నీ స్నేహమే ముఖ్యం

నేను, అఖిల్‌ మంచి స్నేహితులం. హైస్కూల్‌ల్లో ఇద్దరిదీ ఒకే క్లాస్‌, ఒకే బెంచి. ఇద్దరం ఎంత బాగా కలిసి ఉండేవాళ్లమంటే... వాడి షర్ట్‌లు నేను, నా డ్రెస్సులు వాడు వేసుకునేంత. సినిమా అయినా, షికారైనా, గొడవైనా... ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఇంటర్లో వాళ్లింట్లో...

Published : 07 Jul 2018 01:53 IST

నీ స్నేహమే ముఖ్యం

నేను, అఖిల్‌ మంచి స్నేహితులం. హైస్కూల్‌ల్లో ఇద్దరిదీ ఒకే క్లాస్‌, ఒకే బెంచి. ఇద్దరం ఎంత బాగా కలిసి ఉండేవాళ్లమంటే... వాడి షర్ట్‌లు నేను, నా డ్రెస్సులు వాడు వేసుకునేంత. సినిమా అయినా, షికారైనా, గొడవైనా... ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఇంటర్లో వాళ్లింట్లో వాళ్లు అఖిల్‌ని హైదరాబాద్‌లో చేరుస్తామన్నారు. నన్ను విజయవాడలో చేరుస్తామన్నారు. వాడు ఏడ్చి, ఇంట్లో గొడవ చేసి, విజయవాడలో నా కాలేజీలోనే చేరాడు. నా రూంలో చోటిస్తేనే ఉంటానని గట్టిగా పట్టుపట్టి మరీ వచ్చాడు. మళ్లీ ఇద్దరం ఎంతో సంతోషంగా గడిపాం. ఇంటర్‌ పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో చేరాం. వాళ్లింటికి నేను, మా ఇంటికి వాడు వస్తూపోతుండేవాళ్లం. హాయిగా సాగిపోతున్న మా స్నేహంలోకి అఖిల్‌ చెల్లి దీప వచ్చింది. చిన్నప్పటి నుంచి తనని చూస్తున్నా ఏ ఫీలింగ్‌ లేదు. ఇప్పుడు ఏదో అట్రాక్షన్‌ తనలో కన్పిస్తోంది. నేను వాళ్లింటికి వెళ్లినప్పుడు నా చుట్టే తిరగడం... నన్నే చూస్తుండటం గమనించాను. ఒకసారి పిలిచి చెప్పాను. ‘ఇలా చేయకు... నాకు నచ్చదు. అఖిల్‌కు తెలిస్తే... బాగోద’ని వార్నింగ్‌లాంటిదే ఇచ్చాను. తను ఏడుస్తూ... నాకు ‘ఐ లవ్‌యూ’ చెప్పింది. నేను బాగా సీరియస్‌ అయ్యాను. నీ మీద నాకలాంటి ఉద్దేశం లేదని తేల్చేశాను. తను అలా ఏడ్చుకుంటూనే వెళ్లిపోయింది. రోజూ తన బాధను నాకు వాట్సప్‌ చేసేది. నేను స్పందించేవాడిని కాదు. ఒక రోజు వాడి కోసం ఇంటికి వెళితే... వాడు అప్పుడే బయటికి వెళ్లాడు. ఇంట్లో తనొక్కటే ఉంది. నేను వెనక్కి వెళ్తుంటే ఆగమని బతిమాలింది. సరే అని ఉన్నాను. ‘నీ ఊహ రాకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు కాదంటే ఇప్పుడే చచ్చిపోతాను’ అంది. ‘ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు... అఖిల్‌కు తెలిస్తే మా స్నేహం దెబ్బతింటుంద’ని చెప్పి కదిలాను. తను అడ్డుకుంది. అక్కడే ఉన్న కత్తి తీసుకొని చేయి కోసుకుంది. నేను గట్టిగా కత్తి లాక్కున్నాను. రక్తం ధారలా మారింది. నేను నా ఖర్చీఫ్‌ తీసి చేతికి చుట్టాను. ఇంతలో అఖిల్‌ వచ్చాడు. ఈ సంఘటన చూసి వాడు అపార్థం చేసుకున్నాడు. నేను వాళ్ల చెల్లిని ఏదో చేశానని నాపై గట్టిగా అరిచాడు. ఎంత చెప్పినా వినలేదు. తనని కొట్టబోయాడు. నేను అడ్డుకున్నాను. నన్ను ఇంట్లోంచి పంపించేశాడు. నాకు చాలా బాధగా అన్పించింది. ఇంతకాలం స్నేహంలో వీడు నన్ను ఇంతేనా అర్థం చేసుకుందని ఆలోచిస్తే మనసు ముక్కలైపోతోంది. దీప నన్ను ప్రేమిస్తున్న విషయం అఖిల్‌కు చెప్పింది. వాడు ఒప్పుకోలేదు.. కదా! నన్ను మాట మాత్రమైనా అడగకుండా నామీద పగ పెంచుకున్నాడు. వేరే వాళ్లతో కాలేజీ నుంచి వస్తుంటే నన్ను కొట్టించాడు. నేను ఆసుపత్రిలో ఉంటే.. దీప అక్కడికి వచ్చింది. దాంతో వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఆసుపత్రిలోనే తనని కొట్టాడు. నేనది భరించలేకపోయాను. వాడిపై సీరియస్‌ అయ్యాను. ఇక అప్పటి నుంచి మా మధ్య దూరం బాగా పెరిగింది. ఒకసారి దీప మా ఇంటికి వచ్చి నువ్వు లేకుండా బతకలేనని చెప్పింది. నాకు వాడి స్నేహం లేకుండా.... నీ ప్రేమ అవసరం లేదని చెప్పాను. తను ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది. ఇవన్నీ జరిగి 6 నెలలు అవుతోంది. ఇప్పటివరకూ మా మధ్య ఎలాంటి మాటలు లేవు. కాల్స్‌ లేవు. వాడితో గడిపిన క్షణాలు, సరదాగా తిరిగిన సందర్భాలు గుర్చొస్తే గుండె కన్నీరవుతోంది.

‘రే అఖిల్‌ నాకు మీ చెల్లి ప్రేమకంటే నీ స్నేహమే ముఖ్యం.. అది నువ్వు అర్థం చేసుకో. ముందు నేను చెప్పేది విను. మీ చెల్లి మనసు తెలుసుకో. తర్వాత నిర్ణయం తీసుకో. అంతేగానీ.. లేనిపోనివి ఊహించి, మిగతా వాళ్లు చెప్పేది విని నాపై పగ పెంచుకోకురా.’

నీ కార్తీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని