లబ్‌డబ్‌ లబ్‌డబ్‌.. లవ్‌బాంబ్‌

‘నువ్వు లేకపోతే చచ్చిపోతా డియర్‌. నువ్వు లేని ఒక్క క్షణం భరించలేను’ ‘పరిచయమై రెండ్రోజులు కాలేదు.. అప్పుడే ఇంత లవ్వా?’...

Published : 18 Nov 2017 01:59 IST

జరభద్రం
లబ్‌డబ్‌ లబ్‌డబ్‌.. లవ్‌బాంబ్‌

‘నువ్వు లేకపోతే చచ్చిపోతా డియర్‌.
నువ్వు లేని ఒక్క క్షణం భరించలేను’
‘పరిచయమై రెండ్రోజులు కాలేదు..
అప్పుడే ఇంత లవ్వా?’
‘అవును, మాటల్లో చెప్పలేనంత! ఇదిగో ఖరీదైన గడియారం నీ కోసమే తీసుకొచ్చా, కాదనకు ప్లీజ్‌!’ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. కానీ, దొంగచూపు లోపల దాగున్న దుర్బుద్ధిని పసిగట్టలేదు. పక్కలో కూర్చున్న పేలని ఆ బాంబు.. ‘లవ్‌ బాంబింగ్‌’!

ది నమ్మించి వంచించే డేటింగ్‌ ట్రెండ్‌. ఈ పదం ఇప్పుడిప్పుడే విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇలాంటి బాంబులు ఎక్కడో ఉండవు. హఠాత్తుగా ఏ కళాశాల కెఫెటేరియాలోనో చూపులు కలిపి.. హృదయాన్ని కొల్లగొట్టొచ్చు. బంధువుల పెళ్లిళ్లలో మోజు పడొచ్చు. వీధి చివర్న నిల్చుని.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ.. మిమ్మల్ని బోల్తా కొట్టించవచ్చు. లవ్‌బాంబింగ్‌కు ఆయుధం - ఊపిరిసలపని ప్రేమను కురిపించడం. ఎక్కడా కించిత్తు సందేహం కలగదు. వారి హావభావాలు, సరససల్లాపాలను.. కుంభవృష్టిలా కురిపిస్తారు. ఆ జడివానలో తడిసి ముద్దవ్వాల్సిందే! ‘‘పరిచయమైన తొలి రోజు నుంచీ లవ్‌బాంబర్‌ లక్ష్యం ఒక్కటే. నచ్చిన వారిని వలలోకి వేసుకోవడం. అందుకోసం తరచూ ఖరీదైన కానుకలతో మెప్పు పొందే ప్రయత్నం చేస్తారు. పొగడ్తలకు కొదవ లేదు. దీనికీ లోటు రానివ్వడు. దాంతో ఎవ్వరైనా మైమరచిపోవాల్సిందే. మొదట మానసికంగా దగ్గరై.. ఆ తరువాత వంచించేందుకు పావులు కదుపుతారు. ఈ ప్రక్రియలో ఆవగింజంత అనుమానం రానివ్వరు. లక్ష్యం నెరవేరిందంటే.. ఆ బాంబ్‌ పేలినట్లే! ఆ తరువాత క్షణం నుంచే బాంబు ఉద్దేశ్యం బాధితులైనవారికి అర్థం అవుతుంది. మెల్లగా ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తారు. చీటికీమాటికీ పొగడ్తలతో ముంచెత్తినవారే.. చిన్న మాటకే చిటపటలాడతారు. నమ్మించి మోసం చేసి.. నవ్వుకుంటూ వెళ్లిపోతారు. ఇటువంటి లక్షణాలన్నీ ఓ వ్యక్తిలో ఉంటే.. కచ్చితంగా అది లవ్‌ బాంబింగే!’ అంటున్నారు మానసికశాస్త్రవేత్తలు. ఇలా ప్రవర్తించడానికి కారణం... విచ్చలవిడితనం పెరగడం, అనుబంధాన్ని కొనసాగించే ఓపిక లేకపోవడం. ఇలాంటి వారిని ‘ఎ’ సోషల్‌ అంటారు.

లవ్‌ బాంబర్లు ఎలా ఉంటారు?
* ఎక్కడలేని ఆప్యాయత ఒలకపోస్తారు. సందర్భం లేకపోయినా ఖరీదైన కానుకలు ఇస్తుంటారు
* ఎక్కడా ప్రేమ తీవ్రత తగ్గనివ్వరు. నిరంతరం ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, చాటింగ్‌లతో.. ఆలోచనలన్నీ తనవైపు తిప్పుకోవడంలో నేర్పరితనం ప్రదర్శిస్తారు.
* బలహీనతలను, అభద్రతను సొమ్ము చేసుకోవడంలో దిట్టలై ఉంటారు.
* విపరీత కపట ప్రేమను ఒలకబోసి.. బందీ చేసుకునే వరకు వదలరు.
* లవ్‌బాంబర్‌ బుట్టలో ఎందుకు పడతారంటే.. అతి ఆత్మవిశ్వాసంతో ఆకర్షిస్తారు. ఉన్నత లక్ష్యాలు ఉన్నట్లు భ్రమింపజేస్తారు. ఖరీదైన జీవనశైలితో ప్రదర్శనస్వభావం కలిగి ఉంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని