అతడితో పెళ్లి... నాపై ప్రేమ!

నేనో అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయా. కానీ తనకు ఇదువరకే పెళ్లైంది. అదే నా సమస్య. ఖనాకు నా భర్తకన్నా నువ్వంటేనే ఇష్టం అంటోందామె....

Published : 14 Jan 2016 15:57 IST

అతడితో పెళ్లి... నాపై ఎందుకింత ప్రేమ!


 నేనో అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయా. కానీ తనకు ఇదువరకే పెళ్లైంది. అదే నా సమస్య. ఖనాకు నా భర్తకన్నా నువ్వంటేనే ఇష్టం’ అంటోందామె. ఆమెతో రెండుమూడుసార్లు దూర ప్రయాణాలు చేశా. ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాం. తనని విడిచి ఉండలేని పరిస్థితికి వచ్చా. పనిపై మనసుపెట్టలేకపోతున్నా. ఏం చేయాలి?

జగన్‌, ముంబై

ప్రేమలో ఉన్నప్పుడు అంతా సంతోషమే అనుకోవడం కేవలం భ్రమే అంటాడు వైటన్‌ అనే సైకాలజిస్టు. ప్రేమికులకీ ఇతరుల్లాగే కష్టసుఖాలు, అన్నిరకాల భావోద్వేగాలుంటాయంటాడు. మీరు పనిపై మనసు లగ్నం చేయకపోవడం ఇలాంటిదే. అయినా మీ సమస్యకి ఇలా చేయండి, అలా చేయండి అని ఒక్కమాటలో సమాధానం చూపలేం. సమస్యని అన్నికోణాల నుంచి అర్థం చేసుకుంటే ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోగలరు. మీరిద్దరూ రెండుమూడుసార్లు కలిసి ప్రయాణించాం అని రాశారు. రెండుసార్లా? మూడుసార్లా? ప్రేమించిన అమ్మాయితో కలిసి ప్రయాణించడం మరపురాని అనుభూతి. ఇంత ముఖ్యమైన విషయాన్ని మీరెలా మర్చిపోయారు? ఖమేం ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాం’ అంటున్నారు. దీన్నిబట్టి మిమ్మల్ని మీరు నమ్మించుకోవడానికే ఇలా భావించుకుంటున్నారనిపిస్తోంది. ఇలా సర్దిచెప్పుకోవడాన్ని సైకాలజీలో ఖరేషనలైజేషన్‌’ అంటారు. మీరు ప్రేమించిన అమ్మాయి తన భర్తని ఎందుకు ఇష్టపడటం లేదు, అతని ప్రవర్తన, అలవాట్లు, ఆలోచనలు ఎందుకు నచ్చడం లేదో అడిగి తెలుసుకోండి. మీలోనూ అలాంటి లక్షణాలుంటే భవిష్యత్తులో మిమ్మల్నీ తప్పు పట్టొచ్చు. కారణం ఏదైనా ప్రస్తుతం ఆమె కుంగుబాటులో ఉంది. ఇలాంటివాళ్లు మరొకరిపై ఇట్టే ఆధారపడతారు. కాస్త అభ్యంతరం ఉన్నా ప్రేమపెళ్లిళ్లని సమాజం ఆమోదిస్తోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే మీరు ప్రేమించిన అమ్మాయి వివాహిత. మీ బంధానికి సంఘంతోపాటు అమ్మానాన్నలు, బంధువుల ఆమోదమూ దొరకదు. ఆమెకు విడాకులు ఇవ్వడానికి భర్త ఒప్పుకుంటాడా, లేదా అన్నది మరో సమస్య. ఆమె మీ సొంతం కావాలంటే ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ జరిగేవేనా? దీంతోపాటు మీ కెరీర్‌, భవిష్యత్తు గురించి కూడా క్షుణ్నంగా ఆలోచిస్తే ఏ నిర్ణయం తీసుకోవాలో మీకే అర్థం అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని