Published : 14 Apr 2018 02:15 IST

నీదీ..నాదీ సాదా.. సీదా కథ

మిలీనియల్స్‌ బాట

నీదీ..నాదీ సాదా.. సీదా కథ

* ఆజాద్‌ గదిలో... ఫ్రిడ్జ్‌పై స్టిక్కీ నోట్స్‌. చేయాల్సిన పనులు. చదవాల్సిన పుస్తకాలు. ప్లాన్‌లు.. ప్రపోజల్స్‌. వాటన్నింటి మధ్య... పెద్ద అక్షరాల్లో... బి ఏవరేజ్‌
* షాపింగ్‌లో ఆద్యా. టీ-షర్టులు కొంటోంది. అన్నింటిపై టెక్స్ట్‌ వాక్యాల్లో ఏవేవో నినాదాలు. వాటిల్లో ఓ వాక్యం తన కోసమే అన్నట్టుగా... ఐ యామ్‌ నాట్‌ ఇన్‌ ర్యాట్‌ రేస్‌
* ఆఫీస్‌లో వరుణ్‌... ప్రాజెక్టు వర్కుతో బిజీ. కాఫీ కప్పు అందుకున్నాడు. సిప్‌ చేసి టేబుల్‌పై పెట్టాడు. కప్పుపై ఒక్క వాక్యంలో తనదైన నినాదం... బి కంటెంట్‌ విత్‌ లైఫ్‌

... ఆజాద్‌, ఆద్యా, వరుణ్‌ వీళ్లే కాదు. కొంత మంది యువత ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ సమాజంలో ఒక్కరై జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాళ్లకి హవాయ్‌ చెప్పులు... నలిగిన టీషర్టు... పెరిగిన జుట్టు... వారమైనా విడవని జీన్స్‌ ప్యాంటుతో చాలా సాదా... సీదాగా కనిపించాలనుకుంటున్నారు. కేఫ్టేరియా కాఫీల్లోనే కాదు... పిట్టగోడపై కూర్చుని తినే పల్లీ పొట్లాలతోనే రిఫ్రెష్‌ అవ్వాలనుకుంటున్నారు. పేరున్న కంపెనీలో ఉద్యోగాలు... లక్షల్లో జీవితాలు వీరిని ప్రభావితం చేయలేవు. ఉన్నతమైన లక్ష్యాలు.. సుధీర్ఘ ప్రణాళికలు వీరి డైరీల్లో కనిపించవు. ఎవరైనా ఎలా ఉన్నావ్‌? అని అడిగితే... ‘సూపర్‌.. డూపర్‌... గ్రేట్‌’ అని చెప్పరు. సింపుల్‌గా... ‘ఏవరేజ్‌’ అనేస్తారు. అంటే... దానర్థం వారి దృష్టిలో ‘సగటు మనిషిలా బాగున్నా’ అని. ఎదుటి వ్యక్తి ‘ఏమైందీ? ఏదైనా సమస్యా?’ అని అడిగితే... ‘అదేం లేదు. సగటు మనిషిగా సాధారణంగా బతికేందుకు ప్రయత్నిస్తున్నా’ అని బదులివ్వాలనుకుంటున్నారు. ఎందుకిలా? ఒకప్పుడు ‘యో... యో..’ అంటూ తిరిగిన ‘రాక్‌స్టార్‌’ జీవితాల్ని వదిలి ‘ఏవరేజ్‌’గా మిగిలిపోయే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? యావరేజ్‌గా బతకడమే ‘ఎక్స్‌లెంట్‌ లైఫ్‌’ అని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? కారణాలెన్నో... ఒత్తిడి.. ఓటమి భయం... పోటీ... వంటి వాటిని అధిగమించడానికి సాదా.. సీదా లైఫ్‌ ఓ మార్గం అంటున్నారు..

పరీక్షించుకోండి

టైప్‌ ఏ (ఎక్సెల్‌)
* పనేదైనా వేగంగా చేయాలనుకుంటారు
* పని గురించి పదే పదే ఆలోచన
* ఎలాగైనా సాధించి తీరాలనుకుంటారు
* పనిలో విరామం విసుగ్గా అనిపిస్తుంది
* ఎదుటివారిలో లోపాల్ని పసిగడతారు
* త్వరగా ఏదీ షేర్‌ చేసుకోరు
టైప్‌ బి (ఏవరేజ్‌)
* చిన్న చిన్న వాటిలోనే సంతృప్తి
* చేసే పనినిలోనే ఆనందం 
* ఓటమిని విశ్లేషిస్తారు
* బలాలు.. బలహీనతలు తెలుసు
* సులభంగా కలిసిపోతారు
* పంచుకోవడం అంటే వీరికి ఇష్టం
* అంతా పాజిటీవ్‌ దృక్పథం

ఒత్తిడి నేర్పే పాఠం...సగటు జీవితం  

ఉన్నతమైన లక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. వ్యక్తి సామర్థ్యానికి, ఆలోచనకీ మించిపోతే? అప్పుడే ఒత్తిడి వెంటపడుతుంది. అక్కడి నుంచి మొదలవుతుంది పోటీ ప్రపంచంలో వెనకబడిపోవడం. నెంబర్‌ వన్‌ స్థానం నుంచి టాప్‌ 10కి... తర్వాత టాప్‌ 100లోకి జారిపోతారు. తర్వాత కొంత కాలానికి పోటీకి అర్హత సాధించలేని స్థితికి వచ్చేస్తారు. అప్పుడు ఉన్నతమైన లక్ష్య శిఖరం ముందు చిన్నబోయి... ‘నేనెంత... ఓ నలుసంతేనని’ తమని తామే చిదిమేసుకుంటారు. పేరొందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న చైతన్య ఇదే చెబుతున్నాడు. ‘పోటీ మయమైన ప్రపంచంలో అలసటని చవిచూసే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లక్ష్య సాధనలో అన్నీ మనం అనుకున్నట్టే జరగాలి అనుకుంటాం. అప్పుడే గెలుపు సులువని తలుస్తాం. కానీ, ఎన్నని మన చెప్పు చేతల్లో ఉంటాయ్‌? అందుకే అన్నింటినీ పట్టించుకోవడం నా పని కాదనీ... నన్ను నేను నియంత్రించుకుంటే చాలనే నిర్ణయానికి వచ్చాను. దీంతో నా పరిధి ఏంటో తెలిసింది. ఒకప్పుడు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ అనిపించుకునే క్రమంలో నా చుట్టూ అతి తక్కువ మంది స్నేహితులు ఉండేవారు. అదీ అంటీ ముట్టనట్టుగానే! ఎప్పుడైతే ‘జెస్ట్‌ ఏవరేజ్‌’గా మారానో అప్పుడు నా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ పెరిగింది. ఇచ్చి పుచ్చుకోవడంలో మజా తెలిసింది... ప్రియమైనవారికి దగ్గరగా ఉండడంలో ఒత్తిడిలేని విశాలమైన ప్రపంచం కనిపించింది. దీంతో నేటి పోటీ ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడికి నేను ఏ మాత్రం ప్రభావితం కానని అనిపించింది.’ అంటే... చైతన్య ఉన్నతమైన లక్ష్యాలు, కలలు, నిబద్ధతకి వ్యతిరేకమా? కృషి, పట్టుదల.. అంటూ చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠాలకు విరుద్ధమా? ఏం కాదు. వాస్తవ ప్రపంచానికి దగ్గరయ్యాడంతే! ఒత్తిడిని జయించడానికి ఇదో మార్గమని చెబుతున్నాడంతే.

హై-స్పీడ్‌ నుంచి...ఏవరేజ్‌కి... 

నేటి చదువుల్లోనూ... పేరెంటింగ్‌లోనూ అన్నింటా పోటీ తత్వాన్ని ప్రేరేపించడమే ప్రధాన లక్ష్యం. దీంతో యువత కాలేజీ చదువుల్లో ఉండగానే నైపుణ్యాన్ని సాధించాలని ఎంతో శ్రమ పడుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో స్మార్ట్‌గా ఆలోచిస్తూ ‘స్టార్టప్‌ జనరేషన్‌’గా పిలిపించుకుంటూ అంకుర సంస్థల్ని స్థాపిస్తున్నారు. మంచిదే కానీ, ఎన్ని అంకురాలు మనుగడ సాగిస్తున్నాయ్‌? ప్రారంభించిన కొద్ది రోజులకీ అనేక లోపాలతో అంకురార్పణ దశలోనే ఆగిపోతున్నాయ్‌? వంద మందిలో తొంభై శాతం ఓటమి చవిచూసినవారే! ఈ నేపథ్యంలో స్టార్టప్‌ జనరేషన్‌కి వారి లోపాలేంటో అవగతమవుతాయి. దీంతో అప్పటి వరకూ పాల్గొన్న హై-స్పీడ్‌ రేస్‌ నుంచి తప్పుకోవాలనుకుంటారు. వేగం తగ్గించుకుని ‘ఏవరేజ్‌-స్పీడ్‌’కి వచ్చి అంకురాల అవసరం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వంద శాతం నిజమని ‘స్టుమ్యాగ్జ్‌’ అంకుర సంస్థ వ్యవస్థాకుడు శ్రీ చరణ్‌ లక్కరాజు చెబుతున్నారు. 
మేం చాలా స్మార్ట్‌... ఉన్నతమైన శ్రేణికి చెందుతాం అనుకునేవారంతా ‘మధ్య తరగతి’ (ఏవరేజ్‌) శ్రేణికి దూరం అయినట్టే. గమనించాల్సిన విషయం ఏంటంటే... ఎక్కువ శాతం బిజినెస్‌ ‘ఏవరేజ్‌’ శ్రేణిలో ఉంటుంది. అంకెలు... అంచనాలు... బ్లాక్‌బోర్డ్‌ సక్సెస్‌ ఫార్ములాలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకునే ప్రయత్నం చేసినవారు ‘ఏవరేజ్‌’ లైఫ్‌కి దగ్గరైతేనే సక్సెస్‌ సీక్రెట్స్‌ని తెలుసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఏదైనా స్టార్ట్‌ చేసే ముందు ‘సగటు’ లెక్కగట్టందే ఓ అవగాహనకి రాలేం. అందుకే మిలీనియల్స్‌ ‘బి ఏవరేజ్‌’ ఫార్ములా దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదో లాజిక్‌ ఉన్న సక్సెస్‌ ఫార్ములా!

జీవితసారం గ్రహిస్తూ...ఏదైనా స్వీకరిస్తూ... 

ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి సమస్య వస్తుందోనని ఆందోళనకి గురవుతూ వర్క్‌ స్టేషన్స్‌లో గడిపేందుకు మిలీనియల్స్‌ సిద్ధంగా లేరు. మనసేం చెబుతుందో వింటూ... ఎందురయ్యే సవాళ్లను స్వీరిస్తూ జీవితసారాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. చేసే పనిలో ఒత్తిడిని కాకుండా ప్రశాంతతని కోరుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రంలోనూ ఇదే చెప్పారు. పోటీ ప్రపంచంలో పడి పరుగుతీస్తూ... జీవితాన్ని జీవించడం లేదని చూపారు. పర్సనాలిటీ డెవలెప్‌మెంట్‌ ఉచ్చులు, లక్ష్యాల గోలలు లేని... సాదాసీదా జీవితమే గొప్పదని చెప్పారు. అది నేటి యువతను ఆకట్టుకుంది. అంటే యువత ఆలోచనలు ఎలా సాగుతున్నాయో ఈ చిత్ర ఫలితం చెప్పకనే చెబుతోంది. అదే వాస్తవిక జీవితమని సైకాలజిస్ట్‌ టీఎస్‌ రావు చెబుతున్నారు. 
   నేటి పోటీ ప్రపంచంలో ఎలాగైనా నెగ్గుకు రావాలనుకునేవారు కొందరుంటారు. వీరంతా వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉంటారు. వీరంతా ‘టైప్‌-ఎ’లోకి వస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడంలోనే వీరికి ఆనందం. ఓడిపోతే తట్టుకోలేరు. 100కి ఓ రెండు మార్కులు తక్కువ వచ్చాయని... ఒక్క మార్కులో ఫస్ట్‌ ర్యాంకు మిస్‌ అయ్యానని... ఒత్తిడికిలోనై చనిపోతున్నవారినీ చూస్తున్నాం. ‘టైప్‌-బీ’ ఇంకొందరు. వీరిని ‘ఏవరేజ్‌’ శ్రేణిగా పరిగణించొచ్చు. వాస్తవికతే వీరి బలం. లక్ష్య సాధనలో బలాలు, బలహీనతలు అంచనా వేసుకుంటారు. సవాళ్లను స్వీకరిస్తూ ప్రశాంతంగా ముందుకు సాగుతుంటారు. తక్కువ... ఎక్కువ అనే బేరీజు లేకుండా కావాల్సిందానిపై క్లారిటీగా ఉంటారు. దీంతో ఒత్తిడి ఛాయలు వీరిలో కనిపించవు. ఒకేసారి ఎవరెస్టు ఎక్కేద్దాం అని కాకుండా చిన్న కొండలు, గుట్టలు ఎక్కే ప్రయత్నం చేస్తారు. వారి సామర్థ్యంపై నమ్మకం ఏర్పడ్డాక ఎవరెస్టుని ఎక్కే సాహసం చేస్తారు. ఎక్కే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకుంటారు. ఈజీ అనుకుంటే ఎక్కేస్తారు... కష్టం అనిపిస్తే దిగేస్తారు. అంతేగానీ... కసితో ప్రాణాలు పోగొట్టుకునే సాహసం చేయరు. ఎందుకంటే... వీరికి సాదా... సీదాగా జీవించడంలో ఆనందం ఉంటుంది. జీవితంపై ప్రేముంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు