అమ్మానాన్నా, ప్రేమా.. ఎవరిని వదిలేది?

ఒకబ్బాయి నన్ను ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్‌ చేశాడు. తనంటే నాకూ ఇష్టమే.

Published : 14 May 2016 01:11 IST

అమ్మానాన్నా, ప్రేమా..ఎవరిని వదిలేది?

ఒకబ్బాయి నన్ను ప్రాణంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్‌ చేశాడు. తనంటే నాకూ ఇష్టమే. అతడ్ని అంగీకరిస్తే జీవితాంతం సుఖంగా ఉంటానని తెలుసు. కానీ మా కులాలు వేరు. మా అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకోరు. మా అక్క ప్రేమ కారణంగా వాళ్లిప్పటికే ఇబ్బంది పడుతున్నారు. వారిని మరింత ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే అతడి ప్రేమ తిరస్కరించా. తను తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. నేను తట్టుకోలేకపోతున్నా. ‘నీ తల్లిదండ్రుల కోసం ప్రేమ త్యాగం చేస్తున్నావు. కానీ భవిష్యత్తులో నా ప్రేమ విలువేంటో నీకు తెలుస్తుంది’ అన్నాడు. నాలో అయోమయం. కన్నవాళ్ల కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పా?

- దేవిక

మీ సమస్య క్లిష్టమైనదే కానీ పరిష్కారం దొరకనిది మాత్రం కాదు. స్వార్థం చూసుకోకుండా తల్లిదండ్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలనుకునే మీ ఆలోచన ప్రశంసనీయం. మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ అక్క కూడా ప్రేమలో పడిందనీ, అమ్మానాన్నలు పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. తనకి ఇంకా పెళ్లి కాకపోతే ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆగడం ఒక పద్ధతి. మీ అక్కతో కలిసి అమ్మానాన్నలను ఒప్పించి ప్రేమించిన వ్యక్తులను పెళ్లాడ్డం మరో పద్ధతి.

ప్రేమలో పడ్డపుడు శరీరం, మనసు తీవ్ర భావోద్వేగానికి గురవుతాయి. ప్రేమించిన వ్యక్తిలో అన్నీ మంచి లక్షణాలే కనిపిస్తాయి. పెళ్లితో ఒక్కటయ్యాక ఈ భావన కనుమరుగవుతూ ఉంటుంది. తను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మీ మానసిక ఆందోళనను గుర్తించాలి. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మీ తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. వేరే రకంగా మీపై ఒత్తిడి తేకూడదు.

మానసిక దగ్గరితనం, ఆకర్షణ, నిబద్ధత... అమ్మాయి, అబ్బాయిల మధ్య ప్రేమలో ప్రధాన లక్షణాలు అంటాడు స్టెర్న్‌బర్గ్‌ అనే మానసిక శాస్త్రవేత్త. ఇద్దరి మధ్య మానసిక దగ్గరితనం, ఆకర్షణ ఉంటే అది ప్రేమగా మారుతుంది. మానసిక దగ్గరితనం, ఆకర్షణ మాత్రమే ఉండి నిబద్ధత లేని ప్రేమను రొమాంటిక్‌ లవ్‌ అంటారు. శరీర ఆకర్షణ తగ్గినా, ఏవైనా కారణాలతో ప్రేమికులు దూరమైనా ఈ ప్రేమ క్షీణిస్తుంది. మానసిక దగ్గరితనం, ఆకర్షణలతోపాటు నిబద్ధత ఉంటే దాన్ని కంపాషనేట్‌ లవ్‌ అంటారు. ఈ ప్రేమలో ఎదుటి వ్యక్తి బాధ, సమస్యలను తమవిగా భావిస్తారు. ఎదుటివారి లోపాలను సైతం అంగీకరిస్తారు. మీది ఏ రకమైన ప్రేమో తెలుసుకోండి. నిజమైన ప్రేమే అయితే మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇద్దరు కలిసి చర్చించుకోండి.

ఏ తల్లిదండ్రులైనా కూతురు సంతోషమే కోరుకుంటారు. అతడ్ని పెళ్లాడితే మీ కుటుంబ గౌరవం ఎలా పెరుగుతుందో మీ నమ్మకాన్ని ఆధారాలతో సహా అమ్మానాన్నల ముందుంచండి. చదువు, ఉద్యోగం, హోదా, కుటుంబనేపథ్యం, అబ్బాయి ప్రవర్తన... అన్నీ బాగుంటే వాళ్లూ సానుకూలంగా స్పందించవచ్చు. వాళ్ల వాదన ఎలా ఉన్నా సహనంతో వారిని ఒప్పించాల్సిన బాధ్యత మీ ఇద్దరిదీ. అమ్మానాన్నలా? ప్రేమికుడా? ఎవరిని త్యాగం చేయాలి అనే ఆలోచనే తప్పు. సరిగ్గా ప్రయత్నిస్తే ఇద్దరినీ దక్కించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని