ఒక్కసారి మాట్లాడు

నేను ఒకసారి నా స్నేహితుడు రాజ్‌ వాళ్ల అన్న పెళ్లికి విజయవాడ వెళ్లాను. చర్చిలో పెళ్లికి హాజరవడం అదే తొలిసారి. అక్కడ పెళ్లి ఎలా చేస్తారోనని ఎంతో ఆసక్తిగా...

Published : 15 Sep 2018 02:03 IST

ఒక్కసారి మాట్లాడు

నేను ఒకసారి నా స్నేహితుడు రాజ్‌ వాళ్ల అన్న పెళ్లికి విజయవాడ వెళ్లాను. చర్చిలో పెళ్లికి హాజరవడం అదే తొలిసారి. అక్కడ పెళ్లి ఎలా చేస్తారోనని ఎంతో ఆసక్తిగా చూస్తున్నా. ఇంతలో నా ఏకాగ్రతను మొత్తం దెబ్బతీస్తూ... ఓ అమ్మాయి నవ్వు నన్ను పలకరించింది. చూపు తిప్పుకోలేకపోయాను. వైట్‌ కుర్తీలో దేవదూతలా అన్పించింది. పెళ్లి అయిపోయేలోపు తన వివరాలు కనుక్కొందామనుకున్నా. సాధ్యం కాలేదు. తన పేరు లాస్య అని తప్ప ఇంకేం తెలుసుకోలేకపోయాను. సాయంత్రం నుంచి ఇక తను కన్పించలేదు. ఏదో కోల్పోయిన భావన. ఆ బాధతోనే హైదరాబాద్‌కు వచ్చాను. సరిగ్గా వారం తర్వాత నేను కాలేజీకి వెళ్లే దారిలో... తను బస్‌స్టాప్‌ దగ్గర ఎదురు చేస్తూ కన్పించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రన్నింగ్‌ బస్సులోంచి దూకేశాను. కిందపడ్డా. దెబ్బలు తగిలాయి. అయినా తనని మిస్‌ కాకూడదని వెంట పడి, తన కాలేజీ ఎక్కడో తెలుసుకున్నాను. ఇక రోజూ అక్కడికి వెళ్లడం... తన కళ్లలో పడటానికి ప్రయత్నం చేయడం ఇదే నా దినచర్య. ఆ కాలేజీలో ఓ జూనియర్ని పరిచయం చేసుకొని... ఆ అమ్మాయి ద్వారా తన వివరాలు తెలుసుకున్నాను. ఫోన్‌ నంబరు సంపాదించాను. వాట్సప్‌లో హాయ్‌ పెట్టాను. తను స్పందించింది. మెల్లగా స్నేహితులమయ్యాం. బాగా మాట్లాడుకునే వాళ్లం. అప్పుడప్పుడూ సరదాగా బయట కలుసుకొనే వాళ్లం. ఒక మంచి రోజు, తన మూడ్‌ చూసుకొని మనసులో మాట చెబుదామనుకున్నాను.  నేను రోజూ తన వెంట పడుతున్న విషయాన్ని తను గమనించింది. ఆరోజు ఫిబ్రవరి 12, 2018 మేమిద్దరం ఐమాక్స్‌లో కలిశాం. ‘నా మీద ఏమైనా ఆశలు పెట్టుకున్నావేమో... ఈరోజు నుంచే తుడిచేయి. మా ఇంట్లో వేరే మతం వాళ్లని పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం ఒప్పుకోరు.’ అంది లాస్య. నా గుండె పగిలిపోయింది. తను లేకుండా నా జీవితం ఊహించుకోలేనని చెప్పాను. తను అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత నుంచి మెసేజ్‌లకు స్పందించడం లేదు. కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. ఎంతగా ఏడ్చానో నాకే తెలియదు. నా ఎంసీఏ పూర్తైంది. మా నాన్నకు నా ప్రేమ విషయం చెప్పాను. నాన్న ఒప్పుకోలేదు. పిచ్చివేషాలు వేయకుండా ఉద్యోగం చూసుకోమని హెచ్చరించాడు. వాళ్లింటికి వెళ్లి వాళ్ల నాన్నను అడిగాను. ఆయనా అంగీకరించలేదు. నాకు పిచ్చి ఎక్కింది. లాస్య వాళ్ల అన్న నన్ను బయటికి తీసుకొచ్చి మాట్లాడాడు. ‘నేను తర్వాత కూల్‌గా చెప్పి చూస్తాను. నువ్వు గొడవ చేయకుండా వెళ్లమ’న్నాడు. నేను వచ్చేశాను. ఆ మరుసటి రోజు లాస్యని కేరళకు పంపించేశారు. నేను తనని చూడకుండా ఉండలేకపోతున్నాను. ‘లాస్య నీ కోసం నేను కేరళకు వస్తాను.  నా మీద నీకు నిజంగా ప్రేమ లేదా? లేక పెద్దలకు భయపడి నన్ను వదిలేసుకుంటున్నావా? ఈ మతాలు మనల్ని అడ్డుకోలేవు. నేను పిచ్చివాడిని కాకముందే ఒక్కసారి నా ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడు... ప్లీజ్‌.      - అర్జు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని