అదీ తీరు.. పెళ్లాడొచ్చా?

విదేశాల్లో ఉండే దగ్గరి బంధువు ఒకతను నాకు ప్రపోజ్‌ చేశాడు. తనలో నాకు అన్నీ నచ్చుతాయి.

Published : 03 Feb 2016 17:17 IST

అదీ తీరు.. పెళ్లాడొచ్చా?

విదేశాల్లో ఉండే దగ్గరి బంధువు ఒకతను నాకు ప్రపోజ్‌ చేశాడు. తనలో నాకు అన్నీ నచ్చుతాయి. తల్లిదండ్రులను గౌరవిస్తాడు. తోబుట్టువుల బాధ్యతలు తీసుకుంటాడు. కానీ నా పెళ్లి మా అమ్మానాన్నల ఇష్టప్రకారం జరగాలనేది నా కోరిక. అదే అంటే వాళ్లనూ ఒప్పిస్తానని అన్నాడు. నా జవాబు కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ సమస్య ఏమిటంటే తను అప్పుడప్పుడు మిత్రులతో కలిసి పార్టీలో మద్యం తాగుతాడు. అతడిలో ఎన్ని మంచి లక్షణాలున్నా ఈ అలవాటు కారణంగా ముందడుగు వేయలేకపోతున్నా. ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి.

 

- ఒక పాఠకురాలు, హైదరాబాద్‌

స్నేహితులతో కలిసి తాగడాన్ని నేను సమర్థించను. అయినా దీన్నో పెద్ద తప్పుగా కూడా భావించలేం. ఇదే మీ పెళ్లికి అడ్డంకి అనుకుంటే అది మీ పొరపాటే. అతడి ప్రవర్తన బాగున్నపుడు, అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నపుడు, పెద్దల్ని గౌరవిస్తున్నపుడు ఈ విషయంపై అంత తీవ్రంగా స్పందించడం అనవసరం. కార్పొరేట్‌ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు ఆల్కహాల్‌ తీసుకోవడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. పరిమితుల్లో ఉన్నంతవరకు ఇది ఆపేక్షించదగ్గ విషయం ఎంతమాత్రం కాదు. మితంగా ఉన్న అలవాటు భవిష్యత్తులో అతిగా మారుతుందేమో, తను మందుకు బానిస అవుతాడేమో అనే భయం

బహుశా మీలో ఉండొచ్చు. కానీ అతడి ప్రవర్తన బట్టి చూస్తే అలా మారే ఆస్కారం లేదు. మాస్సే, ట్రెంబ్లే అనే మానసికవేత్తలు మద్యానికి బానిసైన వ్యక్తులపై లోతైన అధ్యయనం చేశారు. వాళ్ల అధ్యయనం ప్రకారం తాగుడుకు బానిసైనవారు కోరికలను అదుపులో పెట్టుకోలేరు. సంఘంలోని నియమాలకు కట్టుబడి ఉండరు. కేవలం తమ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. మెక్‌మోహన్‌, రిచర్డ్‌ అనే సైకాలజిస్టుల పరిశోధనలూ ఇవే విషయాలు తేల్చాయి. అంతేకాకుండా ఈ వ్యక్తుల సాంఘిక సర్దుబాటు సవ్యంగా ఉండదని కూడా తేలింది. ప్రఖ్యాత సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ‘సైకో ఎనాలసిస్‌’ అతి ముఖ్యమైన, ఆసక్తికరమైన మానసిక సిద్ధాంతం ప్రవేశ పెట్టాడు. దీనిప్రకారం ఆల్కహాల్‌కు బానిసైన వాళ్ల మనస్తత్వాన్ని substance abuse Personality అని తెలిపాడు. ఈ వ్యక్తుల మనస్తత్వం మీరు ఇష్టపడ్డ వ్యక్తి మనస్తత్వానికి భిన్నంగా ఉంది. ఇవన్నీ గమనించిన తర్వాత మీ బంధువు తాగుడుకు బానిస అవుతాడనుకోవడం ఒట్టి అపోహే. అయినా మీకు నమ్మకం కలగకపోతే అతడితోనే నేరుగా విషయం చెప్పండి. పార్టీలకు వెళ్లొద్దనీ, మందుకు దూరంగా ఉండాలని ఒట్టు వేయించుకోండి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తికి ఈ అలవాటు మానుకోవడం ఏమాత్రం కష్టం కాదు. పైమెట్టు మీద కాలు పెడితే జారిపడతాం అనే ఆలోచనలుంటే మనం అసలు మెట్లే ఎక్కలేం. జాగ్రత్తలో ఉండటం మంచిదేకానీ అసలు మనుషులనే నమ్మకపోవడం కూడా సమంజసం కాదు. అందుకే మేలెంచి కీడెంచండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు