Published : 20 Aug 2016 01:31 IST

రియోలో రియోలో.. ఎన్ని సిత్రాలో!

రియోలో రియోలో.. ఎన్ని సిత్రాలో!

ఒలింపిక్స్‌ ముగింపు దశకొచ్చాయి. పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. అథ్లెట్ల విన్యాసాలు.. క్రీడాకారుల పోరాటాలే కాదు... రియోలో నయా ఫ్యాషన్లు, వూహించని ట్రెండ్లూ కొన్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనూ వాటిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆ కథాకమామీషు.

రంగు పడింది

లింపిక్స్‌లో పాల్గొనడమే క్రీడాకారులకు పెద్ద విజయం. మరి స్వప్నాన్ని మరింత రంజుగా మార్చేయడానికి, కోట్లమంది దృష్టిలో పడటానికి ఆటగాళ్లు తమ ఒంటిపై టాట్టూలకు చోటిస్తున్నారు. ఒలింపిక్‌ వలయాలు, దేశ చిహ్నాలు, దేశం పేరు, నినాదాలు, గెలిచిన పతకాల సంఖ్య.. ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు పచ్చబొట్లతో చెలరేగిపోతున్నారు. అమెరికన్‌ స్విమ్మర్‌ రియాన్‌ లోచ్టె, బ్రిటన్‌ సైక్లిస్ట్‌ సర్‌ బ్రాడ్లీ, అర్జెంటీనా బాక్సర్‌ ఇగ్నేషియో పెర్రిన్‌, టెన్నిస్‌ ఆటగత్తె స్వెత్లానా కుజ్‌నెత్సోవా.. చెప్పుకుంటూ పోతే వారి జాబితా పెద్దదే.


అభిమానులూ అదుర్స్‌

స్టైల్‌, ఫ్యాషన్‌ కేవలం క్రీడాకారులకేనా? అంటే కానే కాదు మేమూ తక్కువేం కాదు అంటున్నారు అభిమానులు. ఆటగాళ్లను హుషారెత్తించడానికి అభిమానులు, పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు సైతం ఈ ట్రెండ్‌సెట్టర్లుగా మారుతున్నారు. వేలి గోళ్లపై తమ దేశపు జెండాలు, ఒలింపిక్‌ వలయాలు, సొగసుల కళ్లద్దాలు.. ధరిస్తూ క్రీడా సంరంభానికి మరింత సొగసుల సొబగులు అద్దుతున్నారు.


నెత్తికెక్కిన సొగసులు

కురులతో కొత్త ట్రెండ్‌ సృష్టించడం ఎరికైనా తేలిక. జుత్తుతో కనికట్టు చేయడం అమ్మాయి, అబ్బాయి ఎవరికైనా సాధ్యమయ్యే విషయమే. పైగా క్రీడాకారులు, అభిమానులు అన్న తేడాలేం ఉండవుగా. అందుకే అంతా ఈ స్టైల్‌ ఫాలో అవుతున్నారు. ఫ్రెంచి వాలీబాల్‌ ఆటగాడు ఎర్విన్‌ నాగపెట్‌, జూడో క్రీడాకారిణి ఆడ్రే ష్యూమో.. జుత్తుతో రకరకాల ప్రయోగాలు చేసినవారే. దీంతోపాటు బాగా ఆదరణలో ఉన్న మ్యాన్‌బన్‌ హెయిర్‌స్టైల్‌నూ వాళ్లు వదలడం లేదు. కొప్పులతో కప్పులు కొట్టాలని ఆస్ట్రేలియా బాస్కెట్‌బాల్‌ ఆటగాడు ఆరోన్‌ బేయాన్స్‌ ప్రయత్నిస్తే అమెరికా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ జట్టులో ఆ తరహా క్రీడాకారులు ముగ్గురున్నారు.


వలపు విరిసింది

రియో రకరకాల ఆటలకే కాదు.. ప్రేమ.. పెళ్లి ప్రపోజళ్లకూ ఇప్పుడు వేదికే. బ్రిటన్‌ చిన్నది చార్లెట్‌ డుజార్డిన్‌ గుర్రపు స్వారీలో స్వర్ణం గెలవగానే ప్రియుడు డీన్‌ గోల్డింగ్‌ ‘మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా?’ అని అడిగాడు. ఇంతకుమించిన మంచి సమయం ఏముంటుందని జంట సరాసరి చర్చికే వెళ్లిపోయారు. ఇరవై కిలోమీటర్ల నడక పరుగులో బ్రిటన్‌ కుర్రాడు టామ్‌ బోస్వర్త్‌ పాపం ఆరోస్థానంతోనే సరిపెట్టుకున్నాడు. బాధ తగ్గించడానికి అతగాడి ప్రియుడు (ఔను.. మగాడే) డోన్ట్‌ వర్రీ పెళ్లాడి మజా చేసుకుందాం అని ప్రపోజ్‌ చేశాడు. పెళ్లికి అంగీకరించాడో లేదో చెప్పలేదు గానీ ప్రపోజల్‌ విషయాన్ని టామ్‌ ట్విట్టర్‌లో పెట్టేశాడు. చైనీస్‌ డైవర్‌ హీ జీ మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌ పోటీలో రజతం గెల్చుకుంది. పతకం అందుకొని వేదిక దిగగానే తన దేశానికే చెందిన క్విన్‌ కాయ్‌ అందరి ముందూ ఆమె చేతికి రింగ్‌ తొడుగుతానంటూ ముందుకొచ్చాడు. హీ సిగ్గు పడుతూ చేయి చాచింది. అసలు రియోలో ఇలాంటి ట్రెండ్‌ మొదలుపెట్టింది మర్జోరీ ఎన్యా, ఇసడోరా సెరుల్లాలు. ఇద్దరూ అమ్మాయిలే. ఒకరు ఆటగత్తె, ఇంకొకరు మైదానంలో మేనేజరు. పెళ్లి ప్రపోజల్‌ పూర్తవగానే అధరచుంబనంలో మునిగి అందరికీ వినోదం పంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు