ఆమె ప్రేమకి అర్హులెవరు?

నేను, వంశీ ప్రాణ స్నేహితులం. ఏడాది నుంచి వాడో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇంట్లో వాళ్లూ ఆమోదించారు. ఈలోపు ఆ అమ్మాయి తనను నిజంగానే ప్రేమిస్తుందో, లేదో కనుక్కొమ్మని నన్ను...

Published : 14 Jan 2016 16:06 IST

ఆమె ప్రేమకి అర్హులెవరు?


నేను, వంశీ ప్రాణ స్నేహితులం. ఏడాది నుంచి వాడో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇంట్లో వాళ్లూ ఆమోదించారు. ఈలోపు ఆ అమ్మాయి తనను నిజంగానే ప్రేమిస్తుందో, లేదో కనుక్కొమ్మని నన్ను పురమాయించాడు. తనకి పరిచయం చేయించాడు. వంశీ చెప్పినట్టే రోజూ ఆమెకి ఫోన్‌ చేస్తూ పార్కులు, సినిమాలకు తిప్పేవాడ్ని. మొదట్లో ఇవి తనిష్టపడకపోయినా తర్వాత నేను చెప్పినట్టు వింటోంది. ఇవన్నీ చూస్తే తను నన్నే ప్రేమిస్తున్నట్టు అనిపిస్తోంది. అసలింతకీ తను మా ఇద్దరిలో ఎవర్ని ప్రేమిస్తుందో తెలియడం లేదు. నన్ను ప్రేమిస్తే ఫ్రెండ్‌ని మోసం చేసినట్టు. వాడ్ని ఇష్టపడితే నాకు గుండెకోత. ఇప్పుడు నేనేం చేయాలి?

రవి, ఈమెయిల్‌

 ఇది చదివాక మీ ఫ్రెండ్‌ది స్వచ్ఛమైన ప్రేమ కాదనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. అబ్రహం మాస్లో అనే సైకాలజిస్టు నిజమైన ప్రేమను ఖబీయింగ్‌ లవ్‌’ అంటాడు. ఈ ప్రేమలో ప్రేమికులిద్దరికీ ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంటుంది. బహుశా మీ మిత్రుడిది ఖడెఫియెన్సీ లవ్‌’ కావొచ్చు. దీంట్లో అవతలి వ్యక్తిని నమ్మొచ్చా? ఆమె/అతడి ప్రేమతో లాభమేంటి? అని బేరీజు వేసుకుంటారు. ఇలాంటి మానసిక స్థితిని అసలు ప్రేమే అనలేం. దీన్ని ఖసింబయాటిక్‌ లవ్‌’ అంటాడు ఎరిక్‌ఫ్రోమ్‌.

 మీ మిత్రుడు తన ప్రేయసి ప్రవర్తనను శల్య పరీక్ష చేయడానికి మిమ్మల్నో డిటెక్టివ్‌గా నియమించాడు. ఇలా చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని హేళన చేయడమే. తాను ప్రేమించిన అబ్బాయిని సంతోష పెట్టడానికే తను మీతో చనువుగా ఉంటోంది. మిమ్మల్ని మంచి స్నేహితుడిగా భావిస్తోంది. సామీప్యత, ఆదరణ, తరచూ కలుసుకోవడం.. ఈ మూడు దశల్లో ఇద్దరి వ్యక్తుల మధ్య పరిచయం ఏర్పడుతుందంటాడు. ఈ స్థితిలో ఆ ఇద్దరూ ఒకర్నుంచి ఒకరు ఏమీ ఆశించరు. ఇదే తరచూ జరుగుతుంటే స్నేహానికి దారి తీస్తుంది. ఎదుటివాళ్లు అపోజిట్‌ జెండర్‌ అయితే శారీరక ప్రక్రియలు రావడం సహజం. దురదృష్టవశాత్తు దీన్నే ప్రేమ అని పొరబడుతోంది నేటి యువత. మీరూ మీ స్నేహాన్ని ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఖనేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ఆ అమ్మాయి మీతో ఎప్పుడూ చెప్పలేదుగా! అందుకే వెంటనే అనవసర వూహాగానాలు కట్టిపెట్టి జరిగిందంతా మీ స్నేహితునితో చెప్పండి. పశ్చాత్తాప భావాల నుంచి బయటపడతారు. మీకు గుండెకోత తప్పుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని