ప్రేమికులకు ప్రేమతో...

నా పేరు హరిత. మాది విజయవాడ. ఆస్తులు, అంతస్తులు అంతగా లేకపోయినా... పంతాలు, పట్టింపులు ఎక్కువగా ఉండే ...

Published : 18 Aug 2018 01:44 IST

ప్రేమికులకు ప్రేమతో...

నా పేరు హరిత. మాది విజయవాడ. ఆస్తులు, అంతస్తులు అంతగా లేకపోయినా... పంతాలు, పట్టింపులు ఎక్కువగా ఉండే మధ్యతరగతి కుటుంబం. అలాంటి మా ఇంట్లో ప్రేమిస్తేనే ఏదోలా ఊహించుకుంటారు... ఇక వేరే కులం అయితే.. అబ్బో పెద్దల కోపాలు ఎంతగా ఉంటాయో చెప్పలేం. అలాంటి కష్టమే నేనూ ఎదుర్కోవాల్సి వచ్చింది.
మా బాబాయ్‌, పిన్నిలది ప్రేమవివాహం. మా పిన్నిగారి బంధువులబ్బాయి రాజు. అలా వాళ్లింటికి వచ్చినప్పుడు మేం కలిసేవాళ్లం. రాజు చాలా మంచివాడు. బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం. పైగా నాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. గౌరవంగా మాట్లాడతాడు. ఆగస్టు 27న నా పుట్టిన రోజు. అదే రోజు నాకు ఫోన్‌ చేశాడు రాజు. బర్త్‌డే విషస్‌ చెప్పి.. తర్వాత తన ప్రేమను చెప్పాడు. కాదనడానికి నాకు ఏవీ కారణాలు కన్పించలేదు. అలా ఫోన్‌తో మొదలైన మా ప్రేమ వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు చేరి... పార్కులు, సినిమా హాళ్లు చుట్టేసింది. రోజులన్నీ సెకన్లలా గడిచిపోయేవి. తన ప్రేమలో లీనమైన నాకు... లీలగా మా ఇంట్లో దీనికి ఒప్పుకోరని ఎక్కడో అనుమానం చంపేస్తుండేది. అనుకున్నట్లే విషయం పెద్దలకు తెలిసిపోయింది. మా అమ్మానాన్న మందలించారు. అబ్బాయి చాలా మంచోడని, నన్ను బాగా చూసుకుంటాడని చెప్పాను. అయినా వాళ్లు వినలేదు. ‘మన మతం కాదు.. కులం కాదు... ఇప్పటికే మీ బాబాయ్‌ ప్రేమ విషయంలో ఎన్ని గొడవలయ్యాయో తెలుసు కదా! వద్ద’ని అమ్మానాన్న కరాఖండిగా చెప్పేశారు. నాకు ఊపిరి ఆగిపోయినట్లైంది. అయినా రాజు మీద నమ్మకం. తనని కలిశాను. తన ఇంట్లోనూ ఒప్పుకోవడం లేదని చెప్పాడు. ‘మన ప్రేమ నిలవడం కష్టమే! రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు అయ్యేట్లు ఉన్నాయి.. నన్ను మరిచిపో’ అన్నాడు. ఆ మాట విన్నాక నా గుండె కొట్టుకుంటుందో? లేదో! అని అనుమానం వచ్చింది. చాలా ఏడ్చాను. ఇంట్లో ఒప్పించమని ఎంతగానో తనకు నచ్చజెప్పాను. ‘ఇంతగా భయపడేవాడివి ఎందుకు ప్రేమించావ్‌?’ అని నిలదీశాను. నాకు బతకాలనే ఆశ చచ్చిపోతూ వచ్చింది. ఒక్కోరోజు ఒక్కో జన్మలా గడుస్తున్నప్పుడు 2018-మే 3న తన నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘నీతో మాట్లాడాలి.. బయటికి రమ్మ’ని దానర్థం. నేను వెళ్లాను. గుడి దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే స్నేహితులతో కలిసి, పెళ్లి ఏర్పాట్లు చేశారని నాకు అర్థమైంది. ఒకవైపు పెద్దలేమంటారోనని భయం, మరోవైపు నా ప్రేమ గెలిచిందని ఆనందంలో ఉండగానే పెళ్లి అయిపోయింది. ఈ మూడు నెలల్లో మా ఇంట్లో పెద్దలు మా ప్రేమను అంగీకరించారు. వాళ్లింట్లో వాళ్లు ఏమీ అనలేక ఉండిపోయారు. ఇప్పుడు మేం ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం.
పెద్దలు ఒప్పుకోలేదని రాజు కుంగిపోయింటే... రాజు వెనుకడగు వేశాడని నేను అపార్థం చేసుకొని ఉంటే... ఏమయ్యేది? నేను ఈ పాటికి ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. మా ప్రేమ బతికేది కాదు. ప్రేమిస్తే.. ధైర్యంతోపాటు ఓర్పుండాలి. అప్పుడే ఆ ప్రేమ నిలుస్తుంది. గెలుస్తుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని