మాట మార్చి మనసును మాడ్చి

‘ప్రేమిస్తే.. కట్టుబడాలి. కట్టుబడితే... ప్రాణం పోయేంత వరకూ పట్టుకున్న చేయి వదలకూడదు.’ ఇది నా సిద్ధాంతం. నా ఫ్రెండ్స్‌కీ ఇదే చెప్పేవాడిని. అలాంటి నాకు కోలుకోలేని దెబ్బ తగిలింది.నా పేరు పార్థు.....

Published : 14 Jul 2018 01:08 IST

మాట మార్చి మనసును మాడ్చి

‘ప్రేమిస్తే.. కట్టుబడాలి. కట్టుబడితే... ప్రాణం పోయేంత వరకూ పట్టుకున్న చేయి వదలకూడదు.’ ఇది నా సిద్ధాంతం. నా ఫ్రెండ్స్‌కీ ఇదే చెప్పేవాడిని. అలాంటి నాకు కోలుకోలేని దెబ్బ తగిలింది.నా పేరు పార్థు. మాది హైదరాబాద్‌ శివారు ఊరు. దీపావళి పండగ రోజు... మా ఎదురింటిలో తను కన్పించింది. అందరూ దీపాలు వెలిగిస్తుంటే... ఎవరో చిన్నపిల్ల అనుకొని నేను టపాసులు మీదికి వేస్తున్నట్లు భయపెట్టాను. తను ముగ్గు దగ్గర నుంచి లేచి ఇంట్లోకి వెళ్లిపోయింది. సరిగ్గా వాళ్ల కిటికీ దగ్గర తన రూపం కన్పించింది. పెద్దమ్మాయే. ఆశ్చర్యపోయాను. అరే ఏంటి నేను అలా చేశానే అని మనసులో కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అయ్యాను. ఆ రోజంతా మళ్లీ తను కన్పిస్తుందని వెదికాను. కుదరలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటిముందు ముగ్గేస్తూ కన్పించింది. కళ్లు అంత వరకూ చూడని అందం తనది. ప్రకృతిలోనే సౌందర్యమంతా అప్పుడు అక్కడికొచ్చినట్లనిపించింది. నేనే దగ్గరికి వెళ్లి సారీ చెప్పి... పరిచయం చేసుకున్నాను. నా వైపు అదోలా చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది. తర్వాత మా చెల్లిద్వారా వివరాలు తెలుసుకున్నాను. తను విశాలి. వాళ్లది నల్గొండ అయితే బంధువుల ఇంటికి వచ్చింది. ఆ బంధువుల స్నేహితులు మా ఎదురింటి వారు. వాళ్లూవాళ్లూ కుటుంబ స్నేహితులు. అలా తను నా కంటపడింది.

నా రూమ్‌ కిటికీ నుంచి చూస్తే వాళ్లింటి కిటికీ కన్పిస్తుంది. ఎప్పుడు తను అక్కడి వస్తుందా?అని ఎదురుచూస్తుండేవాడిని. మూడురోజుల్లో మా పరిచయం స్నేహమైంది. తర్వాత తను వాళ్లింటికి వెళ్లిపోయింది. అప్పుడప్పుడూ అక్కడికి వచ్చేది. మా చెల్లిని ఫ్రెండ్‌గా చేసుకుంది. అది నా కోసమేనని నాకు అర్థమైంది. అలా మా స్నేహం... ప్రేమగా మారిపోయింది. నేను తనయ్యాను. తను నేనయ్యింది. అప్పటికి నా ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌. మా మేడపైన మేమిద్దరం ఉంటే వాళ్ల బాబాయ్‌ చూశాడు. ఇంట్లో విషయం తెలియడానికి నిమిషాలే పట్టింది. తనని ఊరికి పంపించేశారు. మమ్మల్ని కలవనివ్వలేదు. పెళ్లిచేసుకుంటానని వాళ్లింటికి వెళ్లి చెప్పాను. కులాలు వేరని వినలేదు. నన్ను కొట్టి పంపేశారు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోయాం. ఎక్కడికైనా వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్‌ 11, 2009న మేమిద్దరం తిరుపతి వెళ్లిపోయాం. పెళ్లిచేసుకున్నాం. అక్కడే నాలుగురోజులు ఉండిపోయాం. వాళ్ల బాబాయ్‌ ఎలాగో మా ఫోన్‌ నంబరు కనుక్కొని ఫోన్‌ చేశాడు. ‘మీరిద్దరు ఇంటికొస్తే మేమంతా ఆశీర్వదిస్తామ’ని చెప్పాడు. మేం ఆయన మాటలు నమ్మి ఇంటికి వచ్చాం. డిసెంబర్‌ 26న తనని వాళ్లింటికి తీసుకెళ్లారు. 27న నన్ను పోలీస్‌స్టేషన్‌కి పిలిపించారు. అమ్మానాన్న చాలా కంగారుపడ్డారు. అక్కడ పోలీసులు చాలా రకాలుగా విచారించారు. ఇద్దరిని కలిపి ప్రశ్నించారు. వేర్వేరుగా నిలదీశారు. అయినా ఇద్దరం ఒకేమాట మీద నిలబడ్డాం. మేమిద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకున్నామని తెగేసి చెప్పాం.

బయట అమ్మానాన్నలను వాళ్ల బంధువులు నానా మాటలూ అన్నారు. అక్కడే ఉన్న స్నేహితులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు స్టేషన్‌ నుంచి బయటికి వచ్చాను. నన్ను ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్న ఏడ్చారు. ఏంట్రా ఇదని బాధపడ్డారు. నేను విశాలి లేకుండా బతకలేనని చెప్పేశాను. వాళ్లు ఇక ఏమీ అనలేదు. రెండోరోజు మళ్లీ స్టేషన్‌కు పిలిచారు. మేం ఇద్దరం మాట తప్పలేదు. మూడో రోజు మళ్లీ పిలిపించారు. ఆరోజు విశాలి మాట మార్చింది. వాళ్ల వాళ్లు బెదిరించారో, భయపెట్టారో తెలియదు. ‘ఇతను నాకు వద్ద’ని చెప్పేసింది. మా అమ్మానాన్నతోనే ఉంటానని తేల్చేసింది. నా గుండె పగిలిపోయింది. యాసిడ్‌ పోస్తే కాలిపోతున్న ఫీలింగ్‌... పోలీసులు నన్ను గదిలోకి పిలిచి కొట్టారు. ‘భవిష్యత్తు నాశనం అవుతుందని కేసు పెట్టకుండా వదిలేస్తున్నాం. ఆ పిల్లకోసం మళ్లీ వాళ్లింటికి వెళ్లడం గానీ, చూడటం గానీ చేశావో... ఇక లోపలే ఉంటావ’ని బెదిరించారు. వాళ్లు కొట్టిన దెబ్బలకంటే.. విశాలి మాటలే నన్ను ఎక్కువ గాయపరిచాయి. అలా ఎందుకు చేసిందో నాకు ఇంతవరకూ తెలియడం లేదు.... ఇంకా నా కళ్లు ఆ కిటికీ నుంచి పక్కకు తప్పుకోవడానికి ఇష్టపడం లేదు.

- పార్థు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని