Published : 26 May 2018 01:44 IST

నువ్వూ చేయగలవా ఈ ఛాలెంజ్‌?

నువ్వూ చేయగలవా ఈ ఛాలెంజ్‌?

ఫిట్‌... ఫిట్‌... ఫిట్‌నెస్‌...
సోషల్‌మీడియా అంతా అదే చర్చ. వర్క్‌అవుట్‌ వీడియోలు, ఫిట్‌నెస్‌ ఫొటోలతో ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రాంలు, వాట్సప్‌లు నిండిపోతున్నాయి. ఇప్పటికే ఫిట్‌గా ఉన్నవారు ఉల్లాసంగా తమ మార్నింగ్‌ ఎక్సైర్‌సైజుల చిత్రాలు పంచుకుంటుంటే... ఫిట్‌నెస్‌ సంపాదించాలనుకునే వారు... ఇదిగో మొదలు పెట్టేశామని ఉత్సాహం పెంచుకుంటున్నారు. ఉన్నట్టుండి దేశానికి ఏమైంది? అందరూ ఈ ఫిట్‌మంత్రా జపించడానికి కారణం ఏంటి? అంటారా?
కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ తన కార్యాలయంలోని డిప్స్‌ తీసి వీడియో పోస్ట్‌ చేసి ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరారు. దీన్ని భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్వీకరించి తన వర్క్‌అవుట్‌ వీడియోతో మరికొందరికి ఛాలెంజ్‌ విసిరారు. దీన్ని యువత ఫాలో అవుతుంటే... ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీన్ని స్వీకరించారు. త్వరలోనే తనూ తన ఫిట్‌నెస్‌ వీడియో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ పెట్టాడు. వీరికి తోడు నాగచైతన్య, సమంత వచ్చి చేరారు. ఇక చూడండి యువతలో ఉత్సాహం రెట్టింపైంది. ఫిట్‌నెస్‌ అనేక ప్రశ్నలు సోషల్‌మీడియాను ముంచెత్తుతున్నాయి. మరి మన సంగతేంటి? మీరూ ఛాలెంజ్‌ విసురుతారా?
ఫిట్‌నెస్‌ అంటే బాడీ బిల్డింగ్‌ కాదు : అవును కండలు తిరిగిన శరీరం ఉంటేనే ఫిట్‌నెస్‌ ఉన్నట్లు అనుకోవద్దంటున్నారు నిపుణులు. సాధారణంగా మన శరీరంలోని కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే ఫిట్‌నెస్‌. అవి ఏ పని చేయడానికి అయినా సహకరించినప్పుడు మీరు ధృడంగా ఉన్నట్లు లెక్క. అపార్ట్‌మెంటులో లిఫ్ట్‌ పనిచేయడం లేదు... మీరు మొత్తం ఐదంతస్తులూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కారనుకోండి మీరు ఫిట్‌గా ఉన్నట్లే. బండి పంక్ఛర్‌ అయింది... వాహనాన్ని ఓ రెండు కి.మీ. నెట్టుకు వెళ్లడానికి ఆయాస పడిపోతే ఇబ్బందేనని గ్రహించండి. ఇలా నిత్య జీవితంలో ఎన్నో పనుల్లో మన సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు.
బొజ్జ లేదు.. నాకెందుకు?:  బొజ్జలేనంత మాత్రానా ఫిట్‌గా ఉన్నట్లు కాదు. సన్నగా ఉన్నంత మాత్రానా అంతా బాగుందనుకోవద్దంటున్నారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు. ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత వ్యాయామంతోనే ఫిట్‌నెస్‌ సాధ్యమవుతుంది. 7-9 నిమిషాల్లో ఒక కిలోమీటర్‌ దూరం ఆగకుండా పరిగెత్తగలరా? అనేది మిమ్మల్ని పరిశీలించుకోవచ్చు. అలా చేయగలిగితే... మీ శరీరంలో ఇంకా పటుత్వం కోల్పోలేదని అనుకోవచ్చు. ఇదే ప్రామాణికం కాదు. మీ వయస్సు, బరువును దూరం, సమయం మారిపోతాయి. ఇంట్లోకి కావాల్సిన 25 కిలోల బియ్యం ప్యాకెట్‌ని ఎత్తుకెళ్లగలుగుతున్నారా? చెక్‌ చేసుకోండి.నువ్వూ.. ఇలా ఛాలెంజ్‌ చెయ్‌
* ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ కొని ఓ 3రోజులు మీ క్యాలరీలు, వర్క్‌అవుట్స్‌ను ఫ్రెండ్స్‌కి పంపు.
* జిమ్‌లో వర్క్‌అవుట్స్‌ చేస్తూ... వీడియో తీసి షేర్‌ చెయ్యి.
* ఇల్లైనా, ఆఫీసైనా లిఫ్ట్‌ వాడనని, మెట్లు ఎక్కుతూ ఓ వీడియో పెట్టు.
* గంటసేపు నడక ప్రారంభించి వాకింగ్‌ ఫొటోలు స్నేహితులతో పంచుకో.
* జంక్‌ఫుడ్స్‌ ఇక తినని, సంప్రదాయ ఆహారం తింటూ వీడియో అప్‌లోడ్‌ చెయ్యి.
* ఆఫీసుల్లో కుర్చీలకే అతుక్కుపోకుండా... షార్ట్‌టైమ్‌ ఎక్సైర్‌సైజులు చేస్తూ మీ ఉద్యోగులను ఛాలెంజ్‌ చెయ్యి.
* సైకిల్‌ తొక్కుతూ, బియ్యం సంచి మోస్తూ, వాటర్‌క్యాన్‌ మోసుకొని తెస్తూ... ఎంత దూరం? ఎంత సమయం? ఎంత హాయిగా ఈ పనులు చేశారో చెబుతూ పోస్టుపెట్టేయండి. ఫ్రెండ్స్‌లో ఫిట్‌నెస్‌ స్పృహ పెంచండి.
వ్యాయామం అవసరం
మనం వివిధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉండిపోతాం. అక్కడ ఉన్న పని తీరును బట్టి మన శరీరంలో కొన్ని అవయవాలకే వ్యాయమం ఉంటుంది. దీని వల్ల ఆ అవయవాలు తప్ప... మిగిలినవన్నీ ఉత్తేజం లేకుండా, ధృడత్వం లేకుండా తయారవుతాయి. అందుకే అందరికీ ఉదయం కనీసం 40నిమిషాలు వ్యాయామం అవసరమనేది. అది వర్క్‌అవుట్స్‌ కావచ్చు, వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగులు కావచ్చు, యోగా కావచ్చు.. మార్గం ఏదైనా శరీరాన్ని సమతుల్యం చేయడమే వ్యాయామ ఉద్దేశం. ఇలా చేస్తున్న ఎవరైనా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ చేయొచ్చు.

- శ్రీనివాస్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఎఫ్‌9 జిమ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు