ఇంటర్వ్యూ అంటేనే చెమట్లు

నాదో వింత సమస్య. మంచి మార్కులతో బీటెక్‌ పూర్తి చేశా. అర్హతున్న ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తు చేస్తున్నా. కానీ ఇప్పటివరకు ఏదీ ఇంటర్వ్యూ వరకెళ్లలేదు. నేను దరఖాస్తు పంపిస్తున్నప్పుడే...

Published : 09 Jul 2016 01:30 IST

ఇంటర్వ్యూ అంటేనే చెమట్లు

నాదో వింత సమస్య. మంచి మార్కులతో బీటెక్‌ పూర్తి చేశా. అర్హతున్న ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తు చేస్తున్నా. కానీ ఇప్పటివరకు ఏదీ ఇంటర్వ్యూ వరకెళ్లలేదు. నేను దరఖాస్తు పంపిస్తున్నప్పుడే ఉద్యోగం వచ్చినట్టు, అందులో చేరి అన్ని కోర్కెలు తీర్చుకుంటున్నట్టు కలలు కంటాను. ఇంటర్వ్యూ రోజు వచ్చేసరికి ఒళ్లంతా చెమట్లు పడతాయి. గది నుంచి బయటికెళ్లడానికి కాళ్లు కదలవు. నాకోసం వేరే మంచి ఉద్యోగం వేచి చూస్తుందని నాకు నేను సర్దిచెప్పుకుంటా. ఈ పరిస్థితి మారేదెలా?

- కేవీఎన్‌, హైదరాబాద్‌

మీలో సోషల్‌ ఫోబియా కనిపిస్తోంది. కలివిడితనం లేనివారు ఈ సమస్య బారిన పడతారు. సెమినార్లు, ప్రాజెక్టు వర్కు, స్నేహితుల కారణంగా మీలో ఈపాటికే నలుగురిలో ధైర్యంగా తిరిగే, మాట్లాడే లక్షణం వచ్చి ఉండాలి. లేదంటే ఈ ఫోబియా బహుశా ఈ కాలంలోనే పెరిగి ఉండొచ్చు. ఇంటర్వ్యూ అనేది భావి జీవితాన్ని నిర్ణయించేది కావడం, కొత్త వ్యక్తుల మధ్య మాట్లాడాల్సి రావడం కూడా భయం పెరగడానికి కారణాలు. ఈ మధ్యకాలంలో కంపెనీలు అభ్యర్థులను టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, బృంద చర్చలు, తుది ముఖాముఖి దశల్లో పరీక్షించి ఎంపిక చేసుకుంటున్నాయి. స్నేహపూరిత వాతావరణంలో జరిగే ఈ దశలన్నీ అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేవే.

కలలు కంటూ కూర్చుంటే ఒరిగేదేమీ ఉండదు. కల నిజం చేసుకోవాలంటే ‘థింక్‌ పాజిటివ్‌, బీ పాజిటివ్‌, యాక్ట్‌ పాజిటివ్‌’ అనే సూత్రం గుర్తుంచుకోవాలి. ముందు అంతా మంచే జరుగుతుందని ఆలోచించాలి. సానుకూల ధోరణితో ఉండాలి. సానుకూల ధోరణతో ప్రవర్తించాలి. సమాధానాలు సరిగా చెప్పకపోతే ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తారనీ, ఎద్దేవా చేస్తారని లోలోపల మథనపడుతూ ఉండొచ్చు. ఈ ఆలోచనే బహుశా మీలో నెగెటివ్‌ ఆలోచనలు పెంచుతోంది. అందుకే మీకు చెమట్లు పడుతున్నాయి. ఇంటర్వ్యూ సరిగా చేయకపోయినా మిమ్మల్నెవరూ శిక్షించరనే విషయం గుర్తుంచుకోండి.

పగటి కలలనే ఫాంటసీలంటారు. ఫాంటసీ ప్రాథమికస్థాయిలో వ్యక్తి అభ్యున్నతికి కారణమవుతుంది. శ్రుతి మించితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇంటర్వ్యూకు తప్పని సరిగా వెళ్లాలి. తెలిసింది చెప్పాలి. సానుకూల ధోరణిలో ఇంటర్వ్యూ పూర్తిచేయడం ద్వారా ఉద్యోగం సంపాదించాలి. తద్వారా లక్ష్యాన్ని చేరాలి అనే ఆలోచనను నిరంతరం మనసులో నిలుపుకోండి. మీ లక్ష్యం ఉద్యోగం సంపాదించడం వరకే. తర్వాత ఏం చేయాలనే ఆలోచనలను కనీసం ఇంటర్వ్యూ ముందురోజు వరకైనా మీ మనసులోకి రానివ్వద్దు. అయినా పరిష్కారం దొరక్కపోతే వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని