తను మళ్లీ వస్తుందని..

మాది అనంతపురం జిల్లాలో ఒక పట్టణం. మేం పది మంది ఫ్రెండ్స్‌. అల్లరి, ఆనందం మా జట్టులో భాగమే. మా వీధుల్లో స్వచ్ఛభారత్‌ నుంచి వనం-మనం దాకా...

Published : 01 Sep 2018 01:37 IST

తను మళ్లీ వస్తుందని..

మాది అనంతపురం జిల్లాలో ఒక పట్టణం. మేం పది మంది ఫ్రెండ్స్‌. అల్లరి, ఆనందం మా జట్టులో భాగమే. మా వీధుల్లో స్వచ్ఛభారత్‌ నుంచి వనం-మనం దాకా అన్నింటా మేమే. ఏటా వినాయక చవితి ఉత్సవాలు మా ఏరియాలో మా గ్యాంగ్‌ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాం. విగ్రహాన్ని కొలువుదీర్చే వేదిక అలంకరణను రెండు రోజుల ముందు నుంచి రాత్రింబవళ్లు మేల్కొని చేస్తాం. గతేడాది వినాయక చవితికి అలాగే చేసి... తెల్లవారుజామున నిద్రపోయాం. వేదిక పక్కనే కింద జంకానా వేసుకొని పడుకున్నాం. ఉదయం 9 గంటలవుతున్నా అలాగే పడుకొని ఉన్నాం. వేదిక దగ్గర సందడి ప్రారంభమైపోయింది. లీలగా మాకు తెలుస్తున్నా రాత్రి బడలిక వల్ల లేవలేకపోతున్నాం. ‘ఓయ్‌...లేవండి.. పొద్దుపొడిచి చాలాసేపైంది. ఇక్కడ పూజలు జరుగుతుంటే... ఇక్కడేం చేస్తున్నారు? లేచి ఇళ్లకి వెళ్లి పడుకోండి.’ ఎవరిదో గొంతు మమ్మల్నే గదమాయిస్తోంది. ఆ వాయిస్‌లో గదమాయింపు కంటే... మాధుర్యం ఎక్కువగా నా చెవులను తాకుతోంది. అలా దుప్పటి తీసి చూశాను. కళ్లు మళ్లీ రెప్ప వేయడానికీ ఒప్పుకోవడం లేదు. అంత అందం తనది. మా భక్తికి స్వర్గం నుంచి ఎవరైనా దేవదూత మెరూన్‌రెడ్‌ కలర్‌ పైటా, పావడలో వచ్చిందేమో అనుకున్నా. ఆ అమ్మాయి నా కళ్లలోకి చూస్తూ... లేవండి ఇలా పడుకుంటే ఎలా? అంటూ నవ్వుతూ గణేశ్‌ విగ్రహం ముందుకు వెళ్లింది. ఎందుకు నవ్వింది అనుకుంటూ... నా ఒంటిపైకి చూసుకున్నా. రాత్రి వేసుకున్న షార్ట్‌ తప్ప శరీరం మీద ఏమీ లేదు. ఇంతలో మల్లికార్జున వచ్చి ఎవర్రా మనం ఎప్పుడూ ఈ వీధుల్లో చూడలేదు.. అన్నాడు. అవున్రా. మళ్లీ వస్తుందంటావా? అన్నా... ఏంట్రోయ్‌.. అంటూ నా కళ్లలోకి చూశాడు. చకచకా ఇంటికెళ్లి స్నానం చేసి... వీధులన్నీ ఓ రౌండ్‌ వేశాను. తను ఎక్కడా కన్పించలేదు. సాయంత్రం మండపం వద్ద ప్రవచనాలు, హరికథ వినిపించే ఏర్పాటు చేశాం. అందరూ వచ్చి కూర్చొన్నారు. నా కళ్లు తన కోసమే వెదుకుతున్నాయి. కన్పించింది. తనే, ఈసారి లెగిన్‌, టాప్‌.. అదిరిపోయింది. నన్ను చూసి నవ్వింది. కొంచెం సిగ్గు పడ్డాను. తను వాళ్ల బామ్మతో కలిసి వచ్చింది. అప్పుడర్థమైంది. వాళ్లు నాలుగో వీధిలో చివరన ఉంటారని. దగ్గరకు వెళ్లి మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. కుదరలేదు. పనులన్నీ వేగంగా చేస్తూ.. చేయిస్తూ... హీరోలా బిల్డప్‌ ఇచ్చాను. ప్రసాదం శ్రద్ధగా తీసుకెళ్లి అందించాను. ఇప్పటి వరకూ ఏ అమ్మాయిని చూసినా కలగని కొత్త ఫీలింగ్‌ లోపల గిలిగింతలు పెట్టింది. ప్రవచనాలు, హరికథ అయిపోయే సరికి... రాత్రి 11 గంటలైంది. బామ్మ నన్నే పిలిచింది. ‘నాయన కాస్త ఆ నాలుగో వీధి వరకూ తోడొస్తావా? అక్కడ కుక్కలు చాలా ఉంటాయి.’ అంది. సంతోషం వైఫైలా చుట్టూ అల్లుకుపోయింది. అలా తనవెంట వెళ్లాను. తన కళ్లలోకి అప్పుడప్పుడూ చూస్తూ.. మాట కలిపాను. తన కళ్లు కవిత్వాలు చెబుతున్నాయి. నవ్వు వెన్నెలై పూస్తోంది. ఇల్లు అప్పుడే వచ్చేసింది. వారిద్దరూ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొనే వరకూ అక్కడే ఉండి బాయ్‌ చెప్పాను. మళ్లీ రేపొస్తుందని అనుకున్నా. రాలేదు. మూడోరోజు మేం విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తాం. ఆ రోజైనా తను కన్పిస్తుందని ఆశించాను. అదీ జరగలేదు. ఉత్సవాలు ముగిశాయి. వాళ్లింటి ముందు రోజుకు ఎన్ని సార్లు తిరిగానో లెక్కలేదు. తను కన్పించలేదు. ఆ ఇంట్లో వాళ్లు అంతా అమెరికాలో ఉంటారు. ఆ బామ్మ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక ధైర్యం చేసి ఇంట్లోకి వెళ్లి బామ్మతో మాటలు కలిపి తన గురించి అడిగాను. తనూ అమెరికా వెళ్లిపోయిందని చెప్పింది. తనని చూడటానికి మళ్లీ వస్తుందని చెప్పింది. మెదడుకు కట్‌ అయిన సిగ్నల్స్‌ మళ్లీ అందాయి. ఈసారి వినాయక చవితి వస్తోంది.. తను తప్పకుండా వస్తుందని, రావాలని దేవుడిని వేడుకుంటున్నా.

- చిన్ని(సురేశ్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని