ప్రేమించకపోయినా ఫర్వాలేదు

పవన్‌కు శాంత అంటే ప్రాణం. అయితే శాంతకే ఆ విషయం ఇప్పటికీ తెలియదు. 2003లో మేమంతా.. పదోతరగతి. ఒంగోలు నుంచి మా ఊరు 10 కిలోమీటర్ల...

Published : 11 Aug 2018 02:01 IST

ప్రేమించకపోయినా ఫర్వాలేదు

వన్‌కు శాంత అంటే ప్రాణం. అయితే శాంతకే ఆ విషయం ఇప్పటికీ తెలియదు. 2003లో మేమంతా.. పదోతరగతి. ఒంగోలు నుంచి మా ఊరు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శాంతను వాళ్ల అన్న వచ్చి రోజూ బండిమీద ఇంటికి తీసుకెళ్తాడు. ఆరోజు తను వాళ్ల అన్నయ్య కోసం ఎదురుచూస్తోంది. పవన్‌తో పాటు నేను, మా ఫ్రెండ్సంతా ఆటోలో మా ఊరి దారి పట్టాం. దారంతా ముళ్లకంపలు పెరిగిపోయాయి. మా ఆటోను శాంత వాళ్ల అన్నయ్య క్రాస్‌ చేసే ప్రయత్నం చేశాడు. బండి పక్కగా వెళుతున్నప్పుడు శాంతకు ముళ్లకంపలు గీసుకుపోయాయి. మరుసటి రోజు పవన్‌ స్కూల్‌కి రాకుండా దారిలో మొత్తం ముళ్లకంపలు కొట్టడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలో మనోడికి పాము కరిచి ఆసుపత్రిల్లో పడ్డాడు. తర్వాత అందరం ఇంటర్‌కొచ్చాం. పవన్‌కు శాంత అంటే ఆరాధన. క్లాస్‌లో కూర్చున్నంత సేపు తననే చూసేవాడు. కొంతకాలానికి ఆ అమ్మాయి వాడితో మాట్లాడటం మొదలుపెట్టింది. బస్సులో ఊరికి వెళ్లి వచ్చేవాళ్లం. మాకు సీటు లేక నిలబడినా పట్టించుకునే వాడు కాదు... తన కోసం మాత్రం ముందే బస్టాండుకు వెళ్లి సీటు పెట్టేవాడు. ‘ఇదేం పిచ్చిరా నీకు?’ అంటే... ‘పిచ్చి కాదురా... ప్రేమ’ అనే వాడు. అలా ఇద్దరూ బాగా క్లోజ్‌ అయ్యారు. మేం కూడా శాంత పవన్‌ని లవ్‌ చేస్తోందని ఫిక్స్‌ అయిపోయాం. చదువు మమ్మల్ని డిగ్రీలో చేర్చింది. 2006లో తనకు ఫ్రెండ్‌షిప్‌డే గిఫ్ట్‌ ఇవ్వడం కోసం రోజూ ఒంగోలులో రాత్రి పూట ఆటో నడిపేవాడు. ఉదయాన్నే కాలేజికొచ్చి కునుకుపాట్లు పడేవాడు. అదే సంవత్సరం మా ఊరి జాతర వచ్చింది. ఇది 12ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర. ఊరంతా నవ్వులను తోరణంగా కట్టుకుంది. శాంత పట్టుపరికిణీ కట్టుకొని జాతరకొచ్చింది. ఈ రోజు ఎలాగైనా తన ప్రేమను చెప్పేస్తానని మాతో అన్నాడు పవన్‌. ఒరే ఒప్పుకోకపోయినా... ధైర్యంగా ఉండాలిరా అన్నాను నేను. గాలి వీచనంటే... ప్రాణం నిలుస్తుందా? అని తనకోసం వెళ్లిపోయాడు. శాంతకు ప్రపోజ్‌ చేశాడు. తను అంగీకరించలేదు. ‘నేను నిన్ను మంచి స్నేహితుడిగానే చూశాను. నువ్వు అపార్థం చేసుకున్నావ్‌’ అంది. కళ్లనిండా నీళ్లతో నా దగ్గరికొచ్చాడు. కొండమీద గుడి దగ్గరికి వెళ్లాం. అక్కడ ఎంతగా ఏడ్చాడో నాకు ఒక్కడికే తెలుసు. తను జాతరలో గాజులు కొంటూ నవ్వుతోంది. కొండమీద ఉన్న మాకు శాంత కన్పిస్తోంది. ‘తను ఎప్పుడూ సంతోషంగా ఉండాల్రా’ అన్నాడు. ఇంతలో వేగంగా కొండ కిందికి పరుగు మొదలుపెట్టాడు.  ఏం జరుగుతోందో నాకు తెలియలేదు. నేను వాడి వెంటే పరిగెత్తాను. కొండపైకి లాగిన కరెంటు తీగ తెగింది. పరిగెత్తుకు వెళ్లి ఆ తీగను పట్టుకొని పక్కకు లాగేశాడు. షాక్‌ కొట్టింది. పట్టించుకోకుండా మొండిగా తీగను గట్టిగా లాగి పక్కకు వాలిపడిపోయాడు. నేను దగ్గరికి వెళ్లేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నా కళ్ల ముందే పవన్‌ ప్రాణాలు విడిచాడు. వాడు ఆ తీగ లాగకపోతే సరిగ్గా దాని కింద గాజులు కొంటున్న శాంతపై పడేదని నాకు తెలుసు. నిజం నేను చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఊరితో పాటు, శాంత ఏమనుకుందంటే ప్రేమను కాదనడంతో ఆత్మహత్య చేసుకున్నాడని... వాడిని అసహ్యించుకుంది. అంత్యక్రియలకూ రాలేదు.

పన్నెండేళ్ల తర్వాత మళ్లీ మా ఊరి జాతరొస్తోంది. శాంత పుట్టింటికొస్తుంది. ఇప్పటికైనా ప్రాణం పణంగా పెట్టి పవన్‌... తనని కాపాడాడని చెప్పాలనేదే నా ప్రయత్నం. శాంత..! వాడిని ప్రేమించకపోయినా ఫర్వాలేదు. ద్వేషించకు చాలు.

- నీ స్నేహితుడు శ్రీను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని