నా గుండె ఏడుపు వినిపిస్తోందా?

నా పేరు శ్రావ్‌. తను నాగ్‌. 2010 నుంచి మేం మంచి స్నేహితులం. నేను ప్రాజెక్టు వర్క్‌ కోసం హైదరాబాద్‌లో ఉంటే, తను బెంగళూరులో ఉన్నాడు....

Published : 28 Apr 2018 01:40 IST

నా గుండె ఏడుపు  వినిపిస్తోందా?

నా పేరు శ్రావ్‌. తను నాగ్‌. 2010 నుంచి మేం మంచి స్నేహితులం. నేను ప్రాజెక్టు వర్క్‌ కోసం హైదరాబాద్‌లో ఉంటే, తను బెంగళూరులో ఉన్నాడు. తరచూ వచ్చేవాడు. ఇద్దరం కలుసుకునే వాళ్లం. సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లే వాళ్లం. నా వర్క్‌ పూర్తై నేను మా ఊరెళ్లాను. నాగ్‌కు నాకు మధ్య కాస్త దూరం పెరిగింది. అనుకోకుండా అనేక సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. డిప్రెషన్‌లోకి వెళ్లాను. మళ్లీ నాగ్‌ నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తను నాకు ధైర్యం చెప్పేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత నాకు ప్రపోజ్‌ చేశాడు. నేనూ ఒప్పుకొన్నాను. ఇది జరిగిన కొన్ని రోజులకే నాగ్‌ వాళ్ల నాన్న చనిపోయాడు. నేను తనకు తోడుగా నిలిచాను. వీలు ఉన్నప్పుడల్లా మా ఊరికి వచ్చేవాడు. లోకాన్ని మరిచిపోయాం. మా ఇద్దరి కోసమే ప్రకృతి పుట్టిందా? అనిపించేది. ‘‘అనుకున్న వెంటనే తను నా ముందు ప్రత్యక్షమయ్యే టెక్నాలజీ వస్తే ఎంత హాయిగా ఉంటుంది...’’ అనుకునేదాన్ని ప్రేమలో ఉంటే ఇంతనేమో! మా ఇంట్లో విషయం తెలిసిపోయింది. వాళ్లు  వ్యతిరేకించలేదు. వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ‘నేను ఇంట్లో వాళ్లను బాధ పెట్టలేను... నన్ను మరచిపో’ అన్నాడు. చివరిసారిగా కలుసుకొని మాట్లాడదాం అనుకున్నాం. ఆలంపూర్‌ వెళ్లాం. అప్పుడు మేడారం జాతర జరుగుతోంది. తిరుగు ప్రయాణంలో బస్సులు దొరకలేదు. ఆటోలో బయలుదేరాం. నేను వెనుక సీట్లో, తను డ్రైవర్‌ పక్కన కూర్చోవాల్సి వచ్చింది. మన ఆలోచనలకు అనుగుణంగానే కాలం ఉంటుందేమో. ఆటో గుంతల్లో పడుతూ లేస్తూ వస్తుంటే... నా జీవితం అలాగే ఉందనిపించింది.  దగ్గరలోని బస్టాండుకు చేరుకున్నాం. తను బస్సు ఎక్కుతున్నప్పుడు చివరిసారిగా ‘ఐ లవ్‌ యూ’ చెప్పాను. తనూ నన్ను వదలేక వదలేక వెళ్తున్నాడనిపించింది. మళ్లీ ఒక సారి మా ఇంట్లో మాట్లాడతాను అన్నాడు. తను లేకుండా నేను బతకలేనని నా మనసు చెబుతోంది. బస్సు కదిలింది. కళ్లకు తన రూపం దూరమవుతుంటే.. గుండెకు బాధ దగ్గరైంది. తను నా కళ్లకు కన్పించకుండా పోయే సరికి ఆ బాధ కళ్లలో నీళ్లలా ఉబికింది. ఎక్కడో ఆశ... తను నా కోసం మళ్లీ వస్తాడని... ఆశ నిరాశైంది. మళ్లీ తన నుంచి కాల్‌ లేదు. అప్పటి నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాను. తన నుంచి ఎలాంటి సమాధానం లేదు. మా ఇంట్లో వాళ్లకి విషయం మొత్తం తెలుసు. అమ్మానాన్న ముందు ఎలా ప్రేమిస్తున్నారో... ఇప్పుడు అలానే నన్ను ప్రేమిస్తున్నారు. నేను మాత్రం మామూలుగా ఉండలేకపోతున్నాను. శూన్యమే నా ప్రపంచమైంది. మెదడులో అన్నీ ప్రశ్నలే పుడుతున్నాయి. పరిష్కారాలు దొరకడం లేదు. ‘ఎలా మరిచిపోగలడు? మాట్లాడిన మాటలు... చేసిన బాసలు అన్నీ అబద్ధాలేనా? నీ మనసులో పుట్టే ప్రతి ఆలోచన నాకు తెలుస్తుంది అన్నాడే.. మరి ఇప్పుడు నా మదిలో పుట్టిన బాధ సంద్రమై నన్ను ముంచేస్తుంటే తనకు తెలియడం లేదా? ప్రతి గుండె చప్పుడులో నీ పేరే వినిపిస్తోంది. వచ్చి వింటావు కదూ! వస్తావు కదూ? నీ కోసం పిచ్చిదానిలా ఎదురుచూస్తున్నాను.’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు