Published : 25 Nov 2017 01:56 IST

పౌండ్‌ఫిట్‌తో చిందెయ్‌

ఫిట్‌నెస్‌ ట్రెండ్‌
పౌండ్‌ఫిట్‌తో చిందెయ్‌

కొత్త ట్రెండ్స్‌ అంటే ఫ్యాషన్స్‌లోనేనా? ఫిట్‌నెస్‌లోనూ కొత్తగా ఎన్నో పుట్టుకొస్తున్నాయి... ‘పౌండ్‌ ఫిట్‌’ అలాంటిదే! పాశ్చాత్య దేశాల్లో సందడి షురూ చేసి... మన దగ్గరా మ్యూజిక్‌ మస్తీతో ముందుకొచ్చింది! మరి, ఇందులో దాగున్న ఫిట్‌నెస్‌ మంత్రా ఏంటో తెలుసుకుందాం!

బృందంగా కలసి... మ్యూజిక్‌ మస్తీతో... స్టెప్పులు వేస్తూ... చేసేదే ఈ పౌండ్‌ఫిట్‌. దీంట్లో వాడే కర్రల్ని వ్యాయామ పరిభాషలో ‘రిప్‌స్టిక్స్‌’ అని పిలుస్తారు. తక్కువ బరువుతో ప్రత్యేకంగా తయారు చేసిన వీటిని పట్టుకుని లయబద్ధంగా డ్యాన్స్‌ చేస్తూ వాయించాలి. ఉన్నచోటనే శరీరాన్ని పలు భంగిమల్లో వంచుతూ లయబద్ధంగా కర్రల్ని కొడుతూ చేసే వ్యాయామమే పౌండ్‌ఫిట్‌. నిర్ణీత సమయానికే లేచి సీరియస్‌ వర్కవుట్‌లు చేయడం ఇష్టం లేనివారు ఇట్టే పౌండ్‌ ప్రేమికులు అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. 2 నుంచి 4 నిమిషాల పాటు ప్లే అయ్యే మ్యూజిక్‌ ట్రాక్‌తో లయబద్ధమైన నృత్య భంగిమల్ని చేస్తూ శరీరంలో కొవ్వుని కరిగించొచ్చు. తక్కువ సమయంలో శ్రమ తెలియకుండానే శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ని పెంచుకునేందుకు దోహదం చేస్తుంది. శరీరాకృతి, దృఢత్వానికే కాదు, మానసిక వికాసానికి తోడ్పడుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. రిప్‌స్టిక్స్‌ చేతపట్టి చేసే ఈ పౌండ్‌ వ్యాయామంలో పక్కటెముకలు, భుజాలు, మోచేయి కండరాలు, బైసప్స్‌, ట్రైసప్స్‌, నడుము భాగాలు సామర్థ్యాన్ని మరింత పుంజుకుంటాయి. ఉత్తేజం పొందొచ్చని సూచిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... శరీర కండరాలు చేస్తున్న శ్రమని స్టిక్స్‌తో చేసే మ్యూజిక్‌ బీట్స్‌లో వింటూ రెట్టించిన ఉత్సాహంతో వ్యాయామం చేయవచ్చు.


గంటలో 900 కేలరీలు ఖర్చు

పౌండ్‌ఫిట్‌ పేరుతో చిందేసే ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ పరిచయం అయ్యింది 2011. మ్యూజిక్‌ డ్రమ్స్‌ వాయించే కిర్‌స్టెన్‌ పొటెన్జా, క్రిస్టినా పీరెన్‌బూమ్‌ దీని రూపకర్తలు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 మంది ట్రైనర్లు వారి జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, స్టూడియోల్లో కోర్సుగా పరిచయం చేసి శిక్షణనిస్తున్నారు.
* ఓ గంటపాటు పౌండ్‌ఫిట్‌ నృత్యం చేస్తే సుమారు 900 కేలరీలకుపైనే ఖర్చవుతాయి.
* శరీరంలోని అన్ని అవయవాలు ఒకదానితో ఒకటి లయబద్ధంగా సహకరించుకుంటూ వేగంగా కదులుతాయి. దీంతో చురుకుదనం పెరుగుతుంది.
* పలు అవయవాల్లో ఏర్పడిన దీర్ఘకాలిక నొప్పుల్ని తగ్గించుకునేందుకు ఉపకరిస్తుంది.
* నాజూకు నడుము కోసం ఇదో మంచి వ్యాయామం.
* ఒత్తిడి నుంచి ఉపశమనం
* స్టిక్స్‌ శబ్ధంతో మెదడు ఉత్తేజితమై సామర్థ్యం మెరుగవుతుంది.
* వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఒత్తిడి, బద్ధకం లాంటివి దరి చేరవు.
* వయసుతో సంబంధం లేకుండా ఎవ్వరైనా ఈ పౌండ్‌ఫిట్‌ని నేర్చుకుని ఫిట్‌నెస్‌ సాధించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు