Published : 28 Oct 2017 02:10 IST

చెప్పుకోవాల్సిన కళ అంకురార్పణ

చెప్పుకోవాల్సిన కళ అంకురార్పణ

వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ని... భిన్నమైన డిజైర్‌ పౌచ్‌లతో అలంకరిస్తుంటాం... పెట్టుకునే వాచ్‌కి... పలు రకాల పట్టీలు (బెల్ట్‌) మార్చేస్తూ మణికట్టుని మెరిపిస్తాం... మరి, వేసుకునే చెప్పుల సంగతేంటి? దుమ్ము దులిపో... పాలిష్‌ చేసో వేసుకోవడమేనా? వాటినీ స్మార్ట్‌గా మార్చేసి ధరించలేమా?ఇదే ఆలోచన శశాంక్‌ పవార్‌ని పారిశ్రామికవేత్తగా మలిచింది...లిజి ఆశీర్వాద్‌, హర్షిన్‌ తనకి తోడయ్యారు... అంతే... భిన్నమైన చెప్పులు మార్కెట్‌లో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి...అవే ‘మర్టిల్‌’ డిజైన్స్‌!మగువల్నే కాదు... మగవారినీ కట్టిపడేసేలా డిజైన్లు...వాటి వెనకున్న క్రియేటివిటీ... కష్టం గురించి తెలుసుకుందాం!
ట్రెండ్‌ని ఫాలో అవ్వడం కంటే... సృష్టించడంలోనే కిక్కు వెతుక్కోవాలి. అంకుర సంస్థల పుట్టుకకు ఇదే ఆది అనుకోవాలి. అప్పుడే నెలకొల్పిన స్టార్టప్‌ నెలలు... సంవత్సరాలు... అనే లెక్కల మధ్య కాకుండా జనాల మధ్యకెళ్లి శాశ్వతంగా మనుగడ సాధిస్తాయంటూ తన విద్యార్థి దశ నుంచి స్వతంత్రంగా ఎదగాలనుకునే ఆలోచనలతో స్టార్టప్‌ల రేస్‌లోకి దిగాడు శశాంక్‌. పుట్టింది ఆదిలాబాద్‌లో... చదివింది వరంగల్‌ ఎన్‌ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌. 2013లో పట్టా పుచ్చుకుని ఉద్యోగాల వేట కెళ్లకుండా తనదైన ప్రత్యేకతతో అంకుర సంస్థ ఏర్పాటు చేస్తూ... బిజినెస్‌లో భిన్న కోణాల్ని వెతుకుతూ ముందుకు సాగుతున్నాడు. విద్యార్థి దశలోనే పర్యావరణ పరిరక్షకుడిగా ‘క్లౌడ్స్‌గ్రీన్‌’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ని రూపొందించే ప్రయత్నం చేశాడు. పలు షాపింగ్‌ మాళ్లు, హోటళ్లలో బిల్లు రూపంలో ఇచ్చే కాగితం వాడకాన్ని కట్టడి చేయాలన్నదే స్టార్టప్‌ ఉద్దేశం. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో వినియోగదారుడికి పేపర్‌ బిల్లు కాకుండా ఎలక్ట్రానిక్‌ బిల్లు చేరేలా చేశారు. కొన్ని నిర్వహణా లోపాలతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఏ మాత్రం నిరుత్సాహం లేకుండా స్నేహితులతో ‘ప్రింటింగ్‌ టీషర్ట్‌’ల కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. మార్కెట్‌తో పరిచయం ఏర్పడింది. బాహుబలి సినిమాకి పబ్లిసిటీలో భాగంగా టీషర్ట్‌ల తయారీతో వ్యాపార భాగస్వాములయ్యారు కూడా. కానీ, పోటీలో నిలబడలేక తిరిగి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మదిలో మెదిలిన ఆలోచనే చెప్పుల్లో ట్రెండింగ్‌ పుట్టుకొచ్చిన ‘ఛేంజిబుల్‌ స్ట్రాప్స్‌’. 2015లో మిత్రులతో బృందంగా ఏర్పడి ‘మర్టిల్‌’ పేరుతో అంకుర సంస్థని ప్రారంభించారు. మగువలు, మగవారు (యునిసెక్స్‌) కలిపి వాడుకునేలా ట్రెండీగా తీర్చిదిద్దారు. పేటెంట్‌ హక్కులు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఏంటీ చెప్పులు?
ఓ జత చెప్పులు కొంటే వాటిని అరిగిపోయేలా వాడాలి. తెగిపోతే పడేయాలి. బోర్‌ అనిపిస్తే పక్కన పడేసి కొత్తవి కొనాలి. కానీ, ఇవి అలా కాదు. దృఢమైన సోల్‌పై పలు రకాల ‘స్ట్రాప్స్‌’ని (తొడుగులు) చిత్రంలో మాదిరిగా మార్చుకోవచ్చు. తొడుగులు సోల్‌కి గట్టిగా అంటిపట్టుకుని ఉండేలా ‘స్క్రూ క్యాప్స్‌’ అమర్చారు. సోల్‌ఫై తొడుగుని అమర్చి సీసా మూత బిగించినట్టుగా టైట్‌ చేస్తే చాలు. చెప్పులు కొత్తగా మారిపోతాయి. ఉదాహరణకు అప్పటి వరకూ జీన్స్‌కి మ్యాచింగ్‌గా వాడిని చెప్పుల్ని ఏదైనా శుభకార్యానికి వేసుకెళ్లే పైజామా, కుర్తాకి తగిన వాటిగా మార్చేయవచ్చు. సోల్‌పై అమర్చుకునేందుకు జూట్‌ కాటన్‌, మంగళగిరి కాటన్‌, తోలుతో పలు రకాల డిజైన్లలో స్ట్రాప్స్‌ని తయారు చేస్తున్నారు. సోల్‌ని పాదాల ఆకృతికి సరిపడేలా ‘కార్క్‌’తో (బెండు చెక్క) రూపొందించారు. దీంతో పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఒక సోల్‌తో మూడు స్ట్రాప్స్‌ని అందిస్తున్నారు. అదనంగా మరిన్ని కావాలంటే ఆన్‌లైన్‌ కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌చేయాలనుకుంటే https://goo.gl/Z9Mqfq లింక్‌ని చూడండి.
ఇక్కడి అవసరాల నుంచే...
దేశంలోని ప్రజల స్థితిగతులు, అవసరాల నుంచే స్టార్టప్‌లు పుట్టుకురావాలి. అప్పుడే అంకుర సంస్థల మనుగడ సాధ్యం. బృందంగా ఏర్పడి కలిసి పని చేస్తే డెడ్‌లైన్‌కి ముందే పని ముగించేయొచ్చు. మా బృందం అలానే పని చేశాం. స్టార్ట్‌అప్‌ నిర్వహణ బాధ్యత నేను చూసుకుంటే... స్ట్రాప్స్‌ సోల్‌పై పటిష్టంగా అమరేందుకు అనువైన డిజైన్స్‌ పర్యవేక్షణంతా ఆటోమొబైల్‌ ఇంజినీర్‌గా హర్షిన్‌ బాధ్యత. ఇద్దరం స్కూల్‌ నుంచే ఫ్రెండ్స్‌. ఇక లిజీ బాధ్యత అమ్మాయిలకు అనువైన స్ట్రాప్‌ల డిజైన్స్‌ రూపొందించడం. ఫ్యాషన్‌ డిజైనర్‌గా చెప్పులు ఎలా కనిపించే ట్రెండీగా ఉంటాయి... వాటిని ఎలా ప్రజెంట్‌ చేయాలి... లాంటివన్నీ తనే మానిటర్‌ చేస్తుంది.

- శశాంక్‌

ఎలక్ట్రిక్‌ సైకిల్‌ని రూపొందిస్తున్నాం...
ఆటోమొబైల్‌ ఇంజినీర్‌ని... నాది హైదరాబాద్‌. శశాంక్‌ మెకానికల్‌. ఆటో ఫీల్డ్‌లో నేను సర్జన్‌ అయితే తను జనరల్‌ ఫిజీషియన్‌. ఆటోమొబైల్‌ మనిషికో కృత్రిమ అవయవం అనుకుంటా నేను. ఎలా అంటే నేను వాడే బైక్‌ నాకో కృత్రిమ అవయవం. అది లేకుంటే నేను ఈ రోజు నిమిషాల్లో ఇక్కడికి వాచ్చేవాడిని కాదు. అంతలా ఇద్దరికీ ఇష్టమైన ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పటికే ‘ఎలక్ట్రిక్‌ సైకిల్‌’ రూపకల్పనలో భాగంగా కొంత ప్రయాణం సాగింది. మరింత పక్కా ప్రణాళికతో ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రానిక్‌ కార్ల రూపకల్పనలో మాదైన ముద్ర వేయాలనేది మా ముందున్న మరో లక్ష్యం.

- హర్షిన్‌

ట్రెండీనే కాదు..రొమాంటిక్‌ కూడా!
నాది నెల్లూరు. చదువు నర్సింగ్‌ అయినప్పటికీ నాకు మొదట్నుంచీ ఫ్యాషన్‌ రంగం అంటేనే ఇష్టం. అయితే, తల్లిదండ్రుల కోరిక మేరకు చదివా. ఇప్పుడు నా అభిరుచి మేరకు నచ్చిన రంగంలో నేనేంటో నిరూపించుకుంటున్నా. మర్టైల్‌లో నన్ను ఆకట్టుకున్న విషయం ఏంటంటే.. ఒకే సోల్‌పై స్ట్రాప్స్‌ అమర్చుకుని భార్యభర్తలు ఇరువురూ వాడుకోవచ్చు. ఒకరి పాదాల్లో మరొకరు పాదాలుంచడం ట్రెండీనే కాదు. రొమాంటిక్‌ కూడా!

- లిజి ఆశీర్వాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు