కావాలోయ్‌...ఒంటరి!

టీ తాగడానికెళ్లినా తోడుండాలి.. సినిమాకెళ్తే పక్కసీట్లో ఫ్రెండుండాలి.. వూ­రు దాటాలంటే పక్కన ఎవరైనా ఉంటేనే హుషారు..

Published : 26 Nov 2016 01:01 IST

కావాలోయ్‌...ఒంటరి!

టీ తాగడానికెళ్లినా తోడుండాలి.. సినిమాకెళ్తే పక్కసీట్లో ఫ్రెండుండాలి.. వూ­రు దాటాలంటే పక్కన ఎవరైనా ఉంటేనే హుషారు.. స్నేహామేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనుకునేవాళ్లకి ఇది ఓకే. కానీ అన్నివేళలా ఇది పనికి రాదు. జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా పర్యటనలకు వెళ్లిరావాలి అనేది సైకాలజిస్టుల మాట. ఎందుకంటే?
* ప్రతి పర్యటనని స్నేహితులు/మనసుకి నచ్చినవారితో గడిపేవాళ్లే ఎక్కువ. ఇలాంటి వాళ్లు అనుకోకుండా ఏదైనా లాంగ్‌ట్రిప్‌కి వెళ్లాల్సి వస్తే? గుండె దడే. అది తప్పాలంటే ఒంటరి పర్యటన అవసరం. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* చాలామంది ఒక కంఫర్ట్‌జోన్‌లోనే ఉంటారు. కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే భయం. ఇష్టముండదు. ఒంటరి ప్రయాణాలతో ఈ భయాల్ని పారదోలవచ్చు. మొదట్లో కొంచెం ఇబ్బందిపడ్డా కొత్త అనుభవాలతో సరికొత్త ప్రపంచంలోకి అడుగేయొచ్చు.
* స్నేహితులు, ప్రేమికులతో ప్రయాణిస్తే తిండి, విడిది, చూడాల్సిన ప్రదేశం.. ప్రతి దాంట్లో ఇంకొకరిని అనుసరించాల్సిందే. ఒంటరి ప్రయాణంలో ఈ బాధలుండవు.
* ఒంటరి ప్రయాణాలు కొందరికి అసలు పడవు. లోలోపల ఏవో భయాలు వెంటాడతాయి. ఈ భయం పోవాలన్నా ఒంటరి ప్రయాణం చేసి తీరాల్సిందే. మనసు, శరీరం రెండూ సిద్ధం అయినపుడే పరుగులు తీయొచ్చు.
* జట్టుగా వెళితే పక్కనుండేది ఎప్పుడూ తెలిసిన మొహాలే. ఏకాకి అయితే.. ఈ ప్రపంచంతోనే స్నేహం చేయొచ్చు. కొంచెం చొరవ చూపిస్తే స్థానికులు, సాటి పర్యటకులు.. ఎవరైనా మీ నేస్తాలే.
* ఒంటరి ప్రయాణంలో ప్రపంచాన్ని చూడ్డానికి బోలెడంత సమయం ఉంటుంది. ముఖ్యంగా నీ గురించి నీవు ఆలోచించొచ్చు. వచ్చిన కారణం.. ప్రాధాన్యం.. ప్యాషన్‌ నిన్ను నీవు కొత్తగా ఆవిష్కరించుకోవడానికిదో మార్గం.
* మనసుకి నచ్చినవాళ్లకు దూరమైతే ప్రేమలు పెరుగుతాయంటారు. సోలో టూర్‌ ఎడబాటుతో మనసుకి నచ్చినవాళ్లను ఎంతగా మిస్‌ అయ్యామో తెలిపేందుకు కూడా దోహదపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని