ఎదురుచూపులు ఎంత తియ్యనో!

మాది తూ.గో. జిల్లా. నాకు పాలిటెక్నిక్‌ కళాశాలలో సీటొచ్చింది. అక్కడ తొలిసారి తరగతిలోకి వెళ్లాలంటే కొబ్బరికాయ కొట్టి వెళ్లాలి. అలా కొట్టడం మొదలైంది. ఒక వైపు అమ్మాయిలు, మరోవైపు అబ్బాయిలు వరుసగా కొబ్బరికాయ కొడుతున్నారు. ఆ క్యూలో తను నాకు కన్పించింది...

Published : 09 Jun 2018 01:46 IST

ఎదురుచూపులు ఎంత తియ్యనో!

మాది తూ.గో. జిల్లా. నాకు పాలిటెక్నిక్‌ కళాశాలలో సీటొచ్చింది. అక్కడ తొలిసారి తరగతిలోకి వెళ్లాలంటే కొబ్బరికాయ కొట్టి వెళ్లాలి. అలా కొట్టడం మొదలైంది. ఒక వైపు అమ్మాయిలు, మరోవైపు అబ్బాయిలు వరుసగా కొబ్బరికాయ కొడుతున్నారు. ఆ క్యూలో తను నాకు కన్పించింది. లోకంలోని అన్ని పూలు ఒకే తీగకు పూస్తే ఎంత అందంగా ఉంటుందో అలా ఉంది తను. చూపులు కలపడానికి చాలా ప్రయత్నించాను. కుదరడం లేదు. తను తల ఎత్తడం లేదు. నేను తననే చూస్తూ ముందుకు నడుస్తున్నాను. నా వంతు వచ్చింది తనవైపే చూస్తూ టెంకాయ కొట్టాను. ఆ కొట్టడంలో నా వేలికి దెబ్బతగిలింది. రక్తం వచ్చింది. నోట్లో పెట్టుకొని తననే చూస్తూ నడిచాను. వేర్వేరు తరగతుల్లో కూర్చోబెట్టారు. నిరాశ పడ్డాను. రోజూ తనని చూడటానికి ఆ తరగతి దగ్గరికి వెళ్లి వచ్చేవాడిని.. తను మా క్లాస్‌కొస్తే బాగుణ్ను అనుకునేవాణ్ని. దేవుడు ఆలకించాడు. సెక్షన్స్‌ షఫ్లింగ్‌లో తను మా క్లాస్‌కే వచ్చింది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. తనతో మాట్లాడటానికి ప్రయత్నించే వాడిని. కొన్ని రోజులకు క్లోజ్‌ అయ్యాం. నన్ను చూడగానే నవ్వేది. ఆ రోజు నా పుట్టిన రోజు... నన్ను విష్‌ చేసింది. ఇదే మంచి అవకాశం అనుకొని ప్రపోజ్‌ చేశాను. తను ఏం చెప్పకుండా వెళ్లిపోయింది. నాతో మాట్లాడటం ఆపేసింది. ఇలాంటి వాటిని వాళ్లింట్లో ఏ మాత్రం సహించరని .. తర్వాత తన ఫ్రెండ్స్‌తో చెప్పింది. అయినా నేను తనని చూడటం మానలేదు. అలా మరో మూడు నెలలు గడిచాయి. గడ్డం పెంచేశాను. దేనిమీద ఆసక్తి లేదు. చురుకుదనం లేకుండా పోయింది. నా బాధ చూడలేక తనే నా వద్దకు వచ్చింది. ‘ఒరే నువ్వంటే నాకిష్టమేరా మా ఇంట్లో ఒప్పుకోరు... నా కోసం అనవసరంగా నీ జీవితం పాడు చేసుకోకు’ అంది. నా ఆనందం ఎలాంటి రాకెట్‌ లేకుండానే చంద్రమండలానికి చేరింది. మళ్లీ మామూలు మనిషయ్యాను. తనతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఒక సారి సినిమాకు వెళ్లాం. సినిమా అయ్యాక తనని బస్టాండులో నా బండి మీద వదలాటానికి వెళ్లాను. అది వాళ్ల బావకు తెలిసింది. అతను ఇంట్లో చెప్పి.. గొడవ చేశాడు. తనని అదే రోజు హైదరాబాద్‌ పంపించారు. మరుసటి రోజు తను కన్పించలేదు. ఫ్రెండ్స్‌ ద్వారా విషయం తెలిసింది. ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌. మా కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు తనని బాగా కొట్టారని తెలిసింది. చాలా బాధపడ్డాను. ఆరు నెలలు దుఃఖంలోనే గడిపాను. ఒకరోజు కాల్‌ వచ్చింది. తనే...! హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఉంటున్నట్లు చెప్పింది. తను చెప్పిన గుర్తుల ప్రకారం... నేను బయలుదేరి అక్కడికి వెళ్లాను. తిరిగి..తిరిగి ఎలాగో తనని కలిశాను. నన్ను చూడగానే హత్తుకొంది. బాగా ఏడ్చింది. నేనూ అంతే. ప్రేమతో పాటు.. కన్నీళ్లలో తడిసిపోయాం. ఇక అప్పుడప్పుడూ కలిసేవాళ్లం. ఇదీ ఇంట్లో వాళ్లకి తెలిసి బాగా గొడవ చేశారు. మా ఇంటికి వచ్చి వార్నింగ్‌ ఇచ్చారు. తనని మళ్లీ ఎక్కడికో పంపారు. తన కాల్‌ కోసం ఎదురుచూశాను. నెల రోజుల తర్వాత మళ్లీ కాల్‌ చేసింది. తను బంజారాహిల్స్‌లో ఉంటున్నట్లు... చెప్పింది. నేను వెళ్లి కలుసుకున్నాను. ‘ఒరేయ్‌ నేను నీ కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తా... నువ్వు మంచిగా చదువుకొని, ఉద్యోగం సంపాదించు మనిద్దరం పెళ్లిచేసుకుందాం’ అంది. నా గుండెకు ఎంతో ధైర్యం వచ్చింది. ఇక నేను ఒక్క నిమిషం కూడా వృథా చేయదలుచుకోలేదు. చదువుపై శ్రద్ధ పెట్టాను. ఇప్పుడు ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తున్నా. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి తనని పెళ్లి చేసుకుంటా. మేం ఎక్కువగా కలుసుకోకపోయినా... ఎప్పుడూ తను నా పక్కనే ఉన్నట్లు ఉంటుంది. ప్రతి రోజూ ప్రతి పనిలో తననే చూసుకుంటున్నా. ఎదురుచూపులు ఎంత హాయిగా ఉంటాయో ప్రతిరోజూ నాకు తెలుస్తోంది.

- రామ్‌జాను

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని