మోసపోయినా.. మోజు తగ్గదే?

బీటెక్‌ థర్డియర్‌ చదువుతున్నా. పేపర్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి ఓసారి వేరే కాలేజీకె’ళ్లా. అక్కడ సెల్‌ నెంబర్‌ సహా వివరాలన్నీ ఇచ్చా.

Published : 30 Apr 2016 01:23 IST

మోసపోయినా.. మోజు తగ్గదే?

బీటెక్‌ థర్డియర్‌ చదువుతున్నా. పేపర్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి ఓసారి వేరే కాలేజీకె’ళ్లా. అక్కడ సెల్‌ నెంబర్‌ సహా వివరాలన్నీ ఇచ్చా. కొద్దిరోజులకు ఓ అబ్బాయి ఫోన్‌ చేసి ఓ పార్టీకి చెందిన యువ నాయకుడినని పరిచయం చేసుకున్నాడు. అన్నీ తెలిసినట్టే నా గురించి చాలా విషయాలు చెప్పాడు. బహుశా తను మా దూరపు బంధువు అనుకున్నా. క్రమంగా మామధ్య మాటలు కలిశాయి. అతడి మాటతీరు, పద్ధతి నచ్చి ప్రేమలో పడిపోయా. ఓరోజు గుడిలో కలుసుకున్నాం. తన వయసు ఎక్కువనిపించింది. అయినా మనస్ఫూర్తిగా ప్రేమించాక అదేం పట్టించుకోవద్దని సర్దుకుపోయా. తరచూ కలుసుకునేవాళ్లం. ఎలాగూ పెళ్లి చేసుకుంటానని అతడికి అన్నిరకాలుగా దగ్గరయ్యా. కానీ తనకి ఇంతకు ముందే పెళ్లైందనీ, పదేళ్ల కొడుకున్నాడనే విషయం తెలిసింది కొన్నాళ్లకి. భరించలేక అతడ్ని దూరంగా పెట్టా. కానీ ఇప్పటికీ అతడ్ని మర్చిపోలేకపోతున్నా. ప్రస్తుతం వేరొకర్ని పెళ్లాడితే అది మోసం చేయడమే అనే అపరాధ భావం కుంగదీస్తోంది. ఈ బాధలోంచి బయటపడటమెలా?

- ఓ పాఠకురాలు

నువ్వు అతడ్ని సులువుగా నమ్మావు కాబట్టే మోసం చేయగలిగాడు. పేరు, పెళ్లి, కొడుకు... అన్ని విషయాల్లోనూ అబద్ధమే చెప్పాడు. ఇదంతా కేవలం నిన్ను నమ్మించడానికే. నిన్ను ఇంప్రెస్‌ చేయడానికే అన్ని విషయాలు తెలుసుకున్నాడు. కౌమారంలో ఉన్న వాళ్లలో హార్మోన్స్‌ తీవ్రమైన భావోద్వేగాలను కలిగిస్తాయి. దీన్నే ప్రేమగా పొరపడుతుంటారు. అబ్రహం మాస్లో అనే ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త ప్రేమలో ‘డెఫిషియెన్సీ లవ్‌’, ‘బీయింగ్‌ ఇన్‌ లవ్‌’ అనే రెండు రకాల ప్రేమలు ఉంటాయని తెలిపాడు. విద్యార్థి దశలోని ప్రేమ బీయింగ్‌ ఇన్‌ లవ్‌. హార్మోన్స్‌ వలన కలిగే శారీరక ప్రేరణకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నీవు ప్రేమించానని భ్రమపడ్డ వ్యక్తిలో కూడా ఇదేరకమైన ప్రేమ ఉండొచ్చు. ఇలాంటి వాళ్లు ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా చూడరు. కేవలం వస్తువుగా జమ కడతారు. తమ ప్రయోజనాల కోసమే ప్రేమిస్తున్నట్టు నటిస్తారు.

నిన్ను మోసగించిన వ్యక్తి ప్రవర్తనను జాన్‌ ఆలెన్‌లీ అనే సామాజిక తత్వవేత్త కోణం నుంచి చూస్తే మరింత సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రేమ గురించి మాట్లాడుతున్నపుడు అందరూ ఒకే భాషలో మాట్లాడ్డం లేదని లీ చెబుతాడు. ప్రేమ ఒక రంగులాంటిది. రెండు ప్రాథమిక రంగులు కలిపితే ఇంకో కొత్త వర్ణంగా మారుతుంది అంటాడు ఆలెన్‌లీ. వివిధ కారణాలతో ఏర్పడ్డ ప్రేమను ఆలెన్‌లీ ఆరు రకాలుగా విభజించాడు. నిన్ను మోసగించిన వ్యక్తి ప్రేమను లూడస్‌ లవ్‌ (ludus love) అనొచ్చు. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న వ్యక్తులకు ప్రేమ కేవలం ఒక ఆటలాంటిది. ఈ ప్రేమికుడు మానసిక బాంధవ్యాలకు దూరంగా ఉంటాడు. తక్షణ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాడు. ఒకేసారి ఇద్దరు, ముగ్గురితో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. విద్యార్థిగా నీ దృష్టి కోణం చదువుపైనే ఉండాలి. ఇకనైనా ఎవర్నీ గుడ్డిగా నమ్మి మోసపోకు. జరిగినదాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపో. కాలమే నీ మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. చదువుపైన ఏకాగ్రత పెడితే అన్నీ సర్దుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని