నాలా... మిగలొద్దు

ఇద్దరిదీ ఒకే ఊరు. కళాశాలకు బస్సులో వెళ్లే వాళ్లం. సాయంత్రం ఊరికి వచ్చేవాళ్లం. బస్సు దిగాక మా ఊరికి ఒకటిన్నర కిలోమీటరు నడవాలి. ఒక రోజు నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్లి వచ్చే సరికి రాత్రైంది. బస్సులో సీట్లు లేవు. అది మిస్సైతే మరొక బస్సు లేదు....

Published : 16 Jun 2018 02:01 IST

నాలా... మిగలొద్దు

ద్దరిదీ ఒకే ఊరు. కళాశాలకు బస్సులో వెళ్లే వాళ్లం. సాయంత్రం ఊరికి వచ్చేవాళ్లం. బస్సు దిగాక మా ఊరికి ఒకటిన్నర కిలోమీటరు నడవాలి. ఒక రోజు నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్లి వచ్చే సరికి రాత్రైంది. బస్సులో సీట్లు లేవు. అది మిస్సైతే మరొక బస్సు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను, కళ నిల్చున్నాం. మా ఊరివాళ్లు ఎవరైనా ఉన్నారేమోనని చూశాం. ఎవరూ కన్పించలేదు. కొద్దిసేపటికి సీట్లోంచి లేచి కూర్చొండని నాకు, కళకు పిలుపు. ఎవరా? అని చూస్తుండగానే అర్థమైంది. శీను. పక్కన ఆయనతో ఏదో మాట్లాడి ఇద్దరు కలిసి లేచారు. నేను కళ్లతోనే థ్యాంక్స్‌ అన్నట్లు చూశాను. తనకు అర్థమైందనుకుంటా! పర్వాలేదన్నట్లు కళ్లు సైగ చేశాడు. అరగంటకు మా ఊరి క్రాస్‌ వద్ద బస్సు ఆగింది. ముగ్గురం దిగాం. ‘ఏం భయం లేదు... నాతో రండి’ అని ముందుకు కదిలాడు. శీను వెనకాలే నడిచాం. అరగంటకు ఊరు చేరాం. ఆ రోజు పరిచయం... తర్వాత నెల రోజులకే శీనుతో చనువు పెంచింది. ఒకరోజు మా ఊరికి నడిచి వెళ్లే దారిలోనే నాకు ప్రపోజ్‌ చేశాడు. నన్ను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలా ఆరునెలలు రోజూ ప్రపోజ్‌ చేశాడు. తనమీద నాకున్న మంచి అభిప్రాయం... అతన్ని అడ్డుకోనివ్వలేదు. పైగా నా మనసులోనూ ప్రేమ ఉన్నట్లే అనిపించింది. అయితే మా ఇద్దరివీ వేర్వేరు కులాలు. మా పెద్దలే కాదు... ఊర్లో ఎవ్వరూ మేం కలిసి జీవించడానికి ఒప్పుకోరు. ఈ విషయం నన్ను వెనక్కి నెట్టేది. 2012, ఫిబ్రవరి 14న ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పాడు. ఏమైనా సరే అనుకొని తన ప్రేమని ఓకే చేశాను. చెరువుగట్టు మా కబుర్లతో నిండింది.  రోజూ ప్రయాణించే బస్సు మా చూపుల అలంకరణతో పుష్పక విమానంలా తోచేది. డిగ్రీ ఫైనలియర్లో మేం చెరువు గట్టున మాట్లాడుకుంటుంటే మా బావ చూశాడు. ఇక ఇంట్లో చెప్పేస్తాడేమోనని భయపడ్డాం. ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాం. ఆ రోజు రాత్రే తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. చంద్రగిరిలో ఒక ఇల్లు తీసుకొని కొత్త కాపురం పెట్టాం. నేను ఓ కళాశాలలో లైబ్రరీలో పనికి కుదిరాను. తను ఏ పని చేసేవాడు కాదు. నేను తెచ్చిన డబ్బు, బంగారం రెండు నెలలకే అయిపోయాయి. కష్టాలు మొదలయ్యాయి. కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని చెప్పిన శీను.. కళ్లలో నీళ్లు తుడవడానికీ ఇష్టపడటం లేదు. తాగుడు అలవాటు చేసుకున్నాడు. నేను నెల తప్పాను. వద్దని అబార్షన్‌ చేయించాడు. నా ఆరోగ్యం బాగాలేక నేను లైబ్రరీకి వెళ్లలేదు. ఆ నెల జీతమూ రాలేదు. నువ్వు ఏదైనా పనిచేస్తే బాగుంటుందని చెప్పాను. నీ వల్లే నాకు ఈ గతి పట్టిందని విసుక్కున్నాడు. రోజూ తాగడం, కొట్టడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. నువ్వు లేకపోతే బతకలేను అన్నవాడు... నువ్వుంటే బతుకే లేదు... అన్నట్లు మారిపోయాడు. లైబ్రరీలోకి వేరేవాళ్లని తీసుకోవడంతో నాకు ఆసరా పోయింది. ఎన్ని రోజులని అప్పులు? ఆకలితో అలాగే పడుకునేదాన్ని... తను మాత్రం ఎక్కడో తాగి వచ్చేవాడు. ఆ రోజు రాత్రి నువ్వు నన్ను శనిలా పట్టుకున్నావ్‌? వదిలేసి పోతే నేనైనా ఇంటికెళ్లి బాగా బతుకుతాను అన్నాడు. నా మనసు విరిగిపోయింది. తెల్లారేసరికి ఇంట్లో ఉండకూడదని అనుకున్నాను. హైదరాబాద్‌ వచ్చేశాను. ఇక్కడ ఓ ఫ్రెండ్‌ సాయంతో పనిచేసుకుంటూ బతుకుతున్నాను. ఆరు నెలలు గడిచిపోయాయి. నా కోసం వెదుకుతాడనుకున్నాను. ఆ ఆశ లేకుండా పోయింది. ప్రేమంటేనే విరక్తి పుట్టింది. అమ్మాయిలందరికీ నా జీవితం ఒక పాఠం కావాలని చెబుతున్నా. అంతత్వరగా ఎవరినీ నమ్మొద్దు. ఇంట్లో వాళ్లందరనీ వదిలేసి వచ్చి... నాలా ఒంటరిగా మిగలొద్దు.

- మీ తోటి అమ్మాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని