నువ్వే బ్రాండ్‌ నీదే ట్రెండ్‌

‘ట్రెండ్‌ ఫాలో అవ్వను.. సెట్‌ చేస్తా!!’ ఎక్కడో విన్నట్టూ... పవర్‌ఫుల్‌ హీరో చెప్పినట్టు అనిపిస్తోంది కదూ! చెప్పింది ఎవరైనా డైలాగ్‌లో విషయం ఉంది! కానీ, యువత ఎంత వరకూ దీన్ని ఫాలో అవుతున్నారు? ఇలా... ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ట్రెండ్‌ సెట్టర్లుగా మారాలనుకున్నారా?

Published : 11 Aug 2018 02:11 IST

నువ్వే బ్రాండ్‌ నీదే ట్రెండ్‌

‘ట్రెండ్‌ ఫాలో అవ్వను.. సెట్‌ చేస్తా!!’ ఎక్కడో విన్నట్టూ... పవర్‌ఫుల్‌ హీరో చెప్పినట్టు అనిపిస్తోంది కదూ!
చెప్పింది ఎవరైనా డైలాగ్‌లో విషయం ఉంది! కానీ, యువత ఎంత వరకూ దీన్ని ఫాలో అవుతున్నారు?
ఇలా... ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ట్రెండ్‌ సెట్టర్లుగా మారాలనుకున్నారా?

వేసుకునే దుస్తులు.. వాడుతున్న గ్యాడ్జెట్‌లు.. తినే ఆహారం.. అన్నీ ట్రెండ్‌కి తగ్గట్టే ఉండాలి అనుకుంటారు. మార్కెట్‌లోకి ఏవైనా కొత్తవి రావడం ఆలస్యం. ఎక్కడ దొరుకుతాయ్‌? ఖరీదు ఎంత?..ఇలా మొత్తం ఆరా తీస్తారు. సొంతం చేసుకుని ఫాలో అవుతుంటారు. ఇదేం తప్పు కాదుగానీ.. ఈ క్రమంలో మీరో ముఖ్యమైన బ్రాండ్‌ని మిస్‌ అయిపోతున్నారని గుర్తించారా? సోషల్‌ వీడియాలోనో... చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌లోనో వెతక్కండి ఆ బ్రాండ్‌ ఏమిటో కాదు... మీరే!
అవును.. అ..క్ష..రా..లా మీరే. మీరే ఓ బ్రాండ్‌ అనే విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? మీదైన ప్రత్యేకతే ఓ ట్రెండ్‌ అని ఎన్నడైనా గుర్తించారా? ‘ఐ’ఫోన్‌ని మాత్రమే ట్రెండ్‌ అనుకునే మీకు ఇక ‘ఐ’   ఎక్కడ గుర్తుంటుంది చెప్పండి. ‘ఐ’ అంటే నువ్వేనని గుర్తించు.

* ఎక్కడో దేశం కానీ దేశంలో... ‘కీకీ ఛాలెంజ్‌’ అంటూ ఎవరో ఛాలెంజ్‌ చేస్తే చాలు. దాని ఉద్దేశమేంటి? అలాంటి వాటి ద్వారా ఏం చెబుతున్నాం? అదేమైనా ప్రమాదకరమా?... ఇవేం ఆలోచించకుండానే హ్యాష్‌ ట్యాగ్‌ తగిలించేస్తారు. కదిలే కారులో నుంచి దిగి ‘కీకీ’ డ్యాన్స్‌లు చేస్తారు. ఇలా ఎందరో ప్రమాదంలోనూ పడ్డారు. అయినా ఈ ఛాలెంజ్‌లో మీదైన ప్రత్యేకత ఏముంది?

* ఎక్కడో అమెరికాలో ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌. ప్రముఖులు సహా అందరూ ఛాలెంజ్‌లు విసిరారు. కొందరైతే ఐస్‌ ముక్కల్ని తలపై కుమ్మరించుకుని ఆరోగ్యం పాడయ్యి ఆసుపత్రి పాలయ్యారు. ఎందుకలా? దాంట్లో మీకు దొరికే కిక్కేంటి? ఒళ్లంతా బిగబట్టి.. కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్‌ అవ్వడమా? దీనివల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా? పోనీ మీకైనా..!

* ఇలాంటి ఛాలెంజ్‌ మరోటి. జెల్‌ క్యాండీల మాదిరిగా ప్యాక్‌ చేసి ఉంచిన సర్ఫ్‌ పౌడర్‌ ప్యాక్‌లను తినడమే ఈ ఛాలెంజ్‌. తింటే ఏం వస్తుంది? ఎందుకు తినాలి? అనే ఆలోచనే చేయకుండా ఎందరో తినే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి దారి పట్టారు.

... ఇవే కాదు. ఎప్పుడో పుట్టుకొచ్చినవి.. ఈ మధ్యే పురుడుపోసుకున్నవి చాలానే ఉన్నాయి. భిన్నంగా ఏదో చేయాలి.. ఏదోలా గుర్తింపు తెచ్చుకోవాలి.. ట్రెండింగ్‌ అని కనిపిస్తే చాలు. ఫాలో అయిపోదాం అనుకుంటే.. మీ మనుగడ మీరు కోల్పోయినట్టే! మీదైన ట్రెండ్‌ సెట్టింగ్‌ స్టఫ్‌ని బూడిదలో పోసినట్టే!

ఏదైనా ట్రెండవుతుందని గుడ్డిగా ఫాలో అవ్వొద్దు. దీనివల్ల  ప్రయోజనం ఏమిటని ఒకసారి ప్రశ్నించుకుంటే మంచిది.

ప్రభావితం అవ్వడమే!
ఓ వయసు వచ్చే వరకూ ట్రెండ్‌ అంటే ఏంటో తెలియదు ఎవ్వరికైనా. పేరెంట్స్‌ ఏది కొంటే అదే ట్రెండ్‌గా ఫీల్‌ అవుతారు. ఎప్పుడైతే.. టీనేజ్‌ వయసుకి వచ్చేస్తారో అప్పుడే బ్రాండ్‌ ఇమేజ్‌ మొదలవుతుంది. ఇంజినీరింగ్‌కి వచ్చేసరికి ట్రెండింగ్‌పైనే దృష్టి. మార్కెట్‌లో ఏ ఫోన్‌ మోడల్‌ హల్‌చల్‌ చేస్తుందో... అదే మోడల్‌ని కొనాలనుకోవడం. ఇదే కోవలోకి దుస్తులు, హెయిర్‌స్టైల్‌.. అన్నీ వచ్చేస్తాయి. మనకు ఇవి అవసరమా? మన ఆర్థిక స్థోమత దీనికి సరిపోతుందా? అని ఆలోచించకుండా ఎగబడిపోతారు. ఇదంతా అప్‌డేట్‌ అవ్వడమేగా? అనుకుంటే పొరబాటే. కేవలం మీరనుకునే ట్రెండింగ్‌కి ప్రభావితం అవ్వడం అంతే. కొద్ది రోజులకు మరోటి ట్రెండ్‌లోకి వస్తే దాన్ని ఫాలో అవుతారు. మళ్లీ దుస్తులు మారతాయి... చేతిలో ఫోన్‌ మరోటి వస్తుంది... హెయిర్‌ స్టైల్‌ ఇంకోలా మారుతుంది. వ్యక్తిగా మాత్రం మీరు గతంలో ఎలా ఉన్నారో అలానే ఉంటారు. మీ ఎక్స్‌టర్నల్‌ లుక్‌ మారుతుందంతే. ఒక్క క్షణం ఆలోచించండి. గాలివాటంగా కనిపించిన వాటికి ఆకర్షితులం అవుతున్నామా? లేదా? అనేది మీకే అర్థం అవుతుంది.

* కీకీ ఛాలెంజ్‌.. వెళ్తున్న కారు నుంచి దిగి రోడ్డుపై డ్యాన్స్‌లు చేశారు. దీన్ని వేలంవెర్రిగా ఫాలో అయ్యారు. ఎందుకిలా చేయాలి? దీనివల్ల ఉపయోగం ఏమిటి? మనకు ఇది అవసరమా? అని ప్రశ్నించుకున్న వారు తక్కువ. దీనికి బదులుగా పదిమందికి ఉపయోగపడే ఛాలెంజ్‌ మీరు సృష్టించి ట్రెండీ అవ్వొచ్చు కదా!

* ఎప్పుడూ విదేశీ బ్రాండ్‌ దుస్తులేనా? మనదేశీ వస్త్రాలు లేవా? అనుకున్నారు ఇండోర్‌కు చెందిన అభిషేక్‌ రావల్‌, విషి పోర్వల్‌ అనే యువకులు. ఇండియన్‌ థ్రెడ్స్‌ పేరుతో బ్రాండ్‌ సృష్టించి ఆన్‌లైన్‌ విక్రయాలు మొదలుపెట్టారు. ఇప్పుడది భారత్‌లో పెద్ద ట్రెండీ ఆన్‌లైన్‌ దుకాణం.

* ‘‘ఉన్నదారిలో వెళ్లడం సులభం, సుఖం. కొత్తదారిలో ప్రయాణం కష్టం... అయినా కొత్తదారిలో వెళ్లిన వారే విజేతలవుతారు. ఆ తర్వాత వారిని ఎంతో మంది అనుసరిస్తారు.’’ అని బాలగంగాధర్‌తిలక్‌ అన్నట్లు మీరే ఓ కొత్తదారి వెతుక్కోండి. అవి దుస్తులైనా, వస్తువులైనా, పరికరాలైనా... కొత్త విజయ తీరాలకు చేరండి. మిగతా వారికి ఆదర్శంగా నిలవండి.

ప్రతిభతోనే

మనమే ఓ ట్రెండ్‌ అవ్వాలంటే! టాలెంట్‌ ఉండాలి. దాన్ని గుర్తిస్తే ఎవరో ప్రవేశపెట్టిన వాటిని ఫాలో అవ్వాల్సిన పని ఉండదు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగుతుంటే.. అవి ఆడుతూ. క్రికెట్‌ మ్యాచ్‌లు అవుతుంటే వాటిని ఫాలో అవుతూ.. కబడ్డీ టైమ్‌లో కూత పెడుతూ వెళ్తే ప్రభావితులం అవుతాం తప్పితే. ప్రతిభావంతులం కాలేం. మరెప్పుడు ప్రతిభావంతులయ్యేది? మనలోని టాలెంట్‌ని గుర్తించినప్పుడు. అప్పుడే మనదైన శైలిలో ట్రెండ్‌ని సెట్‌ చేయగలుగుతాం. ఎక్స్‌టర్నల్‌, ఇంటర్నల్‌ ట్రెండ్స్‌ రెండు ఉంటాయి. ఎక్స్‌టర్నల్‌ అంటే.. ఆటలు, ఫ్యాషన్స్‌, నటన, సంగీతం.. లాంటివి. సచిన్‌ క్రికెట్‌ దేవుడు ఎలా అయ్యాడు? క్రికెట్‌ రూపంలో ఆటగా తనలో పుట్టుకొచ్చిన ఎక్స్‌టర్నల్‌ టాలెంట్‌తోనే. టీనేజ్‌ ప్రాయంలోనే గుర్తించాడు. సాధన చేశాడు. పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో క్రికెట్‌లో చెరగని ముద్రవేశాడు. అదే తనలోని ప్రతిభని ఏ 50 ఏళ్లకో గుర్తిస్తే ఇంతగా ఎదిగేవాడు కాదేమో!

* ఇక ఇంటర్నల్‌ టాలెంట్‌. మనిషి వ్యక్తిత్వంలో నుంచి వెలుగులోకి వచ్చేవి. అందుకు మహాత్ముడే ఉదాహరణ. తను నమ్మిన విలువలు, వ్యక్తిత్వంతోనే భారతదేశ చరిత్రలో చెరగని ముద్రవేసి జాతిపిత అయ్యాడు. గాంధీజీ దుస్తులు, మొలకి వేలాడే గడియారం... ధరించిన కళ్లజోడు... ఇప్పటికే ఆయనకే సొంతమైన ట్రెండ్స్‌. ఒక్కమాటలో చెప్పాలంటే... పులి చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడం సరైంది కాదు. ఆలస్యం చేయకుండా చదువుతో పాటు మీలోని దాగున్న టాలెంట్‌ ఏంటో గుర్తించండి. సానపెట్టండి. ట్రెండ్‌ని సెట్‌ చేయండి.

మీదైన ట్రెండ్‌ ఏంటి?
వ్యక్తిత్వం, ప్రతిభ ఈ రెండింటినీ సమతూకంగా బ్యాలెన్స్‌ చేసినప్పుడే మీకు ట్రెండ్‌ అంటే ఏమిటి? మీలో దాగున్న ట్రెండింగ్‌ విషయం ఏంటో తెలుస్తుంది. మ్యూజిక్‌లో ఏఆర్‌ రెహమాన్‌ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. అతనికెలా సాధ్యం అయింది? క్రికెట్‌లో విరాట్‌ ఓ బ్రాండ్‌. ఎలా అయ్యాడు? ఇక సినిమాల్లో మహేష్‌. నిన్నగాక మొన్న ‘మహర్షి’ అంటూ టీజర్‌తో ముందుకొచ్చాడు. నూనూగు మీసాలు, గడ్డంతో మరో ట్రెండ్‌కి తెర లేపాడు. వీళ్లే కాదు. మరెందరో ట్రెండ్‌ని ఫాలో అవ్వడమే కాకుండా సెట్‌ చేస్తూ ఎంపిక చేసుకున్న రంగంలో ఎదురులేకుండా సాగిపోతున్నారు. మరి, మీరూ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవాలంటే? మీలో దాగున్న ప్రతిభని గుర్తించి నిత్యం సానబెట్టాలి. దాంతో పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోవాలి. మీకు పాటలు పాడడం ఇష్టం. అది అంతర్గతంగా దాగున్న మీలోని ప్రతిభ. దాన్ని సానబెట్టుకుంటూ పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగితే మీరో మంచి గాయకుడిగా ట్రెండ్‌ సెట్టర్‌ అవ్వొచ్చు. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాలో జైరా వాసిమ్‌ మాదిరి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోవచ్చు.

- వేణుగోపాల్‌రెడ్డి, సైకాలజిస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని