సాన్నిహిత్యం చూపితే సొంతమంటాడా?

నేనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీసులో చేరిన కొత్తలోనే ఓ అబ్బాయితో సాన్నిహిత్యం ఏర్పడింది. కలిసి సినిమాలు చూశాం. షికార్లకెళ్లాం. ఉద్యోగ రీత్యా...

Published : 18 Jun 2016 01:27 IST

సాన్నిహిత్యం చూపితే సొంతమంటాడా?

* నేనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీసులో చేరిన కొత్తలోనే ఓ అబ్బాయితో సాన్నిహిత్యం ఏర్పడింది. కలిసి సినిమాలు చూశాం. షికార్లకెళ్లాం. ఉద్యోగ రీత్యా ఈమధ్య వేరొక అబ్బాయితో తరచూ మాట్లాడాల్సి వస్తోంది. ఇలా చేయడం మొదటబ్బాయికి నచ్చలేదు. అతడితో మాట్లాడొద్దని షరతులు పెడుతున్నాడు. ఈ పెత్తనం ఏంటో అర్థం కావడం లేదు. మేం కనీసం ప్రేమించుకుంటున్నట్టు కూడా ఒకరికొకరం చెప్పుకోలేదు. పెళ్లి మాటే ఎత్తలేదు. అతడి ఒత్తిడి భరించలేకపోతున్నాను. పరిష్కారం చూపండి.

- ఓ పాఠకురాలు

మీరు అదృష్టవంతులు. మీ స్నేహితుడి అసలు రూపం ముందే బయటపడింది. ఈ కాలంలో అమ్మాయిలు ఉన్నతోద్యోగాలు చేయడం, నలుగురిలో కలివిడిగా ఉండటం సహజం. మీ ఫ్రెండ్‌ ఈ విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? అవివేకంగా, అనాగరికంగా ఉన్న అతడి ప్రవర్తనకు మీరు బాధ పడాల్సిన పన్లేదు.

మానసిక శాస్త్రంలో ‘సెల్ఫ్‌ ఎస్టీమ్‌’ అనే పదం ఒకటుంది. దీన్నే ఆత్మగౌరవం అనుకోవచ్చు. అంటే ఇతరుల అంగీకారం, ఆమోదంతో పని లేకుండా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. మన ప్రవర్తనపై, మనం తీసుకున్న నిర్ణయాలపై మనకు నమ్మకం ఉండటం. ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. మన నిర్ణయాలను, మన ప్రవర్తనను మనమే నమ్మిన విలువల ప్రాతిపదికగా పరిశీలించుకోవాలి. ఇలా చేయనప్పుడు మన సెల్ఫ్‌ఎస్టీమ్‌ ఇతరుల ప్రశంసలు, ఆమోదం మీద ఆధారపడి ఉంటుంది.

ఆత్మగౌరవం తక్కువగా ఉంటే మన పనులు, ప్రవర్తనను ఎవరైనా పొగిడితే, ఆమోదిస్తే సంతోషిస్తాం. లేకపోతే కుంగిపోతాం. మీ సమస్య చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీలో ఆత్మగౌరవం తక్కువగా ఉందనిపిస్తోంది. మీరు ఎలాంటి తప్పూ చేయనపుడు మీ స్నేహితుడి ప్రవర్తనను లెక్క చేయాల్సిన అవసరం లేదు. అనవసర కారణాలకు మీ స్నేహం కోల్పోవడం అతడు బాధ పడాల్సిన విషయం. మీరు ఒత్తిడికి గురవడంలో అర్థం లేదు. మీ స్నేహితుడిలోనూ ఆత్మగౌరవం తక్కువగా ఉంది. అదే ఆత్మన్యూనతకు దారి తీస్తోంది. తనతో సన్నిహితంగా ఉన్న అమ్మాయి మరొకరితో మాట్లాడితే తనకు దక్కకుండా పోతుందనే అభద్రత అతడ్ని భయపెడుతూ ఉండొచ్చు. లేదా మీ గురించి ఎవరైనా చెప్పుడు మాటలు చెబితే విని ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు అతన్ని ఎలాగోలా ఒప్పించి స్నేహం కొనసాగించినా మరోసారి ఇలాంటి సందర్భం తలెత్తదనే నమ్మకం లేదు. మీ స్నేహం కొనసాగినా, విడిపోయినా మీరు ముందు సెల్ఫ్‌ఎస్టీమ్‌ను పెంచుకొనే ప్రయత్నం చేయండి. మీ నిర్ణయాలు, ప్రవర్తనను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోండి. మీ తప్పులు మీరే సరిదిద్దుకోండి. మీ జీవితం మీది. దాన్ని మీకు నచ్చినట్టు తీర్చిదిద్దుకొని అభివృద్ధి చెందే, ఆనందించే హక్కు మీకు మాత్రమే ఉంది. ఇతరుల తప్పునకు మీరు కుంగిపోవద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని