‘డాల్‌’ ఎక్కడున్నావ్‌?

‘డిగ్రీ ఫైనలియర్‌... ఈ ఏడాది పూర్తైతే... హమ్మయ్య కాలేజీకి రావాల్సిన పనిలేదురా’ అనుకుంటున్నాం ఫ్రెండ్స్‌ అంతా. ఇంతలోనే ఓ మధురమైన స్వరం మమ్మల్నే ఏదో ప్రశ్నించింది. తల తిప్పి చూశాను. కళ్లు తిప్పుకోలేని రూపం.....

Published : 26 May 2018 01:42 IST

‘డాల్‌’ ఎక్కడున్నావ్‌?

‘డిగ్రీ ఫైనలియర్‌... ఈ ఏడాది పూర్తైతే... హమ్మయ్య కాలేజీకి రావాల్సిన పనిలేదురా’ అనుకుంటున్నాం ఫ్రెండ్స్‌ అంతా. ఇంతలోనే ఓ మధురమైన స్వరం మమ్మల్నే ఏదో ప్రశ్నించింది. తల తిప్పి చూశాను. కళ్లు తిప్పుకోలేని రూపం. ఆ అందంలో పడిపోయి... మాటలు వినపడటం లేదు. మా ఫ్రెండ్స్‌ ఏదో ఆ అమ్మాయికి చెబుతున్నారు. తనూ అలా వెళుతోంది. నేను అప్రయత్నంగా తన వెంట వెళ్లిపోయాను. డిగ్రీ ఫస్టియర్‌ తను. పేరు రోహిణి. ఇక ఆ రోజు నుంచి నేను వాళ్ల క్లాస్‌ దగ్గరే ఎక్కువగా ఉండటం మొదలైంది. తను అందరితో బాగా మాట్లాడుతుంది. చురుకైనదని అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే నేను తనతో సరిగా మాట్లాడలేక పోయాను. హలో..అంటే.. హలో అంతే. అప్పుడప్పుడు నా కళ్లు తనని చూస్తున్నాయని తను కనిపెట్టేది. ఒక రోజు తను ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళుతోందని నేనూ నా ఫ్రెండ్స్‌తో వెళ్లాను. సినిమా మధ్యలో తను లేచి వెళ్లిపోతోంది. ఎందుకోనని నేనూ బయటికి వచ్చాను. తను నేరుగా రోడ్డుపైకి వచ్చి ఆటో కోసం చూస్తోంది. నేను బండి తీసుకొని తన ముందు ఆగాను. ఏంటి? అన్నాను. ‘మా తాతయ్యకు బాగోలేదు..అర్జెంటుగా ఇంటికి వెళ్లాలి.’ అంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను వదిలిపెడతాను అన్నాను. సరే అని బండెక్కింది. నాకు హిమాలయాలు ఎక్కినంత ఆనందం. వాళ్లింటికి వెళ్లాం. వాళ్ల తాతయ్యకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. వెంటనే నేను ఆటోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. డాక్టర్లు చూసి ఫర్వాలేదని ఏదో చికిత్స చేశారు. బాగా రాత్రై పోయింది. పరిస్థితి కుదుట పడ్డాక నేను బయలుదేరాను. తన నంబర్‌ తీసుకోవాలనిపించింది. కానీ అడిగితే ఏమనుకుంటుందోనని అడగలేదు. బయటికి వచ్చేటప్పుడు తనే నా నంబరు అడిగింది. ఇచ్చాను. ఇంటికొచ్చే సరికే ఎన్ని సార్లు ఫోన్‌ చెక్‌ చేశానో తెలియదు. ఇంటికొచ్చాక ఫోన్‌ పట్టుకొనే కూర్చున్నా. గంట తర్వాత కాల్‌ వచ్చింది. ‘హీరో’ ఇల్లు చేరావా? అంది... నేను వినపడనట్టు మళ్లీ హలో అన్నాను. ‘హీరో ఇల్లు చేరావా?’ తను అలా అంటుంటే నాకు ఏదో అవార్డు ఇస్తున్నంత సంతోషంగా ఉంది. అలా మొదలైన మా మాటలు... నిమిషాలు, గంటలు, రోజులు దాటిపోయాయి. వాట్స్‌ప్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. మా సెల్ఫీలు పంచుకోవడానికి డేటా అయిపోయేది. తను నన్ను హీరో అనేది. నేను తనని ‘డాల్‌’ అనేవాడిని. పరీక్షలు దగ్గరపడ్డాయి. ఇంతలో వాళ్ల తాతయ్య చనిపోయాడని తెలిసింది. తను పరీక్షలు కూడా రాయలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లింది. నేను రోజు వెళ్లి మాట్లాడే వాడిని... అప్పుడే తన డీటైల్స్‌ కొన్ని నాకు తెలిశాయి. వాళ్లది హైదరాబాద్‌ అని, తాతయ్య వాళ్లింటికి వచ్చి చదువుకొంటోందని. అలా కొన్ని రోజులు గడవకముందే వాళ్ల నాన్నమ్మ కూడా చనిపోయింది. దీంతో తను పూర్తిగా దుఃఖంలో మునిగిపోయింది. ఎంత ఓదార్చినా వినలేదు. వారం రోజులు భారంగా గడిచాయి. నేను పరీక్షలు రాయడంలో పడిపోయి రెండు రోజులు వాళ్లింటికి వెళ్లలేదు. అంతే మూడోరోజు వెళితే తను లేదు. ఇల్లు తాళం వేసింది. ఖాళీ చేసి వెళ్లిపోయారని పక్కింటోళ్లు చెప్పారు. ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌. ఫ్రెండ్స్‌ని అడిగితే హైదరాబాద్‌ వెళ్లి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎక్కడో తెలియదు. వాళ్ల పక్కింటి వాళ్లను అడిగినా తెలియదన్నారు. ఇక అప్పటి నుంచి తన కాల్‌ కోసం చూస్తున్నా... నేను తనని ప్రేమిస్తున్నానని తనకు తెలుసుననే అనుకుంటున్నా... నాకు తన కళ్లల్లో, మాటల్లో ప్రేమ కనిపించేది. డాల్‌ ఎక్కడున్నా ప్లీజ్‌ కాల్‌ చెయ్‌... నా నంబర్‌ పాతదే. నువ్వు ఎప్పటికైనా కాల్‌ చేస్తావని ఎదురుచూస్తున్నా.

- ఇట్లు నీ హీరో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని