1000భాషల్లో ఐలవ్యూ...

ప్యార్‌.. ఇష్క్‌.. మొహబ్బత్‌.. లవ్‌.. కాదల్‌.. మహా అయితే మనం ఏడెనిమిది భాషల్లో ‘ప్రేమ’ని నిర్వచించగలం. ఓ ప్రేమ యోధుడు మాత్రం ఏకంగా మూడు వందల భాషల్లో ‘ఐ లవ్యూ’ ......

Published : 11 Feb 2017 01:16 IST

1000 భాషల్లో ఐలవ్యూ...

ప్యార్‌.. ఇష్క్‌.. మొహబ్బత్‌.. లవ్‌.. కాదల్‌.. మహా అయితే మనం ఏడెనిమిది భాషల్లో ‘ప్రేమ’ని నిర్వచించగలం. ఓ ప్రేమ యోధుడు మాత్రం ఏకంగా మూడు వందల భాషల్లో ‘ఐ లవ్యూ’ అనే పదాన్ని ఓ రాతి గోడపై చెక్కాడు. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులకు ‘లవర్‌ స్పాట్‌’లా మారింది. ఈ ప్రేమ చిహ్నం ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లో ఉంది. ఫ్రెడెరిక్‌ బ్యారన్‌, క్లేర్‌ కీటో అనే ఇద్దరు ఈ ప్రేమ కుడ్యాన్ని చెక్కిన శిల్పులు. దీనికోసం ఫ్రెడెరిక్‌ పేద్ద సాహసమే చేశాడు. రకరకాల భాషల్లో ఐలవ్యూని ఎలా పలుకుతారో తెలుసుకోవడానికి ఫ్రాన్స్‌లోని అన్ని దేశాల రాయబార కార్యాలయాలు తిరిగాడు. కనపడ్డ ప్రతి విదేశీయుడితో మాట్లాడాడు. ఆ వివరాల్ని ఓ పుస్తకంలో రాసుకున్నాక క్యాలీగ్రఫీ నిపుణుడు కీటోతో అబేసీస్‌ గార్డెన్‌ అనే ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేయించిన రాతి గోడపై అందంగా 300 భాషల్లో ఐలవ్యూలు చెక్కించాడు. ‘వెనిస్‌లో బ్రిడ్స్‌ ఆఫ్‌ సైస్‌, ఆగ్రాలో తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నాలు. అంతా ప్రేమమయం అయిన ప్యారిస్‌కి ఓ స్మారక చిహ్నం లేకపోతే ఎలా? ఆ కొరత తీర్చడానికే నా ఈ ప్రయత్నం. దీన్ని చూశాక ఏ ప్రేమికులూ విడిపోవద్దు అని గట్టిగా అనుకోవాలి’ అంటున్నాడు ఫ్రెడెరిక్‌. తనూహించినట్టే ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమికులు ఇక్కడికొస్తున్నారు. వారూ తమకు తెలిసిన భాషలో ఐలవ్యూ అనే పదం రాస్తున్నారు. మొత్తమ్మీద నలభై చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న ఈ గోడపై వేయి భాషల్లో ఐలవ్యూలున్నాయిపుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని