనిలేదా? నా ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఉండమంటున్నావు. మనం మంచి స్నేహితులమనీ... మన అమ్మానాన్నలు అనుకుంటారు. వారికి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావని చెబితే ఏమవుతుంది? వాళ్లు మనమీద పెంచుకున్న నమ్మకం పోతుంది. ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు. నాలుక అబద్దం చెప్పినా... కళ్లు చెప్పవంటారు. మరి నా కళ్లు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నట్లు కనిపించలేదే? వాటిని నువ్వు సరిగ్గా చూడలేదు. ఎంతో మంచి మన స్నేహాన్ని సిగరెట్లలా కాల్చేయకు. ఇది చదివాకైనా నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను.

- నీ రాక్షసి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని